Begin typing your search above and press return to search.

వైఎస్ ను జగన్ ఆదర్శంగా తీసుకోగలడా ?

By:  Tupaki Desk   |   3 Sep 2021 9:30 AM GMT
వైఎస్ ను జగన్ ఆదర్శంగా తీసుకోగలడా ?
X
ఇప్పుడు దేశవ్యాప్తంగా జనాలను మంటెకిచ్చేస్తున్న సమస్య ఏమిటంటే పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలే అనడంలో సందేహం లేదు. మనదేశంలో వీటి ధరలు పెరగటమే కానీ తగ్గటమన్నది దాదాపు ఉండదు. ధరలు పెరిగేదేమో రూపాయల్లో అయితే తగ్గేది మాత్రం పైసల్లో. పై మూడింటి ధరల నియంత్రణ నూరుశాతం కేంద్రప్రభుత్వం చేతిలోనే ఉందన్న విషయం ఏ చిన్న పిల్లాడిని అడిగినా ఇట్టే చెప్పేస్తాడు. అయితే ఇవే ధరల్లో కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది.

కేంద్రం ధరలు పెంచుతున్నా రాష్ట్రాలు పెద్ద మనసు చేసుకుంటే కాస్తయినా జనాలకు ఉపశమనం లభిస్తుందనటంలో సందేహం లేదు. అయితే ఇపుడీ ధరలన్నది రాజకీయంగా పెద్ద వివాదమై కూర్చుంది. మూడు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ధరలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసిన విషయం తెలిసిందే. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పై మాట్లాడే ధైర్యం లేకే చంద్రబాబునాయుడు అండ్ కో జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడింది.

ధరల పెరుగుదల విషయంలో జగన్ పై ఇన్ని ఆరోపణలు చేసిన చంద్రబాబు తాను అధికారంలో ఉండగా ఏమి చేశారో ఓసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడంటే కరోనా వైరస్ సమస్య వచ్చేసింది కాబట్టి ఫ్యూయల్, గ్యాస్ ధరలు పెంచేసి ప్రభుత్వాలు డబ్బు చేసుకుంటున్నాయి. మరి ఏ సమస్యా లేనపుడే చంద్రబాబు వీటి ధరలను రాష్ట్రంలో తగ్గించకపోగా అమరావతి సెస్సు పేరుతో అదనపు బాదుడు బాదిన విషయం అందరికీ గుర్తుంది.

సరే ఇప్పటి రాజకీయ నేతలంతా గురివింద గింజలే కదా. అధికారంలో ఉండగా ఒకలాగ, ప్రతిపక్షంలోకి రాగానే మరోలా అపరిచితుడు టైపులో వ్యవహరిస్తుంటారు. అయితే ఇక్కడో చిన్న విషయం గుర్తు చేసుకోవాలి. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఇలాగే గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయని గోల జరిగింది. అప్పుడు రాష్ట్రం విధించే పన్నుల్లో 25 రూపాయలను వైఎస్ తగ్గించారు. దాంతో మధ్య తరగతి జనాలకు కాస్త ఉపశమనం లభించినట్లయ్యింది.

సరే ఇక ప్రస్తుతానికి వస్తే మోడీకి సామాన్యుల గోడు ఎలాగూ వినబడదు. ప్రధానమంత్రికంతా అంబానీలు, అదానీలు, ప్రైవేటుపరం చేయటం, ఆస్తులమ్మేయటాలపైనే దృష్టంతా. అయితే జగన్ అయినా కాస్త జనాల గురించి ఆలోచించాలి. ధరల్లో రాష్ట్రం విధించే పన్నులను కాస్త తగ్గించటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోతుందనటంలో సందేహం లేదు. కానీ కోట్లాది పేద, మధ్య తరగతి జనాలు హ్యాపీగా ఫీలవుతారని జగన్ గ్రహించాలి.

సంక్షేమ కార్యక్రమాల అమలులో తన తండ్రి వైఎస్సార్ రెండడుగులు వేస్తే తాను నాలుగు అడుగులు ముందుకేస్తానని కదా జగన్ చెబుతుంటారు. మరి వీటి ధరల తగ్గింపులో తన మాటను ఎందుకు నిలుపుకోకూడదని జనాలు అడుగుతున్నారు. మరి తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఫ్యూయల్, గ్యాస్ ధరలను కాస్త తగ్గించే విషయాన్ని జగన్ ఆలోచించాలి.