Begin typing your search above and press return to search.

పొత్తు లేకపోతే బతికి బట్టకట్టలేరా... ?

By:  Tupaki Desk   |   15 Dec 2021 11:30 PM GMT
పొత్తు లేకపోతే బతికి బట్టకట్టలేరా... ?
X
రాజకీయాల్లో పొత్తులు అంటే తొండాటే అనుకోవాలి. నిజానికి ఏ పార్టీకి ఆ పార్టీ అన్నట్లుగా సొంత సిద్ధాంతాలు ఉంటాయి. వాటిని జనాలకు చెప్పుకుని ఓట్లు రాబట్టుకోవాలి. అంతే కానీ సిద్ధాంత రాహిత్యంగా రాజకీయమే పరమావధిగా పార్టీలు కొన్ని జట్టు కట్టి ముందుకు రావడం అంటే జనాలను అయోమయానికి గురి చేయడమే. అయితే రాను రాను రాజకీయాల్లో ఎత్తులు జిత్తులకు ధీటుగా పొత్తులు కూడా ఎక్కువ అయిపోతున్నాయి.

దాంతో పవర్ పాలిటిక్స్ కి పర్యాయపదంగా పొత్తులు మారుతున్నాయి. ఏపీలో చూసుకుంటే పొత్తుల కధ చాలా కాలంగా సాగుతోంది. నిజానికి టీడీపీ ఆవిర్భావంతోనే పొత్తులకు తెర లేచింది. నాడు ఎన్టీయార్ 1983 తొలి ఎన్నికలలోనే మేనకాగాంధీ నాయకత్వాన ఉన్న సంజయ్ విచార్ మంచ్ తో పొత్తు పెట్టుకున్నారు. ఆ తరువాత లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపేతో కూడా కలిసి వెళ్లారు. వామపక్షాలను కూడా చేరదీశారు. చంద్రబాబు కాస్తా అడుగు ముందుకేసి 2018 ఎన్నికల వేళ తెలంగాణాలో కాంగ్రెస్ ని కూడా కలుపుకున్నారు.

ఇక మోడీ ఏపీకి వస్తే అరెస్ట్ చేయిస్తామన్న నోటితోనే ఆయనని పొగిడి 2014లో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. అలాగే చిరంజీవిని, ఆయన ప్రజారాజ్యాన్ని తెగనాడిన నోటితోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ ని పొగిడి జనసేన‌తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఇక 2024లో మళ్లీ పొత్తులకు రంగం సిద్ధమవుతోంది. చంద్రబాబు అయితే ఈసారి పొత్తులే శరణ్యమని గట్టి నిర్ణయానికి వచ్చేశారు. టొటల్ 175 సీట్లలో క‌నీసంగా యాభై సీట్ల దాకా పొత్తుల పేరిట వదులుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నారు.

ఇదే విషయాన్ని పార్టీ నేతలకు కూడా చెబుతున్నారు. త్యాగాలు చేయాల్సి ఉంటుందని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఆయన జనసేనతో బీజేపీతో పొత్తుకు సిద్ధమని అంటున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఏపీ అభివృద్ధి, భవిష్యత్తు దృష్ట్యా ఎవరితోనైనా పనిచేస్తామని పొత్తుల గురించి చెప్పకనే చెబుతున్నారు. ఇక బీజేపీకి కూడా వచ్చే ఎన్నికలు కీలకం. పైగా ఎంపీలు కావాలి. దాంతో పొత్తులకు సై అని అంటోంది.

ఇలా ఈ మూడు పార్టీలు జట్టు కట్టి జనం ముందుకు వస్తాయని క్లారిటీగా చెప్పేస్తున్నారు విశ్లేషకులు. అదే సమయంలో పొత్తు లేకపోతే ఈ పార్టీలు మనుగడ సాగించలేవా అన్న చర్చ కూడా వస్తోంది. అది సొంత పార్టీల నుంచే రావడం విశేషం. పొత్తులతో చిత్తు అయిన పార్టీ ఏదైనా ఉంది అంటే బీజేపీనే తెలుగు రాష్ట్రాల్లో మొదట చూపిస్తారు. ఇపుడు జనసేన కూడా ఆ కోవలోకే వెళ్తోంది అని కామెంట్స్ పడుతున్నాయి.

పవన్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. పెద్ద సామాజివ‌ర్గం ఉంది. ఇక‌ కష్టపడితే బాగానే ఓట్లూ సీట్లు వస్తాయి. కానీ ఎందుకో పవన్ మాత్రం పొత్తుల వైపే చూస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీ విషయం తీసుకున్నా పొత్తుల పార్టీ అన్న ముద్ర ఎందుకు మోయాలి అన్న ప్రశ్న తమ్ముళ్ల నుంచే వస్తోంది. వైసీపీ మీద వ్యతిరేకత ఇప్పటికే ఉంది. ఎన్నికల వేళకు అది మరింతగా పెరుగుతుంది. దాంతో క్యాడర్ బేస్డ్ పార్టీగా ఉన్న టీడీపీ వైపే జనం మొగ్గు చూపుతారు అని సొంత పార్టీలో అంటున్న వారూ ఉన్నారు.

పొత్తుల పేరిట పార్టీ చాలా సీట్లను ఇచ్చేయడం వల్ల టీడీపీ కోసం పనిచేసిన వారు అన్యాయం అయిపోవడమే కాకుండా కాలగమనంలో ఆయా సీట్లలో నాయకత్వ లోటు కూడా ఏర్పడుతుంది అన్న వారూ ఉన్నారు. మొత్తానికి గెలిచినా ఓడినా సింగిల్ గా రావడమే బెస్ట్ అని చెబుతున్న వారూ ఉన్నారు. ఈ విషయంలో వైసీపీదే కరెక్ట్ అని కూడా తమ్ముళ్ళు అంటున్నారుట. అయితే జగన్ని ఓడించడం అంటే చిన్న విషయం కాదని, అందుకే పొత్తులు అని టీడీపీతో పాటు మిగిలిన పార్టీలలో కూడా సమాధానం వస్తోంది. మొత్తానికి గుంపుగానే అంతా వస్తున్నారు. కలగూరగంపగా రాజకీయం చేయబోతున్నారు. ఇంతకీ పొత్తులు లేకపోతే ఈ పార్టీలు బతికి బట్టకట్టలేవా. అంటే సమాధానం వారే చెప్పాలేమో.