Begin typing your search above and press return to search.

గుండె దడపై ఓ కన్నేసి ఉంచండి.. నిర్లక్ష్యం వద్దు..!

By:  Tupaki Desk   |   8 Nov 2022 11:30 PM GMT
గుండె దడపై ఓ కన్నేసి ఉంచండి.. నిర్లక్ష్యం వద్దు..!
X
సాధారణంగా మనిషి గుండె నిమిషానికి 60 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం హార్ట్ బీట్ 100 సార్లు ఉంటుంది. ఈ హార్ట్ బీట్ అనేది విశ్రాంతి తీసుకునేటప్పుడు ఒకలా.. పని చేసేటప్పుడు మరోలా ఉంటుంది. ఈ హార్ట్ బీట్ సాధారణం కంటే ఎక్కువ ఉన్నా.. లేదా తక్కువగా ఉన్న పెను ప్రమాదం తప్పదని సంకేతం ఇస్తున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొంతమంది కడుపులో అంటే గుండె ప్రాంతంలో చాలా అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం న్యుమోనియా లేదా పల్మనరీ ఎంబోలిజం వంటి నాన్ కార్డియక్ కారణాలుగా చెబుతుంటారు. ఆందోళన.. డిప్రెషన్ వంటి మానసిక కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశముంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే గుండె దడ లేదా పల్పిటేషన్ కు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

గుండె దడ అనేది సాధారణ అనుభూతికి విభిన్నంగా ఉంటుంది. ఆందోళనతో ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. దీనిని పెరిగిన హృదయ స్పందన రేటుగా కూడా పిలుస్తారు. గుండె దడ లక్షణాలు సాధారణంగా ఛాతీ మధ్యలో తెలుస్తుంది. చేతులు.. మెడ.. దవడ వరకు నొప్పి ప్రవహిస్తుంది. సాధారణంగా విశ్రాంతి తీసుకోవడం లేదా సార్బిటాల్ మాత్రలు వాడటం వల్ల ఇది కొంత తగ్గుముఖం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

అలాగే మరికొందరిలో హృదయ స్పందన రేటు తగ్గుతుంది. దీనిని కూడా గుండె దడ అని పిలుస్తారు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి వ్యాయామం.. కొత్త పనులు చేస్తున్నపుడు.. అధిక కాఫీ వినియోగించినపుడు.. శరీరంలో ఇనుము లోపం.. కొన్ని మందులు.. సిగరెట్ తాగడం.. థైరాయిడ్ మందులు వాడటం వంటి తర్వాత అధిక హృదయ స్పందన లేదా దడను అనుభవించే అవకాశం ఉందని కార్డియాలజిస్టు నిపుణులు చెబుతున్నారు.

గుండె దడ సాధారణమే అయినప్పటికీ భయము.. చెమటలు.. వణుకుతో కూడిన దడను వ్యక్తులు విస్మరించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య 20 నుంచి 30 ఏళ్ల లోపు వారిలో ఎక్కువగా కనిపిస్తాయని అంటున్నారు. ఇది గుండెపోటు లేదా ఇతర గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఉన్నందుకు దీనిని ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయద్దని సూచిస్తున్నారు.

ఈ రకమైన గుండె దడను చాలా మంది శ్వాస సమస్య లేదంటే ఎసీడీటీగా విస్మరిస్తారు. అయితే గుండెపోటు కూడా ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో ప్రజలు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని.. విస్మరిస్తే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పొత్తి కడుపు పై భాగంలో ఏదైనా మార్పులు అనిపించినట్లయితే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

గుండెపోటు అంటే హృదయానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో లూబ్రికేషన్ పేరుకుపోయి వాటి మార్గం నిరోధించబడుతుంది. తద్వారా రక్తం గుండెకు సరిగ్గా చేరదు. గుండెలో రక్తహీనతను కలిగి నొప్పికి దారితీస్తుంది. దీనిని వైద్య పరిభాషలో ఆంజినా పెక్టోరిస్ అంటారు. కొన్నిసార్లు ఆక్సిజన్ అడ్డంకి వల్ల గుండెపోటు వస్తుంది.

గుండె దడను నివారించుకునేందుకు సరైన ఆహారపు అలవాట్లను పాటించాలి. కెఫిన్ కలిగిన ఆహారం లేదా శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు వ్యాయామం.. ప్రాణాయామం యోగా వంటి అలవాట్లను చేసుకోవడం ద్వారా గుండె దడకు చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గుండె దడ సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుడిని వెంటనే సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.