Begin typing your search above and press return to search.

ఇక 125 మీటర్ల ఎత్తు నుంచి విశాఖను చూడొచ్చు..?

By:  Tupaki Desk   |   6 Dec 2021 9:02 AM IST
ఇక 125 మీటర్ల ఎత్తు నుంచి విశాఖను చూడొచ్చు..?
X
125 మీటర్ల ఎత్తులో ఉండి భూమిని చూస్తే ఎలా ఉంటుంది..? అందులో ఓ వైపు సముద్రం.. మరోవైపు కొండలు.. ఇంకోవైపు సుందరమైన నగరం ఇలా చూస్తూ డిన్నర్ చేస్తే ఎలా ఉంటుంది..? వింటేనే ఆశ్చర్య కలుగుతున్న ఇలాంటి సౌకర్యం త్వరలో ఏపీలో అందుబాటులోకి రాబోతుంది. విమానంలో వెళ్లే వారికి తప్ప మాములు జనానికి ఇలా ఎత్తులో ఉండి చూడడం సాధ్యం కాదు.

కానీ ఏపీలో అందమైన నగరంగా పేర్కొంటున్న విశాఖలో ఎవరైనా ఈ విధంగా ఎంజాయ్ చేసేలా పర్యాటకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ‘లండన్ ఐ’ మాదిరిగా విశాఖలో జాయింట్ వీల్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో పర్యాటకులు అత్యంత ఎత్తుకు వెళ్లి ఓ వైపు సుముద్రాన్ని మరో వైపు భూమిని చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. అసలు లండన్ ఐ అంటే ఏమిటి..? దానిని విశాఖలో ఏ విధంగా ఏర్పాటు చేస్తారు..?

అంతర్జాతీయ పర్యాటకులను అకర్షించే విధంగా లండన్ నగరంలో ‘లండన్ ఐ’ ఏర్పాటు చేశారు. థేమ్స్ నది ఒడ్డున 130 మీటర్ల ఎత్తులో జాయింట్ వీల్ ను ఉంచారు. ఇందులో ఎక్కి లండన్ నగరాన్ని మొత్తం చూడొచ్చు. ఇలాంటి సదుపాయాన్ని ఇప్పుడు విశాఖలో ఏర్పాటు చేయనున్నారు.

విశాఖ సముద్రం ఒడ్డున 125 మీటర్ల ఎత్తుతో నుంచి నగర అందాలను వీక్షించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 15 ఎకరాల భూమి అవసరమని పర్యాటక అధికారులు గుర్తించారు. విశాఖ బీచ్ రోడ్డులో నాలుగు ప్రదేశాల్లో అధికారులు పరిశీలించారు.

అయితే భీమిలి వైపు వెళ్లే బీచ్ రోడ్డులో ఫైనల్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 250 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మెగావీల్ ను ఏర్పాటు చేస్తారు. ఇందులో మొత్తం 44 కేబిన్లు ఉంటాయి. ఒక్కో కేబిన్లో 10 మంది వరకు కూర్చొవచ్చు. ఒకేసారి 440 మంది ప్రయాణించవచ్చు.

కేబిన్లు మొత్తం గ్లాస్ తో ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా కేబిన్లో ఏసీ, వైఫై, ఆడియో, వీడియో సదుపాయం కూడా ఉంటుంది. అంతేకాకుండా పబ్లిక్ అనౌన్స్ మెంట్ కూడా ఉంటుంది. ఈ వీల్ ఒక రౌండ్ తిరగడానికి 20 నిమిషాలు పడుతుంది.

ఈ కేబిన్లో ఉన్న వారు 125 మీటర్ల ఎత్తుకు వెళ్లి రాత్రి డిన్నర్ కూడా చేసే అవకాశం ఉంటుంది. సముద్రం, కొండగాలుల మధ్య విశాఖ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూస్తే ఎంజాయ్ చేయవచ్చు.

విశాఖ నగరం నిత్యం తుఫాన్ల బారిన పడుతుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున జాయింట్ వీల్ ఏర్పాటు చేస్తే ఎలా..? అన్న విషయంపై కూడా అధికారులు ప్రణాళిక తయారు చేశారు. తుపాన్లతో పాటు 8.3 భూకంప తీవ్రతను తట్టుకునే విధంగా వీల్ నిర్మాణం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

అలాగే అత్యధిక ఉష్ణోగ్రతల నుంచి కూడా తట్టుకునేవిధంగా తయారు చేస్తారు. ఈ వీల్ లో గంటలకు 1,320 పర్యాటకులు వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల వీరికి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

జాయింట్ వీల్ తో పాటు కింద షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో దేశంలోనే కాకుండా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇక్కడ అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.

ఇప్పటికే ఆర్కే బీచ్, అరకు లాంటి పర్యాటక ప్రదేశాలను కలిగి ఉన్న విశాఖ జాయింట్ వీల్ తో మారింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయం తెలిసిన విశాఖ వాసులు లండన్ ఐ కోసం ఎదురుచూస్తున్నారు.