Begin typing your search above and press return to search.

బొబ్బిలి రాజాకు బెర్తు గ్యారంటీ

By:  Tupaki Desk   |   1 May 2016 8:55 AM GMT
బొబ్బిలి రాజాకు బెర్తు గ్యారంటీ
X
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఎవరెవరికి పదవులు వస్తాయన్న అంచనాలు వేసుకుంటున్నారు. వైసీపీ నుంచి వచ్చిన నేతల్లో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారికి మంత్రి పదవులు ఖాయమని తెలుస్తోంది. వారిలో ఒకరు భూమా నాగిరెడ్డి కాగా రెండో వ్యక్తి బొబ్బిలి ఎమ్మెల్యే రాజా సుజయ కృష్ణ రంగారావు.

2004లో తొలిసారి కాంగ్రెస్ నుంచి గెలిచిన సుజయ కృష్ణ అప్పటి నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు. రెండుసార్లు కాంగ్రెస్ నుంచి మొన్నటి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆయనకు ఇంతవరకు మంత్రి పదవి దక్కలేదు. సుజయ కృష్ణ తాత రాజా శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు అప్పట్లో మద్రాస్ ప్రెసెడెన్సీకి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం భారత రాజ్యంగ నిర్మాణ కమిటీలోనూ సభ్యుడిగా పనిచేశారు. బొబ్బలికి ఎమ్మెల్యేగానూ పనిచేశారు. సుజయకృష్ణ తండ్రి గోపాల కృష్ణ రంగారావు కూడా బొబ్బిలి ఎంపీగా పనిచేశారు. వారంతా విద్యారంగం, క్రీడారంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కాలేజిలు ఏర్పాటు చేయడం.. గుర్రపు స్వారీ - పోలో వంటి క్రీడల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. సుజయ కృష్ణ కూడా క్రీడా ప్రేమికుడే.. హార్సు రేసింగు - కార్లు వంటి హాబీలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు క్రీడలు - యువజన శాఖ కానీ - విద్యా శాఖ కానీ దక్కొచ్చని భావిస్తున్నారు.

కాగా మంత్రివర్గ విస్తరణ కృష్ణా పుష్కరాల తర్వాత ఉంటుందని ముఖ్యమంత్రి తమ పార్టీ నేతలకు - ఎమ్మెల్యేలకు తాజాగా సంకేతాలిచ్చినట్లు తెలిసింది. ఆ లెక్కన ఆగస్టులో కేబినెట్‌ లో బాబు చేర్పులు - మార్పులు చేస్తారని టిడిపి శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఉన్నవారిలో ఎవ్వరిని తీసేస్తారో ఇంకా తేలక పోయినా భూమా నాగి రెడ్డి - సుజయ రంగారావులకు పదవులు ఖాయమని టీడీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు చేరిన తరువాత ఆయన కూ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.