Begin typing your search above and press return to search.

భాగ్యనగరి వాసి నెత్తిన కేబుల్ పన్ను

By:  Tupaki Desk   |   14 Oct 2015 5:55 AM GMT
భాగ్యనగరి వాసి నెత్తిన కేబుల్ పన్ను
X
పొద్దున లేచింది మొదలు రాత్రి పోయేవరకూ పన్ను పోటు పడనోడు కనిపించదు. వాడే టూత్ బ్రష్ మొదలు.. నిద్రపోయే సమయంలో ఆన్ చేసే మస్కిటో రిఫెల్లర్స్ వరకూ అన్నింటా పన్ను పోటే. ఇవి చాలవన్నట్లు గూబ వాసిపోయేలా వ్యాట్.. సర్వీస్ టాక్స్ లతో వీపు మీద భారీగా భారం మోపుతున్న పరిస్థితి. నాలుగు రాళ్లు వెనకేద్దామనుకునే వారంతా రోజురోజుకీ పెరుగుతున్న పన్ను పోటుతో విలవిలలాడే పరిస్థితి.

ఇవి చాలవన్నట్లు పెరుగుతున్న నిత్యవసర వస్తువులు మొదలు.. టిఫిన్ల వరకూ ధరాభారం పెరుగుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. భాగ్యనగరి వాసి నెత్తిన మరో పన్ను పడనుంది. దీని భారం తక్కువగా కనిపించినా.. పన్నుల లెక్కలోకే వస్తుందన్న విషయం మర్చిపోకూడదు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కేబుల్ టీవీ వినియోగించే వారిపై కేబుల్ పన్ను విధిస్తున్నారు. ఈ మొత్తాన్ని కేబుల్ ఆపరేటర్లు చెల్లించాల్సి ఉంది. తమ నెత్తి మీద పడే ఏ భారాన్ని అయినా.. అంతిమంగా వ్యాపారస్తుడు.. మోపేది వినియోగదారుడి మీదనే. కేబుల్ పన్ను విషయంలోనూ అదే పద్ధతి.

ప్రభుత్వం విధిస్తున్న ఈ పన్ను భారాన్ని వినియోగదారుల మీద వేయాలని కేబుల్ ఆపరేటర్లు భావిస్తున్నారు. ప్రతి కేబుల్ కనెక్షన్ మీద సరాసరి రూ.5 మేర భారం మోపేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ కేబుల్ పన్ను గతంలోనే చట్టంలో ఉన్నప్పటికి.. పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ.. ఇప్పుడు ఆ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని డిసైడ్ చేయటంతో గ్రేటర్ హైదరాబాద్ వాసికి పన్నుపోటు పడక తప్పనిసరి పరిస్థితి.