Begin typing your search above and press return to search.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మంత్రి ప‌ద‌వి ద‌క్కేదెవ‌రికి?

By:  Tupaki Desk   |   27 March 2022 4:30 PM GMT
విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మంత్రి ప‌ద‌వి ద‌క్కేదెవ‌రికి?
X
త్వ‌ర‌లోనే ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో అధికార‌పార్టీ నేతల్లో ఆశ‌లు పెరుగుతున్నాయి. కొత్తగా ఎవరికి కేబినెట్‌లో చోటు దక్కుతుందో.. ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరికి పార్టీ బాధ్యత‌లు అప్పగిస్తారో అని.. నాయ‌కులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త జిల్లాలతో పాటు కొత్త మంత్రివర్గం కొలువు దీరుతుండ‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో కీలక‌ల‌మైన ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోని విజ‌య‌నగ‌రం నుంచి ఎవ‌రికి మంత్రి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌నే చ‌ర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది.

ఈ జిల్లాకు ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి కూడా మంత్రి వ‌ర్గంలో ప్ర‌త్యేక చోటు ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. టీడీపీ హ‌యాంలో అశోక్‌గ‌జ‌ప‌తి రాజు వంటివారు మంత్రి ప‌దవుల్లో ఉన్నారు. కాంగ్రెస్ హ‌యాంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ వంటి దిగ్గ‌జ నాయ‌కులు మంత్రులు గా చ‌క్రం తిప్పారు. ఇక‌, ఇప్పుడు కూడా.. జ‌గ‌న్ కేబినెట్‌లో బొత్స స‌త్య‌నారాయణ మంత్రిగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో.. బొత్స‌ను ప‌క్కన పెడ‌తార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో జిల్లా నుంచి ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుంద‌నేది జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల ప్ర‌కారం.. విజయనగరం జిల్లా నుంచి ముగ్గురి పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్నారు. వాస్త‌వానికి కోల‌గ‌ట్ట‌కు గ‌త కేబినెట్‌లోనే అవ‌కాశం రావాల్సి ఉంది.అయితే.. ఒకే జిల్లా నుంచి ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు మంత్రిప‌దువులు ఎందుకనుకున్నారో..ఏమో.. అదే సామాజిక వ‌ర్గానికి చెందిన విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే వెలంప‌ల్లికి అప్ప‌గించారు.

ఇక ఇప్పుడు మాత్రం.. ఈ ముగ్గురు మాత్రం మంత్రి పదవుల రేసులో గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు గత మంత్రివర్గంలో చోటు గ్యారంటీ అయినా.. చివరి నిమిషంలో నిరాశ ఎదురైంది. సీనియర్ ఎమ్మెల్యే అయినా.. ఆయన ఏనాడు పార్టీ లైన్ దాటి మాట్లాడలేదు. స్థానికంగా అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని రాజన్న దొరకు పేరుంది. ఈసారి జరగబోయే కేబినెట్ విస్తరణలో పుష్ప శ్రీవాణి స్థానంలో రాజన్నదొరకు జగన్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఒకవేళ శాసనసభ స్పీకర్‌ను కూడా మారిస్తే.. ఆ పదవి శంబంగి వెంకట చిన్ని అప్పలనాయుడుకి అప్పగి స్తారని ప్రచారం జరుగుతోంది. ఇక‌, వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు స్థానంలో కోల‌గ‌ట్ల‌కు అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. ఒకే జిల్లా నుంచి ముగ్గురుకి అవ‌కాశం ద‌క్క‌దు క‌నుక‌.. ఎవ‌రికి అవ‌కాశం ఇస్తారో చూడాలి. ఏదేమైనా.. ముగ్గురు నాయ‌కులు .. మాత్రం త‌మ త‌మ రేంజ్‌ల‌లో .. బాగానే కృషి చేస్తున్నారు.