Begin typing your search above and press return to search.

కరోనా అంతు చూసే దమ్ము మోడీలో ఎంతో తాజా సర్వే చెప్పేసింది

By:  Tupaki Desk   |   24 April 2020 4:00 AM GMT
కరోనా అంతు చూసే దమ్ము మోడీలో ఎంతో తాజా సర్వే చెప్పేసింది
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేయటంలో.. ఆ పిశాచి వైరస్ అంతు చూడటంలో అన్ని దేశాలు కిందా మీదా పడుతున్న వేళ.. భారత ప్రధానిపై దేశ ప్రజలు పెట్టుకున్న ఆశలు అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. కరోనా విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు ఎంతలా వణుకుతుందో గణాంకాలు స్పష్టమవుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో రోజుకు దగ్గర దగ్గర వెయ్యి వరకూ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటివేళలో.. కరోనా పాజిటివ్ కేసులు ఒక కొలిక్కి ఎప్పటికి వస్తుందన్న విషయంపై జాతి జనులు ఏమనుకుంటున్నారు? కరోనాను కంట్రోల్ చేసే విషయంలో ప్రధాని మోడీ సమర్థత ఎంత? ఆయనపై ప్రజలకున్న భరోసా.. నమ్మకం ఎంతన్న విషయం తాజాగా చేసిన సర్వేలో వెల్లడైంది.

ఐఏఎన్ ఎస్ - సీ ఓటర్ నిర్వహించిన సర్వే ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. కరోనా వైరస్ సంక్షోభం నుంచి భారత్ ను గట్టెక్కించే సత్తా ప్రధాని మోడీలో ఉందన్న నమ్మకాన్ని దేశ ప్రజలు అత్యధిక స్థాయిలో వ్యక్తం చేయటం విశేషం. సర్వేలో పాల్గొన్న వారిలో 93.5 శాతం మంది కరోనా వ్యవహారంలో దేశాన్ని సమర్థంగా బయటపడేసే సత్తా ఉందన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించిన రోజున ఈ నమ్మకం పాళ్లు 76.8 శాతం ఉంటే.. తాజాగా మాత్రం అది ఏకంగా 93.5 శాతం పెరగటం విశేషం.

రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా నుంచి బయటపడేసే సత్తా ప్రధాని మోడీకి ఉందన్న విషయానికి సానుకూలంగా స్పందిస్తున్న వారి సంఖ్య పెరగటం కనిపిస్తోంది. విపత్తు విరుచుకుపడే అవకాశం ఇవ్వకుండా.. దానికి ముందే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లాంటిసంచలన నిర్ణయాన్ని తీసుకోవటంపై దేశ ప్రజలతో పాటు.. పలువురు దేశాధినేతలు సైతం ప్రశంసించటాన్ని మర్చిపోలేదు. జాతి జనులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రధాని ఎంతమేరకు పూర్తి చేస్తారో కాలమే డిసైడ్ చేయాల్సి ఉంటుంది.