Begin typing your search above and press return to search.

ఇద్దరు మంత్రులూ అవుట్...?

By:  Tupaki Desk   |   6 Jan 2022 2:30 AM GMT
ఇద్దరు మంత్రులూ అవుట్...?
X
మంత్రి వర్గ విస్తరణ మీద మళ్ళీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి తరువాత ఉంటుందని కొందరు అంటూంటే, బడ్జెట్ సమావేశాలకు ముందు ఉంటుందని మరి కొందరు అంటున్నారు. ఇక మంత్రి పదవుల రేసులో చూసుకుంటే సీనియర్లూ జూనియర్లూ ఒకే తీరున పోటీ పడుతున్నారు. ఉత్తరాంధ్రాలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఇద్దరు మంత్రులు ప్రస్తుతం ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన రెవిన్యూ శాఖను చూస్తున్న ధర్మాన క్రిష్ణ దాస్ ఒకరైతే, పశు వర్ధక శాక మంత్రి సీదరి అప్పలరాజు మరొకరు.

ఈ ఇద్దరూ కూడా అనుకున్న విధంగా జిల్లాల్లో రాజకీయాన్ని నడిపించలేకపోతున్నారు అన్న అంచనాకు వైసీపీ హైకమాండ్ వచ్చేసింది అంటున్నారు. క్రిష్ణ దాస్ మెతకగా ఉంటారు, దూకుడు రాజకీయం చేయలేరు, ఇక జిల్లాలో మొత్తం పార్టీని ఆయన సమన్వయం చేయలేకపోతున్నారు. అసలే శ్రీకాకుళం జిల్లా టీడీపీకి కంచుకోట. ఏ మాత్రం చాన్స్ ఇచ్చినా మళ్లీ సైకిల్ దూసుకుపోతుంది అన్న బాధ అయితే వైసీపీలో ఉంది. ఇప్పటిదాకా జరిగినది ఎలా ఉన్నా ఎన్నికల నాటికి ధాటీ అయిన మంత్రులు ఉండాలని భావిస్తోంది.

మరో వైపు చూసే సీదరి అప్పలరాజు కూడా పనితీరులో పెద్దల మెప్పు పొందలేకపోయారు అని తెలుస్తోంది. కొన్నివిషయాల్లొ ఆయన వివాదాస్పదమైన తీరుతో సాగారని కూడా చెబుతున్నారు. దాంతో విస్తరణ అంటూ జరిగితే ఈ ఇద్దరినీ తప్పిస్తారు అన్న ప్రచారం అయితే ఊపు అందుకుంది. అదే సమయంలో కొత్త వారిగా ఎవరికి తీసుకుంటారు అన్న చర్చ వస్తోంది. అయితే అందరూ ఊహిస్తున్నట్లుగానే ధర్మాన ప్రసాదరావుకు అవకాశం ఇస్తారని అంటున్నారు. క్రిష్ణ దాస్ ని తప్పిస్తే తమ్ముడికే ఆ పదవి అని హై కమాండ్ ఫిక్స్ అయిపోయిందట.

ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత. పైగా ఆయన రాజకీయ వ్యూహాలు వేరుగా ఉంటాయి. ఎన్నికల వేళ ఆయన్ని ముందుపెట్టి కధ నడిపిస్తే శ్రీకాకుళం జిల్లాలో మరో మారు అధికారాన్ని కైవశం చేసుకోవచ్చు అన్న లెక్కలేవో ఉన్నాయట. దాంతో ప్రసాదరావు కూడా ఈ మధ్య స్పీడ్ పెంచేశారు. రీసెంట్ గా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ చెత్త పన్ను విషయంలో ఆయన గట్టిగా మాట్లాడం వెనక మంత్రి పదవి ఆశలు ఉన్నాయనే అంటున్నారు.

ఇక రెండవ మంత్రిగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ని తీసుకుంటారు అంటున్నారు. తమ్మినేని సీతారామ్ జగన్ తో చాలా సార్లు ఇదే విషయాన్ని విన్నవించుకున్నారు. తనకు ఇదే లాస్ట్ చాన్స్ అని మంత్రిగానే రాజకీయాల నుంచి రిటైర్ అవుతాను అని కూడా ఆయన చెబుతున్నారు. ఇక సిక్కోలు జిల్లాలో బలమైన కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేనికి పదవి ఇవ్వడం ఎందుకు అంటే ఆయన జిల్లాల్లో కింజరాపు ఫ్యామిలీకి అసలైన రాజకీయ ప్రత్యర్ధిగా ఉండడం. టీడీపీలో ఉన్న కాలం నుంచి ఆయన కింజరాపు ఫ్యామిలీని గట్టిగా అడ్డుకుంటూనే వస్తున్నారు.

జగన్ కి కూడా కావాల్సింది అదే. కింజరాపు ఫ్యామిలీలో ఈసారి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ ఓడాలని ఆయన అనుకుంటున్నారు. తమ్మినేనికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాళింగ సామాజికవర్గానికి దువ్వడంతో పాటు పదునైన రాజకీయ వ్యూహాలు రచించడం ద్వారా టీడీపీకి కూడా చెక్ చెప్పాలన్నది ఆలోచనగా ఉందిట. ఈ సమీకరణలు అన్నీ చూసుకుంటే మాత్రం తమ్మినేని, ప్రసాదరావులు కొత్త మంత్రులు అవడం ఖాయమని వైసీపీలో గట్టిగా వినిపిస్తోంది. మరి చూడాలి చివరికి ఏం జరుగుతుందో.