Begin typing your search above and press return to search.

రాజస్థాన్ లో క్యాంప్ రాజకీయాలు షురూ.. కారణమిదే!

By:  Tupaki Desk   |   3 Jun 2022 4:29 AM GMT
రాజస్థాన్ లో క్యాంప్ రాజకీయాలు షురూ.. కారణమిదే!
X
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో ప్రస్తుతం క్యాంప్ రాజకీయాలు షురూ అయ్యాయి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో కూడా నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. దీంతో ప్రత్యర్థి పార్టీ బీజేపీ తన ఎమ్మెల్యేలను తన్నుకుపోకుండా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ రాజకీయాలకు తెరతీసింది.

ఇందులో భాగంగా దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో పాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలను ఉదయ్ పూర్ లోని హోటల్‌కు తరలిస్తోంది. అందరినీ ఒకేచోట ఉంచేలా ఎమ్మెల్యేలను జైపూర్‌లోని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ నివాసం నుంచి ఉదయ్‌పూర్‌కు లగ్జరీ బస్సులో తరలించారు. మధ్యలో ఏమీ కాకుండా ఉండేందుకు బస్సుకు ఎస్కార్ట్‌గా పోలీసు బృందాలను కూడా పంపారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజస్థాన్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నాలుగు స్థానాలను దక్కించుకునేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగా తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకొనేందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా జైపూర్‌లోని ఓ హోటల్‌లో ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ వర్క్‌షాప్‌ నిర్వహించింది. ఇందులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఏర్పాటు చేసిన లంచ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యేలంతా ప్రత్యేక బస్సులో ఉదయ్‌పూర్‌కు బయల్దేరారు. నాలుగు రాజ్యసభ స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ ముగ్గురు అభ్యర్థుల్ని రంగంలోకి దించగా.. బీజేపీ ఒకరిని పోటీలోకి దించింది. ఒక్కో ఎంపీ గెలవడానికి 44 మంది ఎమ్మెల్యేలు అవసరం.

అయితే, చివరి నిమిషంలో మీడియా దిగ్గజం, జీ మీడియా సంస్థల అధినేత సుభాష్‌ చంద్ర స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడంతో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. సుభాష్ చంద్రకు బీజేపీ మద్దతు ప్రకటిస్తోంది. దీంతో బీజేపీ తరహా రాజకీయాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది.

మొత్తంగా 200 సభ్యులు కలిగిన రాజస్థాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 108 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి 71 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఇండిపెండెంట్లు 13, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి ముగ్గురు, సీపీఎంకు ఇద్దరు, భారతీయ ట్రైబల్‌ పార్టీకి ఇద్దరు, ఆర్‌ఎల్‌డీకి ఒకరు చొప్పున ఎమ్మెల్యే ఉన్నారు. సంఖ్యా బలంపరంగా కాంగ్రెస్‌కు మూడు రాజ్యసభ సీట్లు దక్కే అవకాశాలున్నాయి. బీజేపీకి ఒక స్థానం ఖాయం.

కాంగ్రెస్‌ పార్టీ ఈ మూడు స్థానాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌, పార్టీ అధికార ప్రతినిధి సూర్జేవాలా, యూపీకి చెందిన నేత ప్రమోద్‌ తివారీ పేర్లను ప్రకటించడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికేతరులను తమ రాష్ట్రం నుంచి అభ్యర్థులుగా ప్రకటించడంపై కొందరు అసంతృప్తి తెలుపుతున్నారు. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తోన్న బీజేపీ.. ఆఖరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థిగా సుభాష్‌ చంద్రను బరిలోకి దించింది. దీంతో అక్కడి రాజకీయాల్లో వేడి రాజుకుంది. కాగా ఈ నెల 10న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.