Begin typing your search above and press return to search.

మోదీజీ!... చెప్పిందేమిటీ? చేసిందేమిటి?

By:  Tupaki Desk   |   6 Feb 2019 1:30 AM GMT
మోదీజీ!... చెప్పిందేమిటీ? చేసిందేమిటి?
X
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు.... గుజ‌రాత్ సీఎంగా ఉన్న న‌రేంద్ర మోదీ ఒక్క‌సారిగా జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్ప‌టికే ప‌దేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న బీజేపీని తిరిగి మ‌ళ్లీ అధికారంలోకి తేవాలంటే... మోదీ లాంటి నేత దిగాల్సిందేన‌న్న వాద‌న‌ను వినిపించిన త‌న సైద్ధాంతిక క‌ర్త‌లు చెప్పిన మాట‌ల‌ను బీజేపీ తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేసింది. అంతే.. నేరుగా బీజేపీ పీఎం అభ్య‌ర్థిగా రంగంలోకి దిగిపోయిన మోదీ.... తాను అధికారంలోకి వ‌స్తే దేశం రూపు రేఖ‌లు మార్చేస్తాన‌ని ఘ‌నంగా ప్ర‌క‌టించారు. విదేశాల్లో పోగుబ‌డి ఉన్న న‌ల్ల ధ‌నాన్ని దేశానికి రప్పించ‌డంతో పాటు న‌ల్ల కుబేరుల ప‌నిబ‌డ‌తాన‌ని - అవినీతిని అంతం చేసేస్తాన‌ని బీరాలు ప‌లికారు. అప్ప‌టికే ప‌దేళ్ల పాల‌న‌పై జ‌నానికి మొహం మొత్త‌డం - మోదీ భారీ వాగ్ధానాలు - అప్ప‌టిదాకా సీఎం హోదాలో గుజ‌రాత్ ను అభివృద్ధి ప‌థంలో ప‌రుగులు పెట్టించిన వైనం - సోష‌ల్ మీడియాను త‌న‌దైన శైలిలో వినియోగించుకోవ‌డంతో మోదీ ఘ‌న విజ‌యం సాధించారు. అయితే అంద‌రు నేత‌ల్లానే మోదీ కూడా గెలిచేదాకా ఒక మాట‌, గెలిచాక మ‌రో మాట‌లా త‌యార‌య్యారు.

అవినీతి అంతం మాట దేవుడెరుగు? క‌నీసం న‌ల్ల‌ధ‌నం విస్తృతిని అయినా త‌గ్గిస్తార‌ని అంతా ఆశించారు. అయితే మోదీ ఆ మేర‌కు కూడా ప‌నిచేయ‌లేక‌పోగా.. న‌ల్ల‌ధ‌నాన్ని మ‌రింత విస్తృత‌మ‌య్యేలా చేశారు. ఆ న‌ల్ల‌ధ‌నం ఇప్పుడు నేరుగా రాజ‌కీయ పార్టీల చేతుల్లోకి వ‌చ్చేలా చేశారు. మొత్తంగా ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో చెప్పిన దానికి భిన్నంగా మోదీ వ్య‌వ‌హ‌రించార‌న్న వాద‌న ఇప్పుడు బ‌లంగా వినిపిస్తోంది. మ‌రో మూడు నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మోదీ నాడు చెప్పిందేమిటి?... నేడు చేస్తున్న‌దేమిటి? అన్న కోణంలో పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఆ విశ్లేష‌ణ‌ల్లో అస‌లైన న‌ల్ల‌ధ‌నం విశ్లేష‌ణ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మోదీ విధానాల కార‌ణంగా రాజ‌కీయ పార్టీల‌కు వ‌చ్చి ప‌డుతున్న నిధుల్లో వ‌చ్చిన స్ప‌ష్ట‌మైన తేడాను ప‌ట్టేస్తూ *అసోసియేష‌న్ ఫ‌ర్‌ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్* అనే సంస్థ విడుద‌ల చేసిన నివేదిక ఇప్పుడు పెను సంచ‌ల‌నంగానే మారిపోయింది.

మోదీ రాక ముందు రాజ‌కీయ పార్టీల‌కు రూ.20 వేల‌కు మించిన విరాళాల‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు ఇవ్వాల్సిందే. అంత‌కు తక్కువ విరాళాలు ఇస్తే... పేర్లు వెల్ల‌డించాల్సిన ప‌నిలేదు. ఈ నిబంధ‌న‌తో రాజ‌కీయ పార్టీల‌కు పెద్ద ఎత్తున నిధుల‌ను విరాళాలుగా ఇచ్చిన సంస్థ‌లు, వ్య‌క్తులు కూడా ఆ మొత్తాన్ని రూ.20 వేలుగా విడ‌గొట్టి మ‌రీ ఇచ్చేవారు. అయితే మోదీ ఆ రూ.20 వేల ప‌రిధిని మ‌రింత విస్తృతం చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే దీనిపై ప్ర‌జ‌ల్లో త్వ‌ర‌గా వ్య‌తిరేక‌త రాకుండా చూసుకునేందుకు బాండుల బాట ప‌ట్టారు. ఈ బాండుల‌ను రూ.1,000 మొద‌లు కోటి రూపాయ‌ల వ‌ర‌కు పార్టీల‌కు ఇవ్వ‌వ‌చ్చ‌ని నిర్దేశించారు. బాండుల రూపంలో ఇస్తే... పార్టీల‌కు అందే ప్ర‌తి విరాళం కూడా ప్ర‌జ‌ల‌కు తెలిసిపోతుంద‌ని, పూర్తి పార‌ద‌ర్శ‌క‌త వ‌చ్చేసిన‌ట్టేన‌ని మోదీ క‌ల‌రింగ్ ఇచ్చారు. అయితే ఈ బాండుల వివ‌రాలు ఎవ‌రు వెల్ల‌డిస్తారు. రాజ‌కీయ పార్టీకు విరాళాలు ఇచ్చే వ్య‌క్తులు ఎలాగూ త‌మ వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్ట‌రు.

డ‌బ్బు తీసుకుని బాండులు జారీ చేసే బ్యాంకులు కూడా దీనిపై అంత‌గా దృష్టి సారించ‌వు. మ‌రి పార్టీలు త‌మకు వ‌చ్చిన విరాళాల‌ను పేర్ల‌తో స‌హా వెల్ల‌డిస్తాయా? అంటే... ఇచ్చిన వ్య‌క్తితో పాటు బాండును జారీ చేసిన బ్యాంకులు కూడా ఈ వివ‌రాల‌ను ఇవ్వ‌నప్పుడు రాజ‌కీయ పార్టీలు మాత్రం ఎందుకు ఇస్తాయి? ఇదే విష‌యాన్ని కాస్తంత లోతుగా ఆలోచించిన మోదీ స‌ర్కారు... పార‌ద‌ర్శ‌క‌త అంటూనే విరాళాల‌పై గోప్య‌త వ‌చ్చేలా చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించేసింద‌న్న మాట‌. ఈ లెక్క‌న బీజేపీ అధికారంలోకి రాక‌ముందు విధానమే మేల‌న్న భావ‌న కూడా ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతోంది. మోదీ స‌ర్కారు ఈ త‌ర‌హా విధానాన్ని ఎందుకు అనుస‌రించింద‌న్న విష‌యానికి వ‌స్తే... అధికారంలో ఉన్న త‌న‌కు మాత్ర‌మే అధిక నిధులు అందేలా చేసుకునేందుకే అన్న వాద‌న వినిపిస్తోంది. ఆయా పార్టీలకు అందిన విరాళాలు చూస్తేనే ఈ విష‌యం ఇట్టే తేలిపోతుంది. 2017–18 సంవత్సరానికి ఆశ్చర్యంగా బీజేపీకి రూ.20 వేలకు మించిన విరాళాలు 93 శాతం, అంటే రూ.437.04 కోట్లు అందాయి. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి 5. 67 శాతం చొప్పున కేవలం రూ.26.66 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఎన్నికల బాండుల రూపంలో వచ్చినవే ఎక్కువ. అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలను పరిశీలిస్తే రూ.20 వేలకు మించని విరాళాలు 51 శాతం వచ్చాయి. ఆ తర్వాత 31 శాతంతో ఎన్నికల బాండులు ఉన్నాయి.

2018–19 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల కాలానికే రూ.834.7 కోట్ల విలువైన ఎన్నికల బాండులు విక్రయించినట్లు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. 2017–18 సంవత్సరం కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. 2019–2020 సంవత్సరానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క సీపీఎం మినహా ఆరు జాతీయ పార్టీలకు కలిపి 2017–18లో 53 శాతం అంటే, రూ.689.44 కోట్లు గుర్తు తెలియని దాతల నుంచి వచ్చాయి. 36 శాతం అంటే రూ.467.13 కోట్లు వివ‌రాలు వెల్ల‌డించిన‌ దాతల నుంచి వచ్చాయి. ఇక్కడ గుర్తుతెలియని దాతలంటే బ్యాంకులకు, రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వారు కాదు. కేవలం ప్రజలు లేదా ఓటర్లకు గుర్తుతెలియని వారే. మొత్తంగా ఎన్నిక‌ల్లో విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేసుకునేందుకు, ఓట‌ర్ల‌ను మ‌భ్య‌పెట్టి, మ‌చ్చిక చేసుకునేందుకు అవ‌స‌రమైన నిధుల‌ను స‌మ‌కూర్చుకోవ‌డంలో మోదీ మార్కు విధానాలు బీజేపీకి బాగానే క‌లిసి వ‌చ్చాయ‌న్న మాట‌.