Begin typing your search above and press return to search.

ఒకే వ్యక్తి రెండు డోసులు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవచ్చా...?

By:  Tupaki Desk   |   15 April 2021 8:30 AM GMT
ఒకే వ్యక్తి రెండు డోసులు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవచ్చా...?
X
కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. భారత్ లోనూ వ్యాక్సినేషన్ ఉత్సాహంగా సాగుతోంది. అయితే మొదటి డోసు ఒక వ్యాక్సిన్ తీసుకొని రెండో డోసు మరో టీకా తీసుకోవచ్చా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఆరోగ్యంలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? అనే కోణంలో బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధనలు చేస్తోంది.

రెండు డోసులు-వేర్వేరు వ్యాక్సిన్ల ప్రయోగాన్ని ఆ సంస్థ ఫిబ్రవరిలో మొదలుపెట్టింది. ఫైజర్, ఆక్సిఫర్డ్ డోసులను ఒక్కక్కటి ఇచ్చి పరిశోధనలు ప్రారంభించారు. వేర్వేరు డోసులు ఇచ్చిన వారిలో జరిగే మార్పులు, వ్యాధి నిరోధకత ప్రతిస్పందనలు, ఇతర ఆరోగ్య సమస్యలు, కొత్త సమస్యలు తలెత్తుతున్నాయా? అనే వివరాలను నమోదు చేస్తున్నారు.

ఫిబ్రవరి నుంచి జరుగుతున్న ఈ అధ్యయనాన్ని మరో 1,050 మందిలో చేయడానికి ఆక్స్ ఫర్డ్ సంస్థ సిద్ధమవుతోంది. వాలంటీర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మోడెర్నా, నోవావాక్స్ ను ఒకే వ్యక్తికి ఒక్కో డోసు ఇస్తే ఎలా పని చేస్తుంది అనే దిశగా మరికొంత మంది వాలంటీర్లను తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వేర్వేరు వ్యాక్సిన్ల డోసుల ప్రక్రియ ఫలితాలు త్వరలోనే వెల్లడవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు సఫలం అయితే మరింత మంచిదని అంటున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియకు మరింద బలం చేకూరుతుందని వెల్లడించారు. వేర్వేరు డోసులు ప్రభావం చూపకపోతే వైరస్ కట్టడిలో భాగంగా టీకాల పంపిణీకి మార్గం మరింత సుగుమం అవుతుందని, వ్యాక్సిన్ కొరతను భర్తీ చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.