Begin typing your search above and press return to search.

ఒక్కటే ఖాళీ.. రేసులో ఎందరో... ?

By:  Tupaki Desk   |   18 March 2022 12:30 AM GMT
ఒక్కటే ఖాళీ.. రేసులో ఎందరో... ?
X
ఏపీలో మంత్రి వర్గ విస్తరణ అంటూ జరిగితే ఎవరికి చాన్స్ అన్న దాని మీద చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇక గత పదేళ్ళుగా వైసీపీ వెంట ఉంటూ ఆ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన బలమైన సామాజిక వర్గంగా రెడ్లు ఉన్నారు. వైసీపీలో మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో రెడ్డి సామాజిక వర్గం వారు ముప్పయి శాతం దాకా ఉంటారని ఒక అంచనా.

అయితే వారికి దామాషా ప్రకారం మంత్రివర్గంలో పదవులు రావాలీ అంటే కచ్చితంగా ఎనిమిది బెర్తులు ఇవ్వాలి. కానీ జగన్ తొలి కూర్పులో కేవలం నలుగురికి మాత్రమే అవకాశాలు ఇచ్చారు. అలా చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నెల్లూరు నుంచి మేకపాటి గౌతం రెడ్డి, కర్నూల్ నుంచి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిలకు చాన్స్ దక్కింది.

ఇపుడు మంత్రివర్గ విస్తరణ పేరిట జగన్ చేస్తున్న కసరత్తు మీద రెడ్డి సామాజికవర్గానికి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారిలో చిత్తూరు జిల్లా నగరి నుంచి ఆర్ కె రోజా. తిరుపతి నుంచి భూమన కరుణాకరరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణరెడ్డి, కాకాని గోవర్ధనరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కడప నుంచి శ్రీకాంత్ రెడ్డి, అనంతపురం నుంచి అనంత వెంకటరామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి వంటి వారు ఉన్నారు.

అయితే ప్రస్తుత క్యాబినెట్ లో ఉన్న పెద్దిరెడ్డితో పాటు బుగ్గనను మళ్ళీ కంటిన్యూ చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు. అలాగే నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి గౌతం రెడ్డి ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబానికి మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా చూస్తే ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే మాజీ అయ్యేలా ఉన్నారు.

అంటే ఉన్నది ఒక్కటే ఖాళీ. మరి దాని కోసం చూస్తే రేసులో ముందు వరసలో చాలా మంది ఉన్నారు. వీరి వెనకాల ఇంకా అనేక మంది రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వీరిలో ఎవరో ఒక్కరికే ఆ లక్కీ చాన్స్ దక్కుతుంది అంటున్నరు. మరి ఆ లక్కీ ఎవరో చూడాలి.

మిగిలిన వారు అంతా వచ్చే సారి ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటు అయితే తాము గెలిస్తే అపుడు అదృష్టం పరీక్షించుకోవాల్సిందే అంటున్నారు. మొత్తానికి చూస్తే రెడ్డి మంత్రులు కంటిన్యూ అయ్యే జిల్లాల్లో మరొకరికి చాన్స్ ఉండదని క్లారిటీగా ఉంది. సో రోజా, భూమనతో పాటు నెల్లూరు, కర్నూల్ జిల్లాల‌కు చెందిన రెడ్డి నేతలకు నిరాశ ఈసారి కూడా తప్పదనే అంటున్నారు.