Begin typing your search above and press return to search.

కేసీయార్ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం చెప్పగలరా ?

By:  Tupaki Desk   |   2 Feb 2022 5:30 PM GMT
కేసీయార్ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం చెప్పగలరా ?
X
కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022 కు సంబంధించి కేసీయార్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా ? బడ్జెట్ పై కేసీఆర్ మీడియా సమావేశంలో ఇటు నరేంద్ర మోడీతో పాటు అటు నిర్మల సీతారామన్ ను దుమ్ము దులిపేశారు. బడ్జెట్ తీరుతెన్నులపై తనదైన శైలితో విరుచుకుపడ్డారు. ఈ మధ్యనే మోడీ అంటేనే మండిపోతున్న కేసీయార్ బడ్జెట్ రూపంలో వచ్చిన అవకాశాన్ని నూరుశాతం ఉపయోగించుకున్నారు.

మిగిలిన అంశాలను పక్కన పెట్టేసినా కేసీయార్ సంధించిన రెండు ప్రశ్నలకు మోడీ లేదా నిర్మల సమాధానం చెప్పాల్సిందే. ఇంతకీ ఆ రెండు ప్రశ్నలు ఏమిటంటే మొదటిదేమో క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం పన్ను వసూలు చేయటం, రెండో ప్రశ్న ఏమిటంటే నదుల అనుసంధానం. క్రిప్టో కరెన్సీ అనేది దేశంలో చట్టబద్ధం కాదు. కాకపోతే దేశంలో క్రిప్టోకరెన్సీ వ్యాపారం కొన్ని వేల కోట్లుగా ఉంది. కేంద్రప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేకుండానే ప్రైవేటు ఏజెన్సీలు క్రిప్టో లావాదేవీలు నడిపేస్తున్నాయి.

ఇదే విషయమై ఈమధ్యే క్రిప్టోకరెన్సీని చట్టబద్దం చేయమని డిమాండ్లు మొదలయ్యాయి. అయితే అలాంటి ఉద్దేశం తమకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. మరిపుడేమో క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై కేంద్రం 30 శాతం పన్నును వసూలు చేయబోతున్నట్లు బడ్జెట్లో చెప్పింది. చట్టబద్దం కాని లావాదేవీలపై కేంద్రం పన్నును ఎలా వసూలు చేస్తుందన్నది కేసీయార్ ప్రశ్న. ఒకవేళ క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై పన్ను వసూలు చేస్తే అది చట్టబద్దమైనట్లే లెక్క. మరీ విషయంలో మోడీ, నిర్మల ఏమి సమాధానం చెబుతారు.

అలాగే నదుల అనుసంధానం సమస్య కూడా ఇంతే. నదుల అనుసంధానం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు బడ్జెట్లో మంత్రి చెప్పారు. నదుల అనుసంధానం అనేది అంతర్రాష్ట్ర సమస్యగా మారిపోయింది. ఇంతటి కీలకమైన సమస్యను టేకప్ చేసేటపుడు, బడ్జెట్లో పెట్టేటపుడు సంబంధిత రాష్ట్రప్రభుత్వాలతో కేంద్రం చర్చించిందా అని కేసీయార్ అడిగారు. ఏ రాష్ట్రంతో కూడా కేంద్రం చర్చించకుండానే, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండానే కేంద్రం ఎలా బడ్జెట్లో ఎలా పెట్టేసింది ? ఇపుడీ రెండు ప్రశ్నలకు మోడీ, నిర్మలలో ఎవరు సమాధానం చెబుతారో చూడాలి.