Begin typing your search above and press return to search.

కోర్టు వార్ః సుప్రీంకోర్టు జ‌డ్జీల‌పై సీబీఐ విచార‌ణ‌

By:  Tupaki Desk   |   10 March 2017 2:14 PM GMT
కోర్టు వార్ః సుప్రీంకోర్టు జ‌డ్జీల‌పై సీబీఐ విచార‌ణ‌
X
కోల్‌క‌తా హైకోర్టు న్యాయ‌మూర్తి సీఎస్ క‌ర్ణ‌న్ సంచ‌ల‌న తీర్పు జారీచేశారు. కోర్టు ఉల్లంఘ‌న కేసులో త‌న‌కు బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సుప్రీంకోర్టు బెంచ్ న్యాయ‌మూర్తుల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని సీబీఐని సీఎస్ క‌ర్ణన్ ఆదేశించారు. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌ జేఎస్ ఖేహార్‌తోపాటు ధ‌ర్మాస‌నంలోని మిగ‌తా ఆరుగురు న్యాయ‌మూర్తుల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే కాకుండా కేంద్ర ప్ర‌భుత్వాన్ని సైతం ఈ ముగ్గులోకి లాగారు.

ఓ హైకోర్టు న్యాయ‌మూర్తికి బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయ‌డం భార‌త న్యాయ‌చ‌రిత్ర‌లోనే తొలిసారి జరిగింద‌ని మీడియాతో మాట్లాడుతూ క‌ర్ణ‌న్ ఆరోపించారు. కేంద్రంలో ఇప్ప‌టి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాతే ఇలా జ‌రుగుతున్న‌ద‌ని, ద‌ళితుల‌ను అణ‌చివేస్తున్నార‌ని క‌ర్ణ‌న్ ఆరోపించారు. ధ‌ర్మాస‌నంలో ఏడుగురు న్యాయ‌మూర్తుల‌పై కేసు ఫైల్ చేసి, విచార‌ణ జ‌రిపి నివేదిక‌ను ఢిల్లీలోని సీబీఐ కోర్టు ముందు ఉంచాల‌ని సీబీఐ డైరెక్ట‌న్‌ను ఆయ‌న ఆదేశించారు. ఇలాంటి ఆర్డర్ ఇవ్వాల‌ని అడిగిన అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గీపైనా విచార‌ణకు ఆదేశించారు.

క్రిమిన‌ల్ ప్రొసీజ‌న్ కోడ్ (సీపీసీ)లోని సెక్ష‌న్ 482, భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 226 ప్ర‌కారం త‌న‌కున్న విశిష్ట అధికారాల‌ను ఉప‌యోగించి ఈ విచార‌ణ‌కు ఆదేశించాను. "ఏ కోర్టునూ త‌క్కువ‌గా చూడ‌కూడ‌ద‌నే ఇలా చేశాను. ఈ విచార‌ణ‌లో సుప్రీం న్యాయ‌మూర్తులు.. ఎస్సీ, ఎస్టీ చ‌ట్టంతోపాటు ఐపీసీని ఉల్లంఘించారా లేదా అన్న‌ది తెలుస్తుంది" అని క‌ర్ణ‌న్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను లోక్‌ స‌భ స్పీక‌ర్‌ కు అందించాల‌ని లోక్‌ స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు క‌ర్ణ‌న్ ఆదేశించారు. సుప్రీం న్యాయ‌మూర్తుల‌పై విచార‌ణ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌డంతోపాటు మ‌హాభియోగ తీర్మానానికి ప్ర‌క్రియ మొద‌లుపెట్టేందుకు వీలుగా స్పీక‌ర్‌కు ఈ ఫైల్ అంద‌జేయాల‌ని క‌ర్ణ‌న్ చెప్పారు. త‌న‌పై సుప్రీం జారీ చేసిన బెయిల‌బుల్ వారెంట్‌పై స్టే విధించాల‌ని రాష్ట్ర‌ప‌తిని కోరిన‌ట్లు వెల్ల‌డించారు. నిజానికి గ‌త ఫిబ్ర‌వ‌రిలోనే క‌ర్ణ‌న్‌ను న్యాయ‌, ప‌రిపాల‌న ప‌ర‌మైన విధుల నుంచి సుప్రీంకోర్టు తొల‌గించినా.. ఆయ‌న మాత్రం ఆ ఆదేశాల‌ను పాటించ‌లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/