Begin typing your search above and press return to search.

మ‌హా రిసార్ట్ రాజ‌కీయాల త‌ర‌హాలోనే ఆ రాష్ట్రంలోనూ క్యాంపులు!

By:  Tupaki Desk   |   28 Aug 2022 8:01 AM GMT
మ‌హా రిసార్ట్ రాజ‌కీయాల త‌ర‌హాలోనే ఆ రాష్ట్రంలోనూ క్యాంపులు!
X
దేశంలో తాము అధికారంలోని రాష్ట్రాల‌ను ఒక్కొక్క‌టిగా చేజిక్కించుకునే దిశ‌గా బీజేపీ చేస్తున్న రాజ‌కీయాలతో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) - కాంగ్రెస్-ఆర్జేడీ కూట‌మి ప్ర‌భుత్వం రిసార్టు రాజ‌కీయాల‌కు తెర‌లేపింది. జార్ఖండ్ శాస‌న‌స‌భ‌లో మొత్తం 81 మంది స‌భ్యులు ఉన్నారు. వీరిలో జార్ఖండ్ ముక్తి మోర్చాకు 30 మంది, కాంగ్రెస్ పార్టీకి 16, ఆర్జేడీకి ఒక‌రు స‌భ్యులు ఉన్నారు.

జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న హేమంత్ సోరెన్ ప్ర‌భుత్వానికి 47 మంది స‌భ్యుల బ‌లం ఉంది. మెజారిటీకి కావాల్సిన 41 మంది కంటే కేవ‌లం ఆరుగురు మాత్ర‌మే అధికంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రిగానే కాకుండా జార్ఖండ్ గ‌నుల శాఖ మంత్రిగా కూడా ఉన్న హేమంత్ సోరెన్ త‌న‌కు తానుగా ఒక ప్ర‌భుత్వ గ‌నుల లీజును త‌న‌కు కేటాయించుకోవ‌డం తీవ్ర వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే. దీనిపై బీజేపీ.. గ‌వ‌ర్న‌ర్‌కు, కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. హేమంత్ సోరెన్ రెండు లాభ‌దాయ‌కమైన ప‌ద‌వుల్లో ఉన్నారని వారి దృష్టికి తెచ్చింది. ఆయ‌న‌ను ఎమ్మెల్యే ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని కోరింది. బీజేపీ ఫిర్యాదుపై విచార‌ణ నిర్వ‌హించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం బీజేపీ ఫిర్యాదు వాస్త‌వ‌మేన‌ని నిర్ధారించింది. హేమంత్ సోరెన్ ను ఎమ్మెల్యే ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కు సూచించింది. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.

ఈ నేప‌థ్యంలో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా హేమంత్ సోరెన్ త‌నకు ఎమ్మెల్యేలంద‌రితో భేటీ అయ్యారు. వారంద‌రిని మూడు బ‌స్సుల్లో రిసార్టుకు త‌ర‌లించారు. వారిని బీజేపీ ప్ర‌భుత్వాలు లేని బిహార్ లేదా ఛ‌త్తీస్‌గ‌ఢ్ లేదా ప‌శ్చిమ బెంగాల్‌కు త‌ర‌లించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

ఎమ్మెల్యేలంతా నేరుగా లగేజీలతో పాటు సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీకి రావడం విశేషం. ఆగ‌స్టు 27 శ‌నివారం మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేల‌తో ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ స‌మావేశాలు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. ఆ వెంటనే వారందరినీ మూడు బస్సుల్లో గుర్తు తెలియని చోటుకి తరలించారు. వారిని పశ్చిమబెంగాల్‌కో, ఛత్తీస్‌గఢ్‌కో తీసుకెళ్లార‌ని వార్తలొచ్చాయి.

అయితే ఎమ్మెల్యేలంతా జార్ఖండ్‌లోని కుంతీ జిల్లాలోని మూమెంట్స్‌ రిసార్ట్‌కు పిక్నిక్‌కు వెళ్తున్నారంటూ మంత్రులు ఆలంఘీర్‌ ఆలం, బన్నా గుప్తా చెప్పారు. వారంతా అక్క‌డ బోటు షికారు చేశారు. ఆ ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. సాయంత్రానికల్లా వారంతా రాంచీ తిరిగొచ్చినట్టు సమాచారం. సోరెన్‌ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలన్న ఈసీ సిఫార్సుపై గవర్నర్‌ రమేశ్‌ బైస్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టే అవ‌కాశం ఉండ‌టం, కొంత‌మంది ఎమ్మెల్యేల‌ను చీల్చే ప్రమాదం ఉన్న నేప‌థ్యంలో జార్ఖండ్ ప్ర‌భుత్వం కూడా రిసార్టు రాజ‌కీయాల‌కు తెర‌లేపింద‌ని చెబుతున్నారు.