Begin typing your search above and press return to search.

మోడీనా మ‌జాకానా? కాగ్ టోన్ మారిందే!

By:  Tupaki Desk   |   13 Feb 2019 7:22 AM GMT
మోడీనా మ‌జాకానా?  కాగ్ టోన్ మారిందే!
X
కాగ్ అన్న పొట్టి పేరుతో పిలిచే కంప్రోల్ట‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ నివేదిక విడుద‌ల చేస్తుందంటే అధికార‌పక్షం వ‌ణికిపోవ‌టం.. విప‌క్షాలు విలాసంగా దాని కోసం ఎదురుచూసే ప‌రిస్థితి ఇప్ప‌టివ‌ర‌కూ చూశాం. కానీ..ఎవ‌రినైనా స‌రే.. మంత్ర‌ముగ్దుల్ని చేస్తార‌న్న పేరున్న మోడీ కాగ్ మ‌న‌సును కూడా దోచేశారు. విప‌క్షాలు ఒక రేంజ్లో విరుచుకుప‌డుతూ.. మోడీ స‌ర్కారుకు అవినీతి మ‌ర‌క వేస్తూ.. రాఫెల్ డీల్ లో ఏదో జ‌రిగిపోయింద‌న్న వాద‌న‌ను కాగ్ తాజాగా కొట్టేసింది.

ఇటీవ‌ల కాలంలో రాఫెల్ డీల్ కు సంబంధించిన ప‌లు అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నంగా మారిన వేళ‌.. అందుకు భిన్నంగా కాగ్ రియాక్ట్ కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

వివాదాస్ప‌ద రాఫెల్ ఒప్పందంతో స‌హా భార‌త వైమానిక ద‌ళంలో జ‌రిగిన భారీ కొనుగోళ్ల‌పై కాగ్ నివేదిక బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాఫెల్ డీల్ మీద కాగ్ ఏం చెప్పింద‌న్న ఉత్సుక‌త అంద‌రిలో వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఈ రోజు రాజ్య‌స‌భ‌కు కాగ్ నివేదిక చేరింది. ఈ నివేదిక‌లో దాదాపు 32 పేజీలు రాఫెల్ డీల్ అంశాల్ని ప్ర‌స్తావించారు.

కాగ్ నివేదిక‌ను కేంద్ర ఆర్థిక స‌హాయ‌మంత్రి రాధాకృష్ణ‌న్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. యూపీఏ హ‌యాంలో కుదుర్చుకున్న రాఫెల్ డీల్ కంటే.. మోడీ హ‌యాంలో చేసుకున్న రాఫెల్ డీల్ మంచిద‌న్న మాట‌ను కాగ్ రిపోర్ట్ చెప్పేసింది. అంతేకాదు... గ‌తంలో 126 యుద్ధ విమానాల కొనుగోలు కోసం చేసుకున్న ఒప్పందంతో పోల్చిన‌ప్పుడు కేంద్రం తాజాగా కుదుర్చుకున్న 36 విమానాల కొనుగోలు కార‌ణంగా 2.86 శాతం సొమ్ము ఆదా అవుతుంద‌న్న విష‌యాన్ని కాగ్ త‌న నివేదికలోపేర్కొంది.

ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు రాని రాఫెల్ ధ‌ర‌ల్ని కాగ్ నివేదిక‌లో కూడా ప్ర‌స్తావించ‌లేదు. యూపీఏ హ‌యాంలో చేసుకున్న ఒప్పందంలో ధ‌ర‌ల‌తో పోలిస్తే.. మోడీ నేతృత్వంలోని కేంద్రం చేసుకున్న డీల్ లో విమానాల ధ‌ర‌ల్ని అధికంగా కోట్ చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌లుమార్లు విమానం ధ‌ర‌ను చెప్పాల‌న్న డిమాండ్ పై దాట‌వేత ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించారు.

ఈ నేప‌థ్యంలో కాగ్ నివేదిక‌లో ఆ వివ‌రాలు ఉంటాయ‌ని ఆశించారు. కానీ.. తాజాగా విడుద‌లైన నివేదిక‌లో రాఫెల్ విమాన ధ‌ర‌ల్ని పేర్కొన‌లేదు. కాంగ్రెస్ చేస్తున్న వాద‌న‌ల‌కు భిన్నంగా కాగ్ నివేదిక ఉండ‌టం అధికార‌ప‌క్షానికి నైతిక స్థైర్యాన్ని పెంచుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. దీనిపై విపక్షాలు ఎలాంటి వాద‌న‌లు వినిపిస్తాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారిన‌ట్లే.