Begin typing your search above and press return to search.

ఇంతమంది స్పీకర్ లా...నిజమేనా...?

By:  Tupaki Desk   |   22 March 2022 3:30 AM GMT
ఇంతమంది స్పీకర్ లా...నిజమేనా...?
X
మంత్రి వర్గ విస్తరణ వార్తల నేపధ్యంలో ఎవరికి ఏ పదవులు దక్కుతాయన్నది ఎవరికి తెలియదు. అధికార పార్టీలోనే దీనిమీద సరైన సమాచారం లేదు. తమకు తోచిన విధంగా తాము చెప్పుకుంటున్నారు. తమకే పదవులు వస్తాయని కొంతమంది ధీమాగా ఉంటే అలా కాదు తమకే అని మరికొంత మంది నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

సరే ఈ నమ్మకాలూ, విశ్వాసాలు ఒక వైపు ఇలా ఉండగానే స్పీకర్ పదవి విషయంలో ఎక్కువగా పేర్లు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం ప్రస్తుతం స్పీకర్ గా ఉన్నారు. ఆయన సమర్ధంగానే సభను నడుపుతున్నారు. తన ఇన్నేళ్ళ అనుభవాన్ని రంగరించి మరీ శాసన‌సభను నిర్వహిస్తున్నారు.

మరి అలాంటి ఆయన్ని కాదని కొత్త వారిని తెచ్చే ప్రసక్తి ఉంటుందా అంటే అక్కడే ఆసక్తికరమైన చర్చ సాగుతోది. తమ్మినేని సీతారాం ప్రస్తుత పదవితో అంత సంతోషంగా లేరుట. అలాగే ఆయన మంత్రి కావాలని అర్జీ పెట్టుకుని చాలా కాలం అయిందని అంటున్నారు. వయసు కారణం చూపించి ఈ దఫా మంత్రి పదవి చేస్తే చాలు అన్నట్లుగా తమ్మినేని ఉన్నారు.

దాంతో సీరియస్ గానే ఆయన కోరికను జగన్ పరిశీలిస్తున్నారుట. దాంతో ఎవరు కొత్త స్పీకర్ అన్న చర్చ మొదలైంది. తమ్మినేని ఉత్తరాంధ్రాకు చెందిన బీసీ నేత. కాబట్టి ఆ పదవిని బీసీలతో లేకపోతే ఎస్టీలతో భర్తీ చేయాలని జగన్ చూస్తున్నారుట.

దాంతో శ్రీకాకుళం జిల్లా నుంచే ఇద్దరి పేర్లు స్పీకర్ పదవి కోసం వినిపిస్తున్నాయి. వారిలో మొదటి పేరు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయనకు విశేష అనుభవం ఉంది. సమర్ధుడు. శాసనసభ వ్యవాహారాల పట్ల పూర్తి అవహాగన ఉన్నవారు కాబట్టి ఆయనకు చాన్స్ అని అంటున్నారు. పైగా ఆయనకు ఇప్పటిదాకా ఏ పదవీ ఇవ్వలేదు కాబట్టి ఈ కీలకమైన పదవితో సంతృప్తి చేస్తారు అని అంటున్నారు.

ఇక ఆయనతో పాటుగా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేరు కూడా వినిపిస్తోంది. ఆమె బీసీ కాపు సామాజికవర్గానికి చెందిన వారు. మహిళను స్పీకర్ గా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఆమె పేరు పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. విజయన‌గరం జిల్లావరకూ వస్తే సాలూరు ఎమ్మెల్యే, సీనియర్ నేత అయిన రాజన్న దొరకు స్పీకర్ పదవి కట్టబెట్టి అత్యున్నత పీఠం మీద ఎస్టీని కూర్చోబెట్టిన ఘనతను అందుకోవాలని వైసీపీ పెద్దలు చూస్తున్నారుట.

అయితే రాజన్న దొర అయినా ధర్మాన అయినా మంత్రి పదవి కోసమే చూస్తున్నారు. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామ నారాయణరెడ్డి కూడా మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తూంటే ఆయనే మన స్పీకర్ అంటున్నారు. మొత్తానికి మంత్రులు ఎవరో తెలియదు కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా స్పీకర్ పదవికి మాత్రం పేర్లు చాలానే ముందుకు వస్తున్నాయి. ఇది విచిత్రంగానే ఉంది.