Begin typing your search above and press return to search.

చేతులు కాదు.. జెండాలూ క‌లుస్తాయి.. 2014 సీన్ రిపీట్‌!

By:  Tupaki Desk   |   18 Oct 2022 3:36 PM GMT
చేతులు కాదు.. జెండాలూ క‌లుస్తాయి.. 2014 సీన్ రిపీట్‌!
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్తో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. విజయవాడ నొవాటెల్‌ హోటల్‌కు వెళ్లి పవన్తో సమావేశమైన చంద్రబాబు.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇరువురు భేటీకి విశాఖలో పోలీసులు పవన్‌ కల్యాణ్ పట్ల వ్యవహరించిన తీరే సందర్బమైనప్పటికీ.. మున్ముందు ఈ బంధం ఏ దిశగా పయనిస్తుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ఇరువురు నేతలు బహిరంగంగా కలవడం ఇదే ప్రథమం.

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇలాగే హైదరాబాద్‌లో పవన్‌ నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. ఆయనతో భేటీ అనంతరం ఇరు పార్టీల మధ్య పొత్తు పొడిచింది. ఆ ఎన్నికల్లో జనసేన ప్రత్యక్షంగా పోటీ చేయనప్పటికీ.. తెలుగుదేశానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబుతో భేటీకి ముందు పవన్‌ కల్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. ఇవాళ్టి నుంచి రాజకీయ ముఖచిత్రం మారుతోందని... బీజేపీతో పొత్తు ఉన్నా ఎందుకో కలిసి వెళ్లలేకపోతున్నామని పవన్‌ అన్నారు.

ప్రధాని, బీజేపీ నాయకత్వం అంటే తనకు గౌరవముందన్న పవన్‌.. ఈ విషయం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తెలుసునని వ్యాఖ్యానించారు. గౌరవం ఉన్నంతమాత్రాన తాము ఊడిగం చేయలేమన్నారు.

బీజేపీ నేతలను రోడ్‌మ్యాప్‌ అడిగినా ఇవ్వలేదని.. ఈలోపు రౌడీలు రాజ్యమేలుతుంటే తన ప్రజలను రక్షించుకోవడానికి తాను వ్యూహాలు కూడా మార్చుకోవాల్సి వస్తుందని పవన్ తెలిపారు.

పవన్‌ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే చంద్రబాబు స్వయంగా విజయవాడలో పవన్ బస చేస్తున్న నొవాటెల్‌ హోటల్‌కు వెళ్లారు. పొత్తులపై ఇరు పార్టీలు అధికారిక ప్రకటన చేయనప్పటికీ కార్యకర్తలు, దిగువ శ్రేణి నాయకులు మాత్రం ఇప్పటికే ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే భావనతో మానసికంగా సిద్ధపడి ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని గతంలోనే పవన్‌ స్పష్టం చేశారు.

తాజా భేటీ మున్ముందు రెండు పార్టీల బంధాన్ని మరింత దగ్గర చేసేలా ఉంటుందని.. కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటు ప్రభావం చూపుతోంది...? విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? అనే కోణంలో చర్చోప చర్చలు జరిగాకే ఇరు పార్టీలు పొత్తులకు సంబంధించి ఉమ్మడి ప్రకటన చేయవచ్చనే భావన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్ర‌స్తుత ప‌రిణామాలు.. భ‌విష్య‌త్ రాజ‌కీయ చిత్రాన్ని క‌ళ్ల‌కు క‌డుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.