Begin typing your search above and press return to search.

వన్ ప్లస్ వన్ ఈక్వేషన్స్ తో జాక్ పాట్ ?

By:  Tupaki Desk   |   28 March 2022 2:30 AM GMT
వన్ ప్లస్ వన్ ఈక్వేషన్స్ తో  జాక్ పాట్ ?
X
రాజకీయాల్లో ఎపుడూ ఈక్వేషన్స్ కీలకపాత్ర పోషిస్తాయి. అవి కనుక సరితూగకపోతే ఎంతటి సీనియారిటీ, సిన్సియారిటీ ఉన్నా బ్యాక్ బెంచ్ కే పరిమితం కాకతప్పదు. ఇదంతా ఎందుకు అంటే ఇపుడు ఏపీలో మంత్రి వర్గ విస్తరణ మీద జోరుగా చర్చ సాగుతోంది. ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి అన్న చర్చ అయితే స్పీడ్ గా సాగుతోంది.

సోషల్ మీడియా యుగంలో అందరూ వ్యూహకర్తలు అయి పోయారు. అంతే కాదు, ఎవరికి వారు లెక్కలను తీసి మరీ వీరే కొత్త మంత్రులు అని లిస్ట్ కూడా ప్రకటిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు కూడా చాలా దూకుడుగా ఉంటాయి. పైగా వచ్చేది ఎన్నికల క్యాబినేట్ కాబట్టి కచ్చితంగా ఆయా వర్గాలను ఆకట్టుకునే రీతిలోనే కొత్త మంత్రుల ఎంపిక ఉంటుంది అన్న దాంట్లో అంతా ఏకీభవిస్తారు.

ఇక చూసుకుంటే వైసీపీ లో పలువురు మహిళా ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వారిలో ఎవరికి ఎక్కువ చాన్స్ ఉంది అన్నది చూస్తే మాత్రం గుంటూరు జిల్లాకు చెందిన విడుదల రజనీకి మాగ్జిమం చాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఆమె గుంటూరు జిల్లా చిలకూరిపేట నుంచి 2019 ఎన్నికల్లో ఫస్ట్ టైం గెలిచారు. ఆమె టీడీపీలో మంత్రిగా పని చేసిన పత్తిపాటి పుల్లారావుని ఓడించి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

ఇక రజనీ బీసీ సామాజికవర్గానికి చెందిన విద్యాధికురాలు. బీసీ ఓట్ బ్యాంక్ ని టార్గెట్ చేస్తున్న వైసీపీలో రజనీకి మంత్రి పదవి రావడం ఖాయమని అంటున్నారు. ఆమె చురుకైన మహిళా నేగగా ఉన్నారు. ఇక్కడ మరో ఈక్వేషన్ కూడా ఉంది. ఆమె భర్త కుమారస్వామి కాపు సామాజికవర్గానికి చెందిన నేతగా చెబుతున్నారు.

దాంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా బీసీ ప్లస్ కాపులను ఒకే మంత్రి పదవితో సాటిస్ ఫై చేయడానికి రజనీ ఎంపిక ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఏమైనా కొత్త ఈక్వేషన్స్ తెర మీదకు రాకుండా పోతే రజనీకి మంత్రి పదవి ఖాయమని అంటున్నారు.

ఇదే రకంగా వన్ ప్లస్ వన్ ఈక్వేషన్స్ తో మరో ఇద్దరు మహిళలు కూడా మినిస్టర్ పోస్టులకు పోటీ పడుతున్నారు. అనంతపురం జిల్లాలో జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. ఆమె సింగనమల నియోజకవర్గానికి చెందిన వారు. ఆమె భర్త ఆలూరి సాంబశివారెడ్డి. దాంతో ఆమెకు మంత్రి పదవి ఇస్తే రెడ్డి కోటాను ఇటు ఎస్సీ కోటాను కూడా కవర్ చేసినట్లు అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారుట.

ఇక ఇదే జిల్లాలో కళ్యాణ దుర్గం నియోజకవర్గానికి చెందిన ఉష శ్రీ చరణ్ బీసీ సామాజిక వర్గం మహిళ. ఆమె భర్త కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. ఇలా కనుక చూస్తే ఉష శ్రీ కి కూడా గోల్డెన్ చాన్స్ ఉంది అంటున్నారు. దాంతో వన్ ప్లస్ వన్ ఈక్వేషన్స్ ఈసారి వైసీపీ మంత్రివర్గం ఎంపికలో కీలకమైన పాత్ర పోషిస్తాయి అని అంటున్నారు. చూడాలి మరి లిస్ట్ లో ఎవరి పేరు ఉంటుందో.