Begin typing your search above and press return to search.

ఏపీఎస్ ఆర్టీసీ చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ల‌కు కేబినెట్ హోదా.. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు!

By:  Tupaki Desk   |   21 Jun 2022 5:31 AM GMT
ఏపీఎస్ ఆర్టీసీ చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ల‌కు కేబినెట్ హోదా.. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు ఏ మాత్రం జంక‌డం లేదు. త‌మ సామాజిక‌వ‌ర్గ నేత‌ల‌కు ప‌ద‌వుల పందేరం కొన‌సాగిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఏపీ మౌలిక స‌దుపాయాల అభివృద్ధి సంస్థ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామిక మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న సంస్థ‌, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ‌, ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్, ఏపీ అట‌వీ అభివృద్ధి సంస్థ‌, ఏపీ పైబ‌ర్ నెట్ కార్పొరేష‌న్ ఇలా ఎన్నో కార్పొరేష‌న్ల‌కు రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ను ఎంపిక చేశార‌ని ప్ర‌తిప‌క్షాలు తీవ్రం ఆరోపిస్తున్నాయి.

నిధులు, విధులు లేని, ఊరూపేరూ లేని కార్పొరేష‌న్ల‌ను బీసీల‌కు అప్ప‌గించి.. సామాజిక న్యాయం చేస్తున్నామ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చెప్పుకుంటోంద‌ని తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏపీఆర్టీసీ చైర్మ‌న్ మ‌ల్లికార్జున రెడ్డి, వైస్ చైర్మ‌న్ /డైరెక్ట‌ర్ విజ‌యానంద‌రెడ్డిల‌కు కేబినెట్ హోదా క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనిపై ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నాయి. ప్ర‌జాధ‌నాన్ని త‌న సొంత సా మాజిక‌వ‌ర్గ నేత‌ల‌కు దోచిపెడుతోంద‌ని మండిప‌డుతున్నాయి.

కేబినెట్ హోదా క‌ల్పిస్తూ కేబినెట్ మంత్రికి ఉండే అన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తూ, నెల‌కు ఆరేడు ల‌క్ష‌ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నాన్ని జీతంగా ఇస్తున్నార‌ని నిప్పులు చెరుగుతున్నాయి. ఇప్ప‌టికే దాదాపు 70 మందిని ప్ర‌భుత్వ‌, సీఎం స‌ల‌హాదారులుగా నియ‌మించుకున్నార‌ని.. వీరిని ప్ర‌తినెలా ల‌క్ష‌ల రూపాయ‌లు, తిర‌గ‌డానికి కార్లు, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పిస్తున్నార‌ని గుర్తు చేస్తున్నారు.

కాగా గ‌తేడాది ఆగ‌స్టులో ఆర్టీసీ చైర్మ‌న్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.. మ‌ల్లికార్జున‌రెడ్డి. ఆ త‌ర్వాత కొంత‌కాలానికి విజ‌యానంద‌రెడ్డి వైస్ చైర్మ‌న్ గా, డైరక్ట‌ర్ గా నియ‌మితుల‌య్యారు. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామిక మౌలిక స‌దుపాయాల క‌ల్పన సంస్థ (ఏపీఐఐసీ) చైర్మ‌న్ కు మాత్ర‌మే కేబినెట్ హోదా ఉండేది.

కానీ ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆర్టీసీ చైర్మ‌న్ కే కాకుండా వైస్ చైర్మ‌న్ కూ కేబినెట్ హోదా క‌ట్ట‌బెట్ట‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.