Begin typing your search above and press return to search.

బాబు ఆలోచ‌న‌కు మోడీ గ్రీన్‌ సిగ్న‌ల్

By:  Tupaki Desk   |   4 Feb 2016 1:04 PM GMT
బాబు ఆలోచ‌న‌కు మోడీ గ్రీన్‌ సిగ్న‌ల్
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ సార‌థ్యంలో కేంద్ర మంత్రివర్గం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నానికి అండ‌గా నిలిచే నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధికి వేయాల్సిన కీలక అడుగును ముందే నిర్దేశించుకున్న చంద్ర‌బాబు స‌ర్కారుకు ప్రోత్సాహం అందించేలా మోడీ స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రైల్వే ప్రాజెక్టులను వేగంగా అమలు చేసేందుకు అవసరమైన వనరుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జాయింట్‌ వెంచర్‌ (జెవి) కంపెనీలను ఏర్పాటు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖకు కేంద్ర మంత్రివ‌ర్గం అనుమతించింది. వివిధ రాష్ట్రాల్లో రైల్వే లైన్ల కోసం పెరుగుతున్న డిమాండ్లను, వాటిని చేపట్టాలంటే పెద్ద మొత్తంలో అవసరమయ్యే నిధులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక ప్రాజెక్టులను గుర్తించడం - భూమి సేకరణ - నిధులు సమకూర్చడం - ప్రభుత్వం నుండి నిధులు వచ్చే అవకాశాలను పరిశీలించడం - ప్రాజెక్టుల పర్యవేక్షణ వంటి బాధ్యతలన్నీ కూడా ఈ జేవీ కంపెనీలు చూసుకుంటాయి.

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ స‌మావేశంలో వెలువ‌డిన వాటిలో జేవీల ఏర్పాటు నిర్ణయం కీల‌క‌మైంది. జేవీ కంపెనీల ఏర్పాటు కోసం రైల్వేలు ఇటీవలే కేరళ - ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అంతకుముందు ఒడిషా - మహారాష్ట్రలతో కూడా ఇలాంటి ఒప్పందాలే కుదిరాయి. ప్ర‌తిపాదిత విధివాధానాల ప్ర‌కారం...రైల్వే మంత్రిత్వ శాఖ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కలిసి జాయింట్‌ వెంచర్‌ కంపెనీలు ఏర్పాటు చేస్తారు. ప్రతి జేవీ కూడా తాము చేపట్టబోయే ప్రాజెక్టులను బట్టి తొలుత వంద కోట్లు నిధుల వరకు సమకూర్చుకోవాల్సి వుంటుంది. రైల్వే శాఖ ప్రతి రాష్ట్రానికి ఇచ్చేది రు.50కోట్ల ఉంటుంది. ప్రాజెక్టుకు ఆమోద ముద్ర లభించిన తర్వాత సంబంధిత అధికారులచే నిధుల సమీకరణకు ఆమోదం లభించిన తర్వాత తదుపరి నిధులు లేదా ఈక్విటీలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ లో మౌళిక స‌దుపాయాల‌కు పెద్దపీట వేస్తున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం జేవీల ఏర్పాటు విష‌యంలో వేగంగా స్పందించి ఈ ఆలోచ‌న చేసిన నాలుగో రాష్ట్రంగా నిలిచింది. ఈ క్ర‌మంలో తాజాగా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌డం రైల్వే లైన్ల విస్త‌ర‌ణ‌, కొత్త లైన్ల ఏర్పాటుకు ప్రోత్సాహ‌క‌రంగా ఉంటుంద‌ని భావిస్తున్నారు.