Begin typing your search above and press return to search.

కేంద్ర‌మంత్రి వ‌ర్గంలో మార్పులు!

By:  Tupaki Desk   |   9 Nov 2015 9:51 AM GMT
కేంద్ర‌మంత్రి వ‌ర్గంలో మార్పులు!
X
బీహార్‌ లో ఎన్నికల ఓట‌మి త‌ర్వాత‌ బీజేపీలో సాగుతున్న అంత‌ర్మ‌థ‌నం ఇంకా చ‌ల్లార‌లేదు స‌రికదా మ‌రింత వేడెక్కింది. బీహార్‌ లో ఓట‌మి త‌న ప్ర‌తిష్టకు తీవ్ర భంగ‌క‌ర‌మని భావిస్తున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన‌ట్లు బీజేపీ జాతీయ‌వ‌ర్గాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగా మోడీ త‌న టీంను సంస్క‌రించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల స‌మాచారం మేర‌కు కేంద్రమంత్రివర్గంలో మార్పులకు మోడీ శ్రీకారం చుట్టనున్నారు.

తమ బాధ్యతల నిర్వహణలో వైఫల్యం చెందిన మంత్రులను మోడీ మార్చే అవకాశాలున్నాయని బీజేపీ అగ్ర‌నేత‌లు చెప్తున్నారు. ప్ర‌ధాన‌మంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షాలు ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీ అగ్ర‌నేత‌ల వ‌ద్ద ఉన్న డాటాబేస్ ప్ర‌కారం... బీహార్‌ లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఐదుగురు మంత్రులు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. వారిలో ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ - వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. పప్పు దినుసుల ధరలు విప‌రీతంగా పెరిగిపోవడం, దేశంలో క‌రువు ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నా ఏమాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటి అంశాలు మోడీ దృష్టికి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మంత్రుల‌పై భారీ నిర్ణ‌యాలు తీసుకోకున్నా శాఖ‌ల మార్పిడి ఉంటుంద‌ని చెప్తున్నారు. ఆ ఐదుగురు మంత్రులు తమ శాఖలతోపాటు, బీహార్‌ ఎన్నికల్లో కూడా పని చేసిన తీరును పరిగణనలోకి తీసుకుని మొత్తంగా వారి పనితీరును అంచనా వేయనున్నారు. అయితే వెంటనే మంత్రిమండలిలో మార్పులు చేయకపోయినా, శీతాకాల సమావేశాల అనంతరం మంత్రులను మార్చే అవకాశం ఉన్నట్లు బీజేపీ అత్యున్న‌త‌ వర్గాలు పేర్కొంటున్నాయి.