Begin typing your search above and press return to search.

ఇంత అయోమయం దేనికి ?

By:  Tupaki Desk   |   10 April 2022 9:10 AM GMT
ఇంత అయోమయం దేనికి ?
X
మంత్రివర్గం కూర్పు విషయం అనేక మలుపులు తిరుగుతోంది. కొత్త మంత్రివర్గంలో ఎవరుంటారు ? ఎవరుండరు ? అనే విషయాన్ని అంచనా వేయటంలో యావత్ మీడియా నూరుశాతం ఫెయిలైందనే చెప్పాలి. ఇంతటి గోప్యత గతంలో ఏ ముఖ్యమంత్రికీ సాధ్యం కాలేదు. అయితే ఇదే సమయంలో మంత్రివర్గంలో మార్పులుంటాయనే విషయం గడచిన ఆరు మాసాలుగా మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది.

నిజానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో ఇంతటి గందరగోళం అవసరమే లేదు. ఒకసారి మంత్రులందరినీ మార్చేస్తారని కథనాలు కనబడతాయి. మరోసారి లేదు లేదు కొందరిని మాత్రమే మార్చబోతున్నారని ప్రచారం జరుగుతుంది. తాజాగా పాతవారిలో 8 మందిని తిరిగి కంటిన్యూ చేయబోతున్నారంటు ప్రచారం మొదలైంది. అంతకుముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్లనే తీసేస్తున్నపుడు మిగిలిన వాళ్ళొకలేక్కా ? అని డిబేట్లు జరిగింది.

మంత్రివర్గం పునర్ వ్యవస్ధీకరణలో ఇంతటి గందరగోళానికి ప్రధాన కారణం మీడియానే చెప్పాలి. రోజుకో వార్త, రోజుకో కథనం పేరుతో జనాలను పూర్తిగా అయోమయంలోకి నెట్టేస్తోంది. అసలు మూడేళ్ళ క్రితం మంత్రివర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రెండున్నరేళ్ళ తర్వాత 90 శాతం మంత్రులను మార్చేస్తానంటు ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మంత్రివర్గంలో ఎవరుండాలి ? ఎవరిని పక్కనపెట్టేయాలనేది నూరుశాతం జగన్ ఇష్టం అనడంలో సందేహం లేదు.

ఈ విషయం తెలిసి కూడా మీడియా ఉద్దేశ్య పూర్వకంగానే గందరగోళం చేసేసింది. మీడియా, సోషల్ మీడియా తమకు తోచిన పేర్లను ప్రచారంలోకి తెచ్చేసింది. మంత్రి వర్గం కూర్పుపై గతంలో ఎప్పుడూ జరగనంత ప్రచారం ఇపుడు జరుగుతోంది. తాజాగా కొత్తగా 15 మందినే తీసుకోబోతున్నారని మిగిలిన వాళ్ళంతా పాతవారే ఉంటారంటు పేర్లను కూడా ప్రచారం చేస్తోంది.

ఏదేమైనా ఒకటి మాత్రం నిజం ఏమిటంటే కొత్తగా కొలువుతీరబోయే మంత్రివర్గంలో ఎవరుంటారనే విషయాన్ని అంచనా వేయటంలో మీడియా పూర్తిగా ఫెయిలైంది. మామూలుగా అయితే ఈపాటికి కొత్త మంత్రుల జాబితా దాదాపు వచ్చేసేదే. కానీ ఇక్కడ మాత్రం ఇంకా ఊహాగానాల్లోనే ఉన్నాయి పేర్లు. ఎప్పుడైతే ఊహాగానాలకు అవకాశం వచ్చిందో మీడియా విజృంభించేస్తోంది. దీంతోనే అయోమయం పెరిగిపోతోంది.