Begin typing your search above and press return to search.

ఫుల్లుగా పార్టీ ఇచ్చి తనువు చాలించింది

By:  Tupaki Desk   |   14 Aug 2016 10:30 PM GMT
ఫుల్లుగా పార్టీ ఇచ్చి తనువు చాలించింది
X
కొన్ని నిర్ణయాలు మనసు లోతుల్లో బలంగా ముద్రపడి పోతాయి. హాలీవుడ్ లో పాపుల‌ర్ వ్య‌క్తి ఒక‌రు తీసుకున్న నిర్ణ‌యం అలాగే ముద్ర‌వేసింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రంగస్థల నటి - చిత్రకారిణి బెస్టీ డెవిస్ (41) అనే మహిళ తీసుకున్న నిర్ణయం కూడా ఆమె 30 మంది స్నేహితుల్లో అలాంటి భావ‌న‌నే వేసింది. ఆస్వాదిస్తూ మ‌ర‌ణించ‌డం అనే కొత్త కాన్సెప్ట్‌ ను ఆమె ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన‌ట్ల‌యింది.

బెస్టీ డెవిస్ తనకు అత్యంత ఆప్తులైన 30 మంది స్నేహితులకు జూలై 23 - 24 తేదీల్లో తానిచ్చే విందుకు హాజరు కావాలని ఈ మెయిల్ పంపింది. ఈ రెండు రోజుల విందు మీరు గతంలో వెళ్లిన పార్టీల మాదిరిగా ఉండకపోవచ్చని - భావోద్వేగ స్థిరత్వం - దృఢత్వం - విశాల మనస్తత్వం ఉన్నవాళ్లు మాత్రమే హాజరు కావాలని ఆమె స్పష్టం చేసింది. 'మనసులోని మాటలు పంచుకోవడం - డ్యాన్స్ చేయడం - పాటలు పాడటం - ప్రార్థనలు చేయడం - ఇష్టమైన ఆహార పదార్థాలు - ఆల్కహాల్ నచ్చినంత పుచ్చుకుని హాయిగా గడపాలి - ఎవరూ ఏడవకూడదు' అని ఆమె షరతు విధించింది. ఏడ్చే ఆలోచన ఉంటే ఈ విందుకు హాజరు కావద్దంటూ బెస్టీ తన ఈమెయిల్‌ లో స్పష్టం చేసింది. ఈ మెయిల్‌ కు ఆశ్చ‌ర్య‌పోయిన ఆమె స్నేహితులు వేడుక‌కు వెళ్లాల‌ని డిసైడ‌య్యారు. అలా పార్టీని సంబరంగా చేసుకున్నారు. స్నేహితుల రాక‌తో రెండు రోజులు పార్టీతో బెస్టీ హాయిగా గడిపింది. ఈ ఆనందం ఇక చాలని భావించింది. అంతే, విందు తరువాత ఎక్కువ మోతాదులో మందులు తీసుకొని నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూసింది.

కాగా, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఆరు నెలలకు మించి బతికే అవకాశం లేనివారు యుక్త వయస్కులై ఉంటే వైద్యుల పర్యవేక్షణలో ఆత్మహత్య చేసుకోవచ్చనే కొత్త చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం రెండు నెలల క్రితం అమలులోకి వచ్చింది. దీంతో ఈ చట్టం అమలైన తరువాత ఆత్మహత్య చేసుకున్న తొలి మహిళగా బెస్టీ నిలిచింది. దీనిపై ఆమె స్నేహితుడైన సినిమాటోగ్రాఫర్ నీల్స్ అల్పెర్ట్ మాట్లాడుతూ, 'స్నేహితులతో ఓ అందమైన వీకెండ్‌ ను గడిపి ఆ తరువాత సూసైడ్ చేసుకోవాలనుకోవడం మామూలు ఆలోచన కాదు. ఇది సాధారణంగా ప్రతిసారి ఎదురయ్యే అనుభవం కాదు. తన ముందు మేము ఆనందంగా నవ్వుతూ గడిపినప్పటికీ తరువాత ఏం జరుగుతుందన్నది మా మనస్సులో మెదులుతూనే ఉంది అని బాధాత‌ప్త హృద‌యంతో తెలిపారు.