Begin typing your search above and press return to search.

పీకే న‌యా మంత్రం!... బిగ్ ఛేంజ్ గ్యారెంటీ!

By:  Tupaki Desk   |   17 Feb 2019 5:37 PM IST
పీకే న‌యా మంత్రం!... బిగ్ ఛేంజ్ గ్యారెంటీ!
X
ప‌వ‌న్ కల్యాణ్... టాలీవుడ్ లో ఓ రేంజికి ఎదిగినా కూడా త‌న‌లోనిఓ గొప్ప ల‌క్ష‌ణాన్ని అయితే ఆయ‌న ఏనాడూ వ‌ద‌ల‌లేద‌నే చెప్పాలి. ఇప్పుడు జ‌న‌సేన పేరిట పూర్తిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసినా... ఆ ల‌క్ష‌ణాన్ని త‌ను వ‌దులుకునేందుకు సిద్ధంగా లేన‌నే చెబుతూ ఆక‌ట్టుకుంటున్నారు. అయితే పీకే మాట తీరు ఆయ‌న‌లోని ఈ ల‌క్ష‌ణాన్ని ఎప్పుడూ అనుమాన‌ప‌డేలా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.అయితేనేం... ఇప్పుడు త‌న పార్టీలో ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన ఓ కొత్త విధానం నిజంగానే ఆసక్తిక‌రంగా మారిందని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆస‌క్తిక‌ర‌మే కాదండోయ్‌... దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న కులాల‌ కుంప‌ట్ల‌కు పీకే త‌ర‌హా వ్యూహంతో ఇట్టే ఘోరీ క‌ట్టేయొచ్చ‌ని చెప్పొచ్చు. స‌రే ఈ ఉపోద్ఘాత‌మంతా విడిచేసి... అస‌లు విష‌యంలోకి వ‌చ్చేద్దాం. జ‌న‌సేన‌లో అసెంబ్లీ లేదంటే పార్ల‌మెంటు టికెట్ కావాలంటే ఖ‌చ్చితంగా ఆ పార్టీ అందించే ఓ ద‌ర‌ఖాస్తును పూర్తిగా నింపాల్సిందే. ఈ ద‌ర‌ఖాస్తును నింపే క్ర‌మంలో జ‌న‌సేన ఆఫీసులో ఆ పార్టీ టికెట్ల ఆశావ‌హులంతా... ఏదో ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన విద్యార్థుల్లా పెన్నూ, పేప‌ర్ల‌తో కుస్తీ ప‌డుతున్న ఫొటోల‌ను చూసి చాలా మంది తొలుత నొస‌లు చిట్లించారు. ఆ త‌ర్వాత అస‌లు విష‌యం తెలుసుకుని శాంతించారు.

అయినా ప్ర‌జ‌ల‌ను పాలించే చ‌ట్ట‌స‌భ స‌భ్యుల‌కు ఈ ప‌రీక్ష‌లేంట‌ని క్వశ్చ‌న్ చేస్తారా? స‌ర్కారులో అతి చిన్న స్థాయి నుంచి అత్యున్న‌త స్థాయి ఉద్యోగం కోసం ప‌రీక్ష‌లు రాసేందుకు ఇష్ట‌ప‌డే మ‌నం మ‌న‌ల‌ను పాలించే నేత‌ల‌కు ప‌రీక్ష‌లు పెట్టేందుకు ఎందుకు సిద్ధ‌ప‌డం. నేత‌ల‌కు ప‌రీక్ష‌లంటేనే ఎందుకు కోపం వ‌స్తుంది? స‌రే... జ‌న‌సేన‌లో ప‌రీక్ష‌లేంట‌ని ప్ర‌శ్నిస్తున్న కొంద‌రికి ఆ పార్టీ కాస్తంత క్లారిటీ ఇస్తూ... తాము మాత్ర‌మే అమ‌లు చేస్తున్న ఈ కొత్త నిబంధ‌న‌. దాని ద్వారా జ‌రిగే ప్ర‌యోజ‌నం త‌దిత‌రాల‌ను వివ‌రించేసింది. పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారు జ‌న‌సేన‌లో విధిగా ఆ పార్టీ అందించే ద‌ర‌ఖాస్తుల‌ను పూర్తి చేయాల్సిందే. పార్టీ నేత‌ల‌కు ఆద‌ర్శంగా ఉండాల‌న్న ల‌క్ష్యంతో ప‌వ‌న్ కూడా ఈ ద‌ర‌ఖాస్తును నింపి పార్టీ నిర్ణాయ‌క విభాగానికి అంద‌జేశారు. అయినా ఈ ద‌ర‌ఖాస్తులో ఏమున్నాయ‌న్న విష‌యానికి వ‌స్తే.. పార్టీ టికెట్ ఆశించే వ్య‌క్తికి సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారం. ఇక్క‌డ స‌మ‌గ్ర స‌మాచారం అంటే కులం, మ‌తం, ఆస్తులు కాదు. ఆ వ్య‌క్తిగ‌త వివ‌రాలు మాత్ర‌మే. కులం గోల లేదు. ఆర్థిక ప‌రిస్థితిని అస‌లే చెప్పాల్సిన ప‌ని లేదు.

కులం కార్డు ఆధారంగానే ఇప్పుడు అన్ని రాజ‌కీయ పార్టీలు టికెట్లు మంజూరు చేస్తున్న నేప‌థ్యంలో పీకే ఈ కొత్త నిబంధ‌నతో నిజంగానే ఆస‌క్తి రేకెత్తించేశారు. కులం లేని వ్య‌క్తిగ‌త వివ‌రాల‌తోనే టికెట్ల కేటాయింపు వంటి అంశం నిజంగా గొప్ప‌దిగానే చెప్పాలి. ఇదే త‌ర‌హా వ్యూహాన్ని తాను రాజ‌కీయాల్లో కొన‌సాగినంత కాలం జ‌న‌సేన అమ‌లు చేస్తే... కులాల‌కు నిజంగానే ఘోరీ క‌ట్టేయొచ్చు. కులాల వారీగా విడిపోయిన స‌మాజంలో కొంతైనా మార్పు తీసుకుని రావ‌చ్చు. మార్పు అన్న‌ది ఒక్క అడుగుతోనే మొద‌ల‌వుతుంద‌న్న‌ట్లుగా జ‌న‌సేన టికెట్ ఆస్పిరెంట్ల ద్వారా ప‌వ‌న్ ప్రారంభించిన కొత్త విధానం నిజంగానే ఆస‌క్తి క‌లిగిస్తోంది. అంద‌రినీ ఈ దారిన ప‌య‌నించేలా చేసిన రోజున నిజంగానే కులం గోడ‌ల‌ను బ‌ద్ద‌లు కొట్టేసిన‌ట్టేనన్న వాద‌న వినిపిస్తోంది. సో.. ప‌వ‌న్ వైఖరి రాజ‌కీయంగా ఎలా ఉన్నా ఇలాంటి మంచి సంప్ర‌దాయాన్ని ప్రారంభించిన నేప‌థ్యంలో ఆయ‌న‌ను అభినందించ‌క త‌ప్ప‌దు.