Begin typing your search above and press return to search.

మోడీ దూకుడుకు కేసీఆర్ చెక్ పెట్ట‌గ‌ల‌రా?

By:  Tupaki Desk   |   19 Jan 2021 2:30 AM GMT
మోడీ దూకుడుకు కేసీఆర్ చెక్ పెట్ట‌గ‌ల‌రా?
X
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇప్ప‌టికి ఇప్పుడు క‌నిపిస్తున్న ఏకైక ల‌క్ష్యం.. కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు చెక్ పెట్ట‌డం! నిజానికి 2019 ఎన్నిక‌ల్లోనే ఈ ప్ర‌యోగానికి ఆయ‌న రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే తృతీయ ప్ర‌త్యామ్నాయం అంటూ.. దేశంలోని ప‌లు రాష్ట్రాల‌కు తిరిగి.. మోడీ వ్య‌తిరేక వ‌ర్గాన్ని క‌లిశారు. చ‌ర్చించారు. కూట‌మికి ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. అప్ప‌టికి స‌మ‌యం మించిపోవ‌డంతో కేసీఆర్ ప్ర‌య‌త్నాలు ముందుకు సాగ‌లేదు. ఇక‌, ఇప్పుడు ఈ ప్ర‌య‌త్నాన్ని ఎన్నిక‌ల‌కు మూడేళ్ల ముందు గానే ఆయ‌న ప్రారంభించేందుకు రెడీ అయ్యార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే త‌న సీఎం ప‌ద‌విని త‌న కుమారుడికి అప్ప‌గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇక‌, ఇప్పుడున్న ప‌రిస్థితిలో న‌రేంద్ర మోడీని ఢీ కొట్ట‌డం అంటే.. కేసీఆర్ కు సాధ్య‌మ‌య్యే ప‌నేనా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో బ‌ల‌మైన నాయ‌కుడిగా మోడీ ఎదిగిపోయారు. ముఖ్యంగా యూపీ, బిహార్ వంటి కేంద్రాన్ని నిర్దేశించే రాష్ట్రాల్లో మోడీకి తిరుగులేని ఆధిప‌త్యం ఏర్ప‌డింది. అక్క‌డి రాజ‌కీయ ప‌క్షాలు కూడా ఆయ‌న‌కు ఇష్టంగానో.. క‌ష్టంగానో.. మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి త‌ప్ప‌.. మ‌రొక నేత‌ల‌తో దేశాధినేత‌ను చూడలేక‌పోతున్నాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్ అంటే.. అంతో ఇంతో అభిమానం చూపించిన బీఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీల్లోనూ ఇప్పుడు.. ఆ త‌ర‌హా ప‌రిస్థితి లేకుండా పోయింది. పోనీ.. వీరు ఇప్పుడు ఎకాయెకి.. కేసీఆర్‌కు మ‌ద్ద‌తు తెలుపుతారా? అంటే.. క‌ష్ట‌మ‌నే వ్యాఖ్య‌లే వినిపిస్తున్నాయి.

ఉత్త‌రాదిన పుంజుకున్న నాయ‌కుడు మాత్ర‌మే కేంద్రంలో ప‌గ్గాలు చేప‌ట్ట‌డం లేదా.. కేంద్రంలోని ప్ర‌భుత్వానికి శాసించే స్తాయికి ఎదుగుతార‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను ఆస‌రా చేసుకుని కొంద‌రు ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నా.. ఈ జాబితాలో కేసీఆర్ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. కొన్నాళ్లు కేసీఆర్ ఈ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించారు. కానీ, త‌ర్వాత యూట‌ర్న్ తీసుకున్నారు. ఈ ప‌రిణామం.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఆయ‌న‌కు ప‌రీక్ష‌గా మారనుంది. ఇక‌, ద‌క్షిణాదిలోని రాష్ట్రాల‌ను చూస్తే.. క‌ర్ణాట‌క మిన‌హా.. కేర‌ళ‌, ఏపీ, త‌మిళ‌నాడులో ఒక్క కేర‌ళ‌లో మాత్ర‌మే మోడీని వ్య‌తిరేకించే పార్టీలు ఉన్నాయి... త‌ప్ప‌.. త‌మిళ‌నాడు, ఏపీలో లేవు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కేసీఆర్ వ్యూహం అంత తేలిక‌గా ఫ‌లించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. మ‌రి ఏం చేస్తారో.. చూడాలి.