Begin typing your search above and press return to search.

సర్వం సిద్ధం...రేపే నిర్భయ దోషులకు ఉరి

By:  Tupaki Desk   |   19 March 2020 1:13 PM GMT
సర్వం సిద్ధం...రేపే నిర్భయ దోషులకు ఉరి
X
నిర్భయ ఘటన జరిగి ఇప్పటికే ఏడేళ్లు పూర్తి అయిపోయింది. అయితేనేం... నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరగనుంది. నిర్భయపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె మరణానికి కారణమైన దోషులకు రేపు (శుక్రవారం) ఉరి శిక్ష అమలు కానుంది. దేశ రాజధాని ఢిల్లీలో నడి వీధుల్లో బస్సులో తిప్పుతూ నిర్భయపై ఆరుగురు నిందితులు క్రూరాతిక్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నిర్భయను ఆమె స్నేహితుడితో సహా కదిలే బస్సులో నుంచి కిందకు తోసేసి పరారయ్యారు. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనపై దేశ యువత ఆగ్రహావేశాలతో కదం తొక్కింది. రాష్ట్రపతి - ప్రధాని తదితర ప్రముఖులు ఉండే రైసినా హిల్స్ లో బారికేడ్లను బద్దలు కొట్టుకుంటూ యువత నిరసనలు తెలిపింది. ఫలితంగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేస్తే... నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది.

ఇదంతా జరిగి నిజంగా ఇప్పటికే ఏడేళ్లు పూర్తి అయిపోయింది. అయితే ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత అయినా నిందితులకు కఠిన శిక్ష అమలు కాబోతోంది. నిర్భయకు న్యాయం జరగబోతోంది. ఈ మేరకు శుక్రవారం నిర్భయ దోషులు నలుగురికి ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు తీహార్ జైలు అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబందించి ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. నిర్భయ హంతకులకు ఎప్పుడో ఉరి శిక్షను ఖరారు చేస్తూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఎప్పటికప్పుడు ఈ శిక్షను అమలు చేసేందుకు అడ్డంకులు ఎదరయ్యాయి. ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించేసిన మన వ్యవస్థ నిర్భయ దోషులను ఉరి తీసేందుకు సర్వం సిద్ధం చేయగా... దోషులు మాత్రం ఉరి శిక్షను తప్పించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నారు.

కేసు ఒకటే గనుక... అదులో శిక్ష పడిన నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలని చట్టం చెబుతున్న నేపథ్యంలో నలుగురి ఉరికి తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తుంటే.. ఉరి కంభాన్ని తప్పించుకునేందుకు నలుగురు నిందితులు ఒక్కొక్కరుగా క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయడం, సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఒకరి పిటిషన్ విఫలం అయిన తర్వాత మరొకరు ఇదే పంథాను ఎంచుకున్న నేపథ్యంలో ఉరి శిక్ష ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది. తాజాగా శుక్రవారం నాటి ఉరిని కూడా తప్పించుకునేందుకు నిందితులు విఫల యత్నం చేశారనే చెప్పాలి. అయితే ఈ యత్నాలను తుత్తునీయలు చేస్తూ కోర్టులు ఉరి శిక్షకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం నిర్భయ నిందితులకు ఉరి శిక్ష తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా శుక్రవారం నాటి ఉరితో నిర్భయకు న్యాయం జరిగందనే చెప్పాలి.