Begin typing your search above and press return to search.

సీ ఓటరు సర్వే: ఏపీలో ఇది నమ్మొచ్చా..?

By:  Tupaki Desk   |   11 March 2019 5:02 AM GMT
సీ ఓటరు సర్వే: ఏపీలో ఇది నమ్మొచ్చా..?
X
జాతీయ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావడమే తరువాయి జాతీయ మీడియా సంస్థలు సర్వేలతో హడావుడి చేస్తున్నాయి. అప్పుడే పార్టీలకు వచ్చే స్థానాల సంఖ్యలను తెలుపుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. వీటిలో సీ ఓటర్‌ సర్వే ఒకటి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన గంటకే తన అభిప్రాయాన్ని తెలిపింది. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి ఎక్కువ లోక్‌సభ స్థానాలు వస్తాయని - రెండో స్థానంలో వైసీపీ ఉంటుందని తెలిపింది. అయితే ఈ సీ ఓటర్‌ సర్వే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించిన సర్వేకు ఫలితాలు వెల్లడించిన తరువాత వచ్చిన రిజల్ట్స్ కు ఎక్కడా పోలిక లేకపోవడం గమనార్హం.

తాజాగా సీ ఓటర్‌ నిర్వహించిన సర్వే వివరాలు ప్రకటించింది. దీని ప్రకారం టీడీపీకి 14 లోక్‌ సభ స్థానాలు - వైసీపీకి 11 వస్తాయని తెలిపింది. కేవలం రెండు శాతం మాత్రమే తేడాతో పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకుంటాయని పేర్కొంది. ఇదే సీ ఓటర్‌ గత డిసెంబర్‌ లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో భాగంగా నవంబర్‌ 9న సర్వేను బయటపెట్టింది. టీడీపీ - కాంగ్రెస్‌ కలిసి ఏర్పరిచిన మహాకూటమి అధికారంలోకి రానుందని పేర్కొంది. మహాకూటమి 64 స్థానాల్లో విజయం సాధిస్తుంది. టీఆర్‌ ఎస్‌ కు 42 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని పేర్కొంది.

అయితే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ 80 స్థానాలకు పైగా గెలుచుకొని అధికారాన్ని కూడా చేపట్టింది. అలాగే మహాకూటమి సీ ఓటర్‌ సర్వేలో పేర్కొన్న వాటిలో సగం స్థానాలు కూడా రాబట్టలేకపోయాయి. దీంతో ఇలాంటి సంస్థ ఇప్పుడు ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ గెలుస్తుందని చెప్పింది. ఈ సంస్థలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ నాయకులు సూచిస్తున్నారు. ఇక కొన్ని మీడియా సంస్థల్లో వైసీపీ అఖండ విజయం సాధిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే లోక్‌ సభలోనూ వైసీపీ కీలకంగా మారుతుందని తెలుపుతున్నాయి. టీడీపీ కంటే ఈసారి జనసేనను ఎక్కువగా ఆదరిస్తాయని అవి ప్రకటించిన వాటిలో ఉన్నాయి.

ఏదేమైనా ఓటర్ల నాడి పూర్తిగా పట్టడం కష్టమని తెలంగాణ ఎన్నికల్లో సర్వే చేసి బొక్కాబోర్ల పడ్డాక లగడపాటి పేర్కొన్న సంగతి తెలిసిందే. సర్వేలు కేవలం నామమాత్రంగానే ప్రకటిస్తారని.. వీటిలో కొన్ని మాత్రమే నిజమవుతాయని అంటున్నారు. అందువల్ల ప్రజలు సర్వేలను కాకుండా ఏ ప్రభుత్వం తమకు మంచి చేస్తుందో నిర్ణయించుకొని ఓటేయ్యాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.