Begin typing your search above and press return to search.

డ‌బ్బా కొట్టుకోవ‌డం ఆపేయ్ బాబు

By:  Tupaki Desk   |   4 Sep 2016 11:20 AM GMT
డ‌బ్బా కొట్టుకోవ‌డం ఆపేయ్ బాబు
X
ఓటుకు నోటు కేసు విచార‌ణ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును తీవ్రంగా ఇక్క‌ట్ల పాలు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ మాజీ నాయ‌కుడు - ఏపీ కాంగ్రెస్‌ శాసనమండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య తాజాగా బాబుపై సెటైర్ల మీద సెటైర్లు పేల్చారు. నేను నిప్పు... నిజాయతీ పరుడినని డబ్బా కొట్టుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణకు ఎందుకని అప్పీలుకు వెళ్తున్నాడో ప్రజలకు వివరించాలని కోరారు. నీవు నిజాయతీ పరుడి వైతే ఓటుకు నోటు కేసులో ఎందుకు అంతగా భయపడాల్సి వస్తోందని రామ‌చంద్ర‌య్య‌ ప్రశ్నించారు.

ఓటుకు నోటు కేసులు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కేంద్రం రాజీ చేసినట్లుందని రామ‌చంద్ర‌య్య అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకే పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సి ఉండగా చంద్ర‌బాబు మాత్రం పరుగు పరుగున విజయవాడకు ప‌రిపాల‌న తరలించారని అన్నారు. ఆయన స్వలాభం కోసం ఉద్యోగులను కూడా ఇబ్బంది పెట్టాడని వ్యాఖ్యానించారు. కేసులో నిర్ధోషత్వాన్ని నిరూపించుకోవాలంటే విచారణ ఎదుర్కొని స‌చ్చీలుడిగా నిరూపించుకోవాలని రామ‌చంద్ర‌య్య‌ డిమాండ్‌ చేశారు. వంద కోట్ల ఖర్చుపెట్టి ఫాంహౌస్‌ ను నిర్మించుకున్న ముఖ్యమంత్రి తాజాగా ఎన్నో ఆరోపణలు వస్తున్న లింగమనేని ఎస్టేట్స్‌ లోని నివాసం ఉంటుండటంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లింగమనేని ఎస్టేట్స్‌ లో అవినీతి మరకలున్నాయని, ఇల్లీగల్‌ అయినది ఇప్పుడు లీగల్‌ ఎలా అయిందని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ప్రభుత్వ నిధులతో న్యాయవాదులను పెట్టుకునే సత్తా నీకుంది కానీ ఎక్కువ డబ్బులు చెల్లించి న్యాయవాదిని పెట్టుకునే స్థోమత త‌మ‌కు లేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. పుష్కరాల పేరుతో రూ.18 వేల కోట్లు సీఎం చంద్ర‌బాబు నాయుడు ఉత్త‌పుణ్యాన‌ ఖర్చు చేశాడని రామ‌చంద్ర‌య్య‌ ఆరోపించారు. పుష్కరాల్లో పటాసుల కోసం 80 లక్షలు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. కపట నాటకాలను పక్కనపెట్టి ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీయాలని కోరారు.