Begin typing your search above and press return to search.

అరగంటకు రూ.1250.. గంటకైతే రూ.2500

By:  Tupaki Desk   |   16 Jun 2016 7:14 AM GMT
అరగంటకు రూ.1250.. గంటకైతే రూ.2500
X
విమానప్రయాణం ఇకపై కల ఏ మాత్రం కాబోదు. సగటు జీవి కూడా విమానాల్లో వెళ్లిపోవచ్చు. విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు.. విమానయాన రంగానికి మరింత ఊపునిచ్చే దిశగా మోడీ సర్కారు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. తాజాగా ప్రకటించిన కొత్త విధానంతో విమానప్రయాణం కారుచౌకగా మారటమే కాదు.. ఈ రంగం మరింత వృద్ధిరేటు నమోదు చేయటానికి వీలు కలుగుతుంది. కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక గజపతిరాజు చెప్పినట్లుగా.. ‘‘సమూల మార్పులు తెస్తున్నాం’’ అన్న మాట నిజం చేసే దిశగా మోడీ సర్కారు అడుగులు వేసినందని చెప్పాలి. విమాన ప్రయాణానికి కీలకమైన టికెట్ ధరను కనిష్ఠానికి తీసుకురావటంతో పాటు.. విమానయాన సంస్థలు వివిధ సేవల పేరుతో అడ్డగోలుగా దోచేయకుండా ఉండేలా కొత్త విధానం అవకాశం ఇవ్వనుంది.

అన్నింటికి కంటే కీలకమైన అంశం ఏమిటంటే.. విమాన ప్రయాణం అరగంట మాత్రమే అయితే టికెట్ ఛార్జీ రూ.1250కు మించి ఉండకూడదని.. అదే గంట అయితే రూ.2500లకు మించకూడదన్నది తాజాగా తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనది. అంతేకాదు.. ఇప్పటివరకూ విమానాలు నడవని ప్రాంతాలకు విమాన సేవల్ని ప్రవేశ పెట్టే వారికి పన్ను రాయితీ సౌకర్యాన్ని కల్పించనున్నారు. వీటితో పాటు ఎయిర్ లైన్స్ సంస్థలకు ఇబ్బందిగా ఉన్న 5/20 నిబంధనను తీసి వేయటం ద్వారా.. మరిన్ని విమాన సర్వీసులు ప్రవేశ పెట్టటానికి వీలు కల్పించారని చెప్పాలి.

తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ప్రయాణ సమయాన్ని అనుసరించి టికెట్ ధరను వసూలు చేస్తారు. గంట ప్రయాణానికి గరిష్ఠంగా రూ.2500లుగా నిర్ణయించారు. ఇందులో 1.2 శాతం సేవాపన్ను తప్పించి మరెలాంటి పన్నులు వేసే వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ధర రూ.2500లకు మించకూడదు. ఒకవేళ విమానయాన సంస్థలు అంతకంటే తక్కువ ధరకు టికెట్ అమ్మితే ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కాకుంటే.. ఈ రూల్ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎయిర్ పోర్ట్ ల మధ్య తిరిగే సర్వీసులకు ఉండదు.

ఉదాహరణకు విజయవాడ నుంచి హైదరాబాద్ కు గంట కంటే తక్కువ సమయమే తీసుకుంటుంది. అలా అని రూ.2500 టికెట్ ధర రూల్ ఈ రూట్ కి వర్తించదు. అదే సమయంలో కడప.. పుట్టపర్తి లాంటి ఎయిర్ పోర్ట్ ల నుంచి విజయవాడ.. విశాఖపట్నం.. హైదరాబాద్ లకు విమాన సర్వీసులు నడిపితే ఈ రూల్ వర్తిస్తుంది. ఒకవేళ విమానయాన సంస్థలు హైదరాబాద్.. విజయవాడ మధ్యన రూ.2500 కంటే తక్కువ ధరకు సర్వీసు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకుంటే విమానయన శాఖ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయదు. తాజా నిర్ణయంతో విమాన ప్రయాణాల వైపు సగటు జీవి దృష్టి పడేలా చేయటంతో పాటు.. ఈ రంగం కొత్త ఉత్సాహంతో పరుగులు తీసేందుకు కొత్త విధానం అవకాశం ఇస్తుందని చెప్పొచ్చు.

ఇక.. వివాదాస్పదమైన 5/20 నిబంధన విషయానికి వస్తే.. ఈ రూల్ కింద ఏదైనా ఎయిర్ లైన్స్ కొత్తగా విదేశీ సర్వీసులు నడపాలనుకుంటే అవకాశం ఉండేది కాదు. కనీసం ఐదేళ్ల అనుభవం.. 20 విమానాలు ఉన్న ఎయిర్ లైన్స్ మాత్రమే విదేశీ యానానికి అవకాశం ఉండేది. తాజాగా ఈ రూల్ ను కేంద్రం రద్దు చేయటంతో.. కొత్తగా సర్వీసులు స్టార్ట్ చేసిన ఎయిర్ లైన్స్ లు సైతం విదేశీ సర్వీసుల్ని నడిపే అవకాశం కలగనుంది.