Begin typing your search above and press return to search.

`బొమ్మై`కి... అప్పుడే బొమ్మ క‌నిపిస్తోందా?

By:  Tupaki Desk   |   9 Aug 2021 3:30 PM GMT
`బొమ్మై`కి... అప్పుడే బొమ్మ క‌నిపిస్తోందా?
X
బీజేపీ అధిష్టానం సంపూర్ణ ఆశీస్సుల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌గ్గాలు చేప‌ట్టిన క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి, వివాద ర‌హితుడు, రాజ‌కీయ వారస‌త్వంగా కొన్ని ద‌శాబ్దాలుగా రాష్ట్రంలో చ‌క్రం తిప్పుతున్న బ‌స‌వ‌రాజ బొమ్మైకి.. అప్పుడే బొమ్మ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న అధికార‌ప‌గ్గాలు చేప‌ట్టి ప‌ట్టుమ‌ని మూడు శుక్ర‌వారాలు కూడా కాక‌ముందే.. మంత్రి వ‌ర్గంలో అసంతృప్తులు బ‌య‌ట‌ప‌డుతున్నారు. నిజానికి మాజీ సీఎం య‌డియూర‌ప్ప ప‌ద‌విని వ‌దులుకోగానే.. అంద‌రూ ఏక‌గ్రీవంగా.. బొమ్మైకి ప‌ట్టం గ‌ట్టారు. అప్ప‌ట్లో ఆయ‌న‌ను అందరూ పొగిడిన వారే. పైగా.. మాజీ సీఎం.. క‌ర్ణాట‌క బీజేపీని నిల‌బెట్టిన య‌డియూర‌ప్ప‌కు ప్రాణ‌మిత్రుడు కావ‌డంతో సీఎంగా బొమ్మై.. ప్ర‌యాణం సాఫీగా సాగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

అయితే.. ఇప్పుడు ఒక్కొక్క‌రుగా అసంతృప్తులు వెళ్ల‌గ‌క్కుతున్నారు. తమకు కేటాయించిన శాఖలపై ముగ్గురు మంత్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ముఖ్య‌మంత్రి బొమ్మై పై నేరుగా మీడియా ముందే తమ అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతున్నారు. మంత్రులు ఎంటీబీ నాగరాజు, శ్రీరాములు, ఆనంద్ సింగ్ తాజాగా సీఎం వైఖ‌రిని విమ‌ర్శిస్తూ.. మీడియా మీటింగ్ పెట్ట‌డం.. రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. నాగరాజు అయితే ఏకంగా తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా కూడా వెల్ల‌డించారు. ``నాకు కీల‌క‌మైన‌ శాఖలు కేటాయిస్తానని చెప్పిన బొమ్మై.. ఇప్పుడు మాట మార్చారు`` అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. బొమ్మైకి.. నాగ‌రాజు.. డెడ్‌లైన్ కూడా విధించారు. మూడు రోజులు వెయిట్ చేస్తానని తనకిచ్చిన మున్సిపల్, చిన్న తరహా పరిశ్రమల శాఖలను తప్పించి ప్రాధాన్యత ఉన్న‌ శాఖను కేటాయించకపోతే రాజీనామా చేస్తానని హెచ్చ‌రించారు. నిజానికి య‌డియూర‌ప్ప హ‌యాంలోనూ ఇలాంటి అసంతృప్తులు తెర‌మీదికి వ‌చ్చినా.. ఈ రేంజ్‌లో ఎవ‌రూ వార్నింగులు ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక, ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన‌ శ్రీరాములైతే తనకు కేటాయించిన రవాణా శాఖను ఏం చేసుకోను? అంటూ తీవ్రంగా మండిప‌డ్డారు. త‌న‌కు అస‌లు సీఎం ప‌ద‌వే ద‌క్కుతుంద‌ని అంద‌రూ అన్నార‌ని.. కానీ, ఇప్పుడు `స్టీరింగ్ శాఖ‌`ను అప్ప‌గించార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

త‌న‌కు.. సీఎం ప‌ద‌వి తృటిలో త‌ప్పినందున‌.. మంత్రి వ‌ర్గంలో అయినా కీల‌క శాఖ కేటాయిస్తారని అనుకున్నట్లు చెప్పారు. అయితే.. ముఖ్య‌మంత్రి బొమ్మై తనను తీవ్రంగా నిరాసపరిచినట్లు మీడియా ముందు చెప్పుకొచ్చారు. అసలు తనకు తొలుత సీఎం త‌ర్వాత ఉపముఖ్యమంత్రి పదవి దక్కుతుందని శ్రీరాములు ఆశించారు. ఇదే విష‌యంలో త‌న అనుచ‌రుల‌తో సోష‌ల్ మీడియాలోనూ ప్ర‌చారం చేసుకున్నారు. కానీ, చివ‌ర‌కు సీఎం ప‌ద‌వి బొమ్మైకి ద‌గ్గ‌డంతోపాటు.. శ్రీరాములుకు క‌నీసం.. డిప్యూటీ కూడా ద‌క్క‌లేదు. దీంతో ఆయ‌న ఇప్పుడు ప్ర‌భుత్వానికి కొర‌క‌రాని కొయ్య‌గా మారిపోయార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇక పర్యావరణ, పర్యాటక రంగ శాఖల మంత్రి ఆనందసింగ్ కతేవేరు కూడా తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. తనకు దక్కాల్సిన శాఖల కోసం పోరాటం చేసైనా దక్కించుకుంటానని శపథం చేశారు. తనకు అన్యాయం జరిగితే చూస్తు ఊరుకునేదిలేద‌న్న ఆయ‌న ఏం చేస్తాన‌నేది చెప్పనని, చేసి చూపుతాన‌ని హెచ్చ‌రించారు. తన విషయంలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపైనే తాను ఏమి చేయాలనేది ఆధారపడుంటుందని గట్టిగానే చెప్పారు. నిజానికి ఇలాంటి అసంతృప్తులు య‌డియూర‌ప్ప కూడా ఎదుర్కొన్నారు. హోం, రెవెన్యూ, ఆర్థిక, పంచాయ‌తీరాజ్ వంటి శాఖ‌ల‌ను కొంద‌రు ఎప్ప‌టి నుంచో కోరుతున్నారు. కానీ, అధిష్టానం ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్న వారు ప‌దుల సంఖ్య‌లో ఉండ‌డంతో వారికి వీటిని కేటాయించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో వీరికి మిగిలిన శాఖ‌లు కేటాయించారు.

వాస్త‌వానికి బీజేపీలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ.. పార్టీకి కృషి చేస్తున్న‌వారు చాలా మంది ఉన్నారు. వీరిలో స‌గానికిపైగా గుర్తింపున‌కు నోచుకోవ‌డం లేదు. మంత్రిపదవి దక్కితే చాలని ఒకవైపు వీరంతా ఎదురుచూస్తున్నారు. అయితే.. ద‌క్కిన వారు.. ఇలా రోడ్డెక్కితే.. ద‌క్క‌ని వారి ప‌రిస్థితి ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రి దీనిని బొమ్మై ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి. ఇక్క‌డ య‌డియూర‌ప్ప రంగంలోకి దిగితే త‌ప్ప‌.. స‌మ‌స్య ప‌రిష్కారం కాద‌నే భావ‌న కూడా వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.