Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ నిజంగానే అంత స్కాం చేసిందా?

By:  Tupaki Desk   |   21 March 2018 5:35 AM GMT
ఫేస్ బుక్ నిజంగానే అంత స్కాం చేసిందా?
X
నిద్ర లేచిన వెంట‌నే నూటికి 80 మంది మొద‌ట చేసేది మొబైల్ ఫోన్ చెక్ చేసుకోవ‌టం. అందులో మ‌రో 60 శాతానికి పైనే.. సోష‌ల్ మీడియాలో త‌మ స్టేట‌స్ చూసుకోవ‌టం.. అప్ డేట్స్ చెక్ చేయ‌టం ఇప్పుడు మామూలైంది. ఫేస్ బుక్ .. వాట్సాప్ లాంటివైతే జీవితంలో భాగంగా మారిపోయాయి. తినే తిండి ప‌ది నిమిషాలు లేటైనా ఫ‌ర్లేదు కానీ.. సోష‌ల్ మీడియాలో ఏం జ‌రుగుతుందోన‌న్న విష‌యాన్ని తెలుసుకోవ‌టంలో మాత్రం కించిత్ మిస్ కావ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది.

మ‌రింత‌లా మ‌నుషుల జీవితాల్లోకి చొచ్చుకు వ‌చ్చిన ఫేస్ బుక్ భారీ కుంభ‌కోణానికి పాల్ప‌డిన ఆరోప‌ణ‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో భారీ స్కాంలో చిక్కుకుపోవ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఫేస్ బుక్ పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆ కంపెనీ షేర్ ధ‌ర అనూహ్యంగా ప‌డిపోవ‌టం చూస్తే.. దానిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో ఎంతోకొంత విష‌యం ఉంద‌న్న సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు.

ఇంత‌కీ ఫేస్ బుక్ చేసిన భారీ స్కాం ఏమిట‌న్న‌ది చూస్తే.. అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావ‌టానికి వీలుగా ఫేస్ బుక్ స‌హ‌క‌రించింద‌న్న‌ది ఆరోప‌ణ‌. ఇందులో భాగంగా దాదాపు 5 కోట్ల యూజ‌ర్ల వ్య‌క్తిగ‌త డేటాను లీక్ చేయ‌టం ద్వారా వారిని ప్ర‌భావితం చేశార‌ని చెబుతున్నారు. ఈ ఆరోప‌ణ నేప‌థ్యంలో ఫేస్ బుక్ షేర్లు ప్ర‌పంచ మార్కెట్లో ఏడు శాతానికి పైగా ప‌డిపోగా.. ఇంకా ప‌త‌న‌మ‌వుతూనే ఉన్నాయి.

తాజా స్కాం వార్త‌ల‌తో జుక‌ర్ బ‌ర్గ్ నిక‌ర సంప‌ద‌లో దాదాపు 500 కోట్ల డాల‌ర్ల మొత్తం న‌ష్ట‌పోయిన‌ట్లుగా లెక్క వేస్తున్నారు. అంతేనా.. ఈ వ్య‌వ‌హారంపై బ్రిట‌న్‌.. ఐరోపా స‌మాఖ్య దేశాల‌కు చెందిన రాజ‌కీయవేత్త‌లు సైతం మండిప‌డుతున్నారు. ఈ వ్య‌వ‌హారంపై త‌మ దేశానికి వ‌చ్చి వ్య‌క్తిగ‌తంగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని.. విచార‌ణ ఎదుర్కోవాల‌న్న డిమాండ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఇంత‌కీ ఈ కుంభ‌కోణం మూలాల్లోకి వెళితే.. డాక్ట‌ర్ అలెగ్జాండ‌ర్ కోగ‌న్ అనే పెద్దాయ‌న కేంబ్రిడ్జ్ లో సైకాల‌జీలో ప్రొపెస‌ర్. మ‌నుషుల మ‌న‌స్త‌త్వం ఎలా మారుతోంద‌న్న అంశంతో పాటు.. డిజిట‌ల్ యుగంలో వారి ప్ర‌వ‌ర్త‌న‌లో వ‌స్తున్న మార్పులు ఏమిట‌న్న అంశంపై దిసీజ్ యువ‌ర్ డిజిట‌ల్ లైఫ్ అనే యాప్ ను త‌యారు చేశారు. దాన్ని ఫేస్ బుక్ తో అనుసంధానం చేశారు. వ్య‌క్తిగ‌త డేటాను తీసుకోవ‌టానికి మామూలుగా అయితే ఫేస్ బుక్ ఒప్పుకోదు.

అయితే.. త‌న టార్గెట్ అంతా మ‌నిషి సైకాల‌జీని డిజిట‌ల్ కోణంలో చూడ‌ట‌మేన‌న్న మాట‌ను ప్రొఫెస‌ర్ గారు న‌మ్మేలా చేశాడు. వేలాదిమంది ప్ర‌జ‌లతో ఫేస్ బుక్ తో ఇంట‌రాక్ట్ అవుతూ వారి డేటాను సేక‌రించాడు. అంతా బాగానే ఉంది క‌దా అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఇక్క‌డే అస‌లు విష‌యం ఉంది.

అదేమంటే ప్రొఫెస‌ర్ గారి టీంలో క్రిస్టొఫర్‌ వైలీ అనే పోటుగాడు ఉన్నాడు. ఇత‌డు డేటా అన‌లిటిక్స్ లో అఖండుడు. ఇత‌డు డొనాల్డ్ ట్రంప్ స‌ర్కారులో స‌ల‌హాదారుగా ప‌ని చేసిన స్టీవ్ బాన‌న్ కు బాగా క్లోజ్. ట్రంప్ స‌ర్కారులో స‌ల‌హాదారుగా ఉన్న ఇత‌ను ఎన్నిక‌ల వేళ‌లో ట్రంప్ ప్ర‌చార స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించారు. సోష‌ల్ మీడియాను ఓ రేంజ్లో వాడేసుకొని.. వాటి ద్వారా ఓట‌ర్ల‌కు చేరువ కావొచ్చ‌ని.. పెద్ద పెద్ద నెట్ వ‌ర్కింగ్ సైట్ల‌కు డ‌బ్బు ఎర‌వేసి డేటా తీసుకోవ‌చ్చ‌న్న ప్ర‌తిపాద‌న వైలీ చేశాడు.

అందుకు బాన‌న్ ఓకే అన‌టంతో కేంబ్రిడ్జ్ అన‌లిటికా అనే సంస్థ‌ను స్టార్ట్ చేసి దాని ద్వారా ఆప‌రేష‌న్ స్టార్ట్ చేశాడు. తానీ ప‌ని చేసేందుకు త‌న మ‌న‌స్సాక్షి ఒప్పుకోలేద‌ని.. మ‌న‌స్ఫూర్తిగా చేయ‌లేక‌పోయాన‌ని.. గార్డియ‌న్ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

మ‌న‌స్సాక్షి ఒప్పుకోకపోవ‌టంతో తాను ప‌ని చేయ‌లేద‌ని చెప్పినా.. ఆయ‌న కంపెనీలోని వారంతా చేశారు. దీంతో..త‌మ‌కు అవ‌స‌ర‌మైన డేటాను తీసుకొని ట్రంప్ ప్ర‌చారంలో వాడుకున్నారు. ఈ వ్య‌వ‌హారంలో కొస‌మెరుపు ఏమిటంటే.. కుంభ‌కోణంలో భాగ‌స్వామి అయిన కోలీ చెప్పిన మాట‌లే.. ఈ మొత్తం వ్య‌వ‌హారం గుట్టు ర‌ట్టు అయ్యేలా చేసింది. మరీ వ్య‌వ‌హారంపై ఫేస్ బుక్ మాటేమిటంటే.. ఇదేమీ కుంభ‌కోణం కాద‌ని కేవ‌లం డేటా బ్రీచ్ మాత్ర‌మేన‌ని.. ఈ వ్య‌వ‌హారంలో త‌మ‌కు నేరుగా ఎలాంటి సంబంధం లేద‌ని వాదిస్తోంది. ప‌నిలో ప‌నిగా కోగ‌న్ త‌యారు చేసిన యాప్ ను తొల‌గించింది. వైలీ అకౌంట్ ను ఫ్రీజ్ చేసింది. జ‌ర‌గాల్సిందంతా జ‌రిగిపోయిన త‌ర్వాత ఏం చేస్తే మాత్రం ప్ర‌యోజ‌నం ఏముంటుంది?