Begin typing your search above and press return to search.

టీడీపీ ఒంటరిగా పోటీ చేయగలదా ?

By:  Tupaki Desk   |   27 Oct 2021 11:30 AM GMT
టీడీపీ ఒంటరిగా పోటీ చేయగలదా ?
X
ఛాన్సే లేదని చెప్పాలి. ఎన్టీయార్ దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ పగ్గాలను చంద్రబాబునాయుడు లాక్కున్న దగ్గర నుండి ఒక్కటంటే ఒక్క ఎన్నికలో కూడా ఒంటరిగా పోటీచేసి గెలిచిందే లేదు. అలాగే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నపుడు కూడా ఓడిపోయిన ఘటనలున్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడు తాజాగా ఢిల్లీలో ప్రస్తావించారు. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ పొత్తుల్లోనే టీడీపీ గెలుస్తుందని అనుకునేందుకు లేదన్నారు.

ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నపుడు కూడా టీడీపీ ఓడిపోయిందనే విషయాన్ని చంద్రబాబే గుర్తుచేశారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్+వామపక్షాలతో పొత్తున్నప్పటికీ ఓడిపోయిన విషయాన్ని బహుశా చంద్రబాబు గుర్తుచేసినట్లున్నారు. అసలింతకీ చంద్రబాబు పొత్తుల విషయాన్ని, ఒంటరిగా పోటీచేసే విషయాన్ని ఎందుకు ప్రస్తావించినట్లు ? ఎందుకంటే తాను ఎంత ప్రయత్నించినా బీజేపీతో పొత్తు సాధ్యం కాదని చంద్రబాబుకు అర్ధమైపోయుండాలి.

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవతలవైపు నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా చంద్రబాబును దగ్గరకు రానీయడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టించే ఉద్దేశ్యంతో చంద్రబాబు ఢిల్లీలో రెండు రోజులు క్యాంపు వేశారు. రాష్ట్రపతిని కలవగలిగిన చంద్రబాబు మోడి, అమిత్ ను మాత్రం కలవలేకపోయారు.

నాలుగు రోజులుగా వీళ్ళిద్దరి అపాయిట్మెంట్ కోసం చంద్రబాబు ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో బీజేపీకి దగ్గరవ్వటం తనకు సాధ్యం కాదని చంద్రబాబుకు క్లారిటి వచ్చేసినట్లుంది. అందుకనే అసందర్భంగా పొత్తుల గురించి మాట్లాడారు. నిజానికి చంద్రబాబు పొత్తు పెట్టుకోని పార్టీ అంటు ఏమీ మిగల్లేదు. ప్రతి ఎన్నికకు ఒకపార్టీతో పొత్తు పెట్టేసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి జనసేనతో మళ్ళీ పొత్తుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, దాదాపు ఖరారైనట్లే అనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ఇలాంటి నేపధ్యంలోనే హఠాత్తుగా చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. తాజా వ్యాఖ్యలను చూస్తే వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో చంద్రబాబు పొత్తుకు ప్రయత్నిస్తున్నారా లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ చంద్రబాబు ప్రయత్నిస్తున్నా కలిసి రావడానికి ఏ పార్టీ కూడా సానుకూలంగా లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా పొత్తులేకుండా ఎన్నికలకు వెళితే ఫలితం ఎలాగుంటుందో చంద్రబాబుకే బాగా తెలుసు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.