Begin typing your search above and press return to search.

విస్తరణ చెప్పిన విస్తుబోయే నిజాలు....?

By:  Tupaki Desk   |   18 April 2022 3:30 PM GMT
విస్తరణ చెప్పిన విస్తుబోయే నిజాలు....?
X
మంత్రి వర్గ విస్తరణ పేరిట ఏపీలో జగన్ చేసిన సాహసం వల్ల జనాలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే అది ఫ్యూచర్ లో తెలియాలి. ప్రస్తుతానికి అయితే వారిని మార్చారు, వీరిని తెచ్చారు. ఇంకా చెప్పాలీ అంటే కొండను తవ్వారు, చివరికి ఫలితం కూడా అధినాయకత్వం అనుకున్నట్లుగా రాలేదు అని విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద చూస్తే విస్తరణ వల్ల కొన్ని నిజాలు అయితే అటు అధినాయకత్వానికి తెలిశాయి. అలాగే ఇటు లీడర్లకు కూడా బోధపడ్డాయని అంటున్నారు.

ముందుగా అధినాయకత్వం వైపు నుంచి చూసుకుంటే నిత్యం భజన చేసిన వారు జగన్ మీద ఈగ వాలితే రెచ్చిపోయే వారు ఇపుడు ఫుల్ సైలెంట్ అయ్యారు. తమకు పదవుల కంటే జగనే ముఖ్యమని ఒకటికి పదిసార్లు చెప్పిన వారు మాజీలు కాగానే కొందరు నోరెత్తితే ఒట్టు అన్నట్లుగా అలా ఉండిపోయారు. తమకు జగన్ ఒకసారి మంత్రి పదవి ఇవ్వడమే అదృష్టం. ఎల్లకాలం తామే కంటిన్యూ అయితే మిగిలిన వారికి చాన్సులు ఎలా వస్తాయని మెచ్యూరిటీతో స్పీచులు ఇచ్చిన వారు కూడా ఇపుడు ఎందుకో మౌనరాగాలు ఆలపిస్తున్నారు.

కొందరు బయటకు వచ్చి తాము మళ్ళీ గెలిచి వస్తామని, మంత్రి పదవి 2024లో తొలి విడతలో తమకే ఖాయమని చెప్పుకుంటూనే తమ ఆవేదనను ఇండైరెక్ట్ గా కొత్త మంత్రుల మీద చూపిస్తున్నారు. ఇక ఆశావహుల వైఖరి చూస్తే వారు కూడా మాట ఇచ్చిన అధినాయకత్వం నిలబెట్టుకోలేదు అని లోలోపల రుసరుసలు ఆడుతున్నారు. ఇక తమకు చాన్స్ రానట్లే అని భావించిన వారు కొత్త ఆలోచ‌నలు చేస్తున్నారు.

ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి దూకేసి ఎన్నికల్లో గెలిచి వచ్చిన వారు ఇపుడు సైడ్ చూపులు చూస్తున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఇది వైసీపీలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీగా ఉంది. అంతే కాదు, అధినాయకత్వానికి వాస్తవ పరిస్థితులను కూడా కచ్చితంగా తెలియచేసే అచ్చమైన నివేదిక ఇదే అంటున్నారు. దీని కోసం ఏ ప్రశాంత్ కిశోర్ నో పెట్టుకోకుండానే వైసీపీలో తామేంటో, తమ లోపల బాధేంటో కూడా నేతాశ్రీలు చెప్పేశారు అంటున్నారు.

ఇప్పటిదాకా పైకి నిండు కుండలా కనిపించినా లోపల మాత్రం తాము ఎలా ఉన్నామో స్కానింగ్ కూడా అవసరం లేకుండా చాలా మంది బయటపెట్టుకున్నారు అని అంటున్నారు. ఇక అధినాయకత్వానికి ఈ విషయాలు ఆశ్చర్యం కలిగించాయా అంటే ఏమో తెలియదు కానీ కొంతవరకూ తన సైన్యం అని భావించే నాయకులే ఇపుడు బ్యాక్ బెంచీలకు వెళ్ళిపోవడంతో రియాలిటీ పచ్చిగా కళ్లకు కనిపిస్తోంది అంటున్నారు.

ఇక పదవులు వద్దు అన్న మాట పెదవుల వరకే అని తీరా దాన్ని ఆచరణలో పెడితే ఎంతటి వారు అయినా తట్టుకోలేరని, దానికి బంధువులు, ఆత్మ బంధువులు కూడా అతీతం కాదని కూడా హై కమాండ్ కి స్పష్టంగా అర్ధమైపోయింది అంటున్నారు. మరి ఇది ఒక విధంగా హై కమాండ్ కి లాభమే అన్న విశ్లేషణ కూడా ముందుకు వస్తోంది. విస్తరణ కనుక చేపట్టకపోతే ఎప్పటికీ ఈ అసంతృప్తులను కళ్ళారా చూసే అవకాశం ఉండేది కాదని, ఎన్నికల వేళ అది బయటపడినా రిపేర్లకు తావు కూడా లేకుండా పోయేది అన్న చర్చ కూడా ఉంది.

మొత్తానికి ఇదంతా ఎవరేంటి అన్నది తెలుసుకోవడానికి కూడా చేసిన కసరత్తు అని అనుకున్నా తప్పేమీ లేదు. సో రాజకీయాల్లో ఎపుడూ బంధాలు బహు పలచన. మరి ఆ వాస్తవం ఒంటరిగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ కంటే ఎవరికీ ఎక్కువగా తెలియదు. అందువల్ల ఆయన వీటిని ఎపుడో ఊహించే ఉంటారు. ఇపుడు వైసీపీలో అసలైన జగనన్న సైన్యం ఎవరో అధినాయకత్వానికి ఎరుకకు వస్తోందా.. ఏమో చూడాలి.