Begin typing your search above and press return to search.

ఆ నాలుగు సామాజిక వర్గాలకు నో బెర్త్!

By:  Tupaki Desk   |   10 April 2022 1:12 PM GMT
ఆ నాలుగు సామాజిక వర్గాలకు నో బెర్త్!
X
ఏపీలో సామాజిక పరిస్థితుల మీద పూర్తి అవగాహ‌న వైసీపీ పెద్దలకు ఉందని, సోషల్ ఇంజనీరింగ్ చేయడంతో వారికి వారే సాటి అని చెప్పుకుంటారు. అలాంటిది ఏపీలో అత్యంత కీలకమైన నాలుగు సామాజిక వర్గాలు కొత్త క్యాబినెట్ లో లేకపోవడం విశేషం.

పైగా గత క్యాబినెట్ లో మంత్రులుగా మూడు సామాజిక వర్గాల నుంచి పనిచేశారు. వారిలో కమ్మ సామాజికవర్గం నుంచి కొడాలి నాని అతి ముఖ్యుడు. ఆయన తనదైన బిగ్ సౌండ్ తో ఏపీలో బాగా పాపులర్ అయ్యారు. ఇక మరో మంత్రి క్రిష్ణా జిల్లాకు చెందిన ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయన సైతం ఫైర్ బ్రాండ్ గా నిలిచారు.

ఇపుడు చూస్తే ఆయన మాజీ కాగా ఆ సామాజికవర్గం నుంచి కచ్చితంగా పదవి దక్కుతుంది అనుకున్న కోలగట్ల వీరభద్రస్వామి పేరు కూడా లేకుండా పోయింది. అయితే కోలగట్లను డిప్యూటీ స్పీకర్ గా చేస్తారని చెబుతున్నారు. అదే విధంగా క్షత్రియ సామాజిక వర్గం విషయం తీసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చెరుకువాడ రంగనాధరాజు ఇంతవరకూ మంత్రిగా పనిచేశారు.

ఇపుడు ఆయన ప్లేస్ లో నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రాసదరాజుని తీసుకుంటారు అనుకుంటే ఆయనను చీఫ్ విప్ గా చేస్తున్నారని చెబుతున్నారు. అలాగే గత క్యాబినేట్ లో బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి ఎవరికీ చోటు లేదు, ఈసారి చూస్తే మల్లాది విష్ణు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో మల్లాది విష్ణుకు ప్లానింగ్ కమిషన్ వైఎస్ చైర్మన్ పదవి ఇస్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో కీలకమైన సామాజిక వర్గాలుగా, అగ్ర వర్ణాలుగా ఉన్న వారికి మంత్రి మండలిలో స్థానం కల్పించకపోవడం మాత్రం చిత్రంగానే ఉంది అంటున్నారు. గతంలో ఎపుడూ ఇలా జరిగిన దాఖలాలు అయితే లేవు అని చెబుతున్నారు.