Begin typing your search above and press return to search.

ఈసీ పిలుపు.. పార్టీపైన అయినా ఉద్ధ‌వ్ ప‌ట్టు నిలుపుకోగ‌ల‌రా?

By:  Tupaki Desk   |   23 July 2022 9:30 AM GMT
ఈసీ పిలుపు.. పార్టీపైన అయినా ఉద్ధ‌వ్ ప‌ట్టు నిలుపుకోగ‌ల‌రా?
X
మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన చీలిక నేత ఏక‌నాథ్ షిండేను నిలువ‌రించ‌లేక ముఖ్య‌మంత్రిని ప‌ద‌విని వ‌దిలేసుకున్న ఉద్ధ‌వ్ ఠాక్రే ముంగిట మ‌రో క‌ఠిన స‌వాలు ఎదురుకానుంది. ఇప్ప‌టికే శివ‌సేన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 42 మంది ఏక‌నాథ్ షిండేతో చేరిపోయారు. అలాగే శివ‌సేన‌కు లోక్ స‌భ‌లో ఉన్న మొత్తం 18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది కూడా ఏక‌నాథ్ తోనే ఉన్నారు. ప‌లు కార్పొరేష‌న్ల మేయ‌ర్లు, కార్పొరేట‌ర్లు సైతం ఏక‌నాథ్ కే జైకొడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో పార్టీ త‌మ‌దేన‌ని నిరూపించుకోవ‌డానికి త‌గిన ప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీ).. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే , మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేల‌ను కోరింది. పార్టీలో త‌మ‌దే అన‌డానికి వీరిద్ద‌రూ తమ ఆధారాల‌ను ఆగస్టు 8న మధ్యాహ్నం 1 గంటలోగా రాత‌పూర్వ‌కంగా స‌మ‌ర్పించాల‌ని ఈసీ ఆదేశించింది. సమర్పించిన పత్రాలు,ప్రత్యుత్తరాలు, డాక్యుమెంట్లు త‌దిత‌రాల‌ను స‌మ‌ర్పించాకే తదుపరి దశ జరుగుతుందని కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది.

55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది, 18 మంది లోక్‌సభ ఎంపీల్లో 12 మంది తమకు మద్దతుగా ఉన్నారని పేర్కొంటూ షిండే వర్గం ఈసీకి ఇప్ప‌టికే లేఖ రాసింది. కాబ‌ట్టి త‌మ‌నే నిజ‌మైన శివ‌సేన పార్టీగా గుర్తించాల‌ని విన్న‌వించింది.

మరోవైపు, ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుతో అసెంబ్లీ స్పీకర్‌గా నర్వేకర్ ఎన్నికయ్యాక తీసుకున్న నిర్ణయాలపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ప‌రిణామాల‌పై సుప్రీంకోర్టులో ఐదు కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

15 మంది ఏకనాథ్ షిండే వ‌ర్గం ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేస్తూ డిప్యూటీ స్పీక‌ర్ తీసుకున్న నిర్ణ‌యంపై ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. అలాగే విశ్వాస ప‌రీక్ష‌లో బ‌ల నిరూప‌ణ చేసుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోషియారీ తీసుకున్న‌ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ శివ‌సేన ఒక పిటిష‌న్ వేసింది.

అలాగే షిండే ముఖ్య‌మంత్రిగా బ‌ల‌నిరూప‌ణ చేసుకున్న‌ప్పుడు విప్ ను ధిక్క‌రించి ఉద్ధ‌వ్ వ‌ర్గం ఎమ్మెల్యేలు ఆయ‌నకు వ్య‌తిరేకంగా ఓటేశార‌ని.. కాబ‌ట్టి వారిని అన‌ర్హులుగా ప్ర‌క‌టిస్తామ‌ని షిండే వ‌ర్గం కోర్టును ఆశ్ర‌యించింది. అయితే కోర్టు స్టే విధించింది. వీటిపై జూలై 27న సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది.