Begin typing your search above and press return to search.

కెనడాకు క్యూ కడుతున్న ఇండియా స్టూడెంట్స్ .. ఎందుకంటే

By:  Tupaki Desk   |   27 July 2021 9:36 AM GMT
కెనడాకు క్యూ కడుతున్న ఇండియా స్టూడెంట్స్ .. ఎందుకంటే
X
అమెరికా వెళ్లాలనుకున్న భారతీయ ఔత్సాహికులకు అమెరికా వీసా నిబంధనల దెబ్బతో బ్రేక్ లు పడ్డాయి. లక్షా తొంభై తొమ్మిది రూల్స్ తో, కఠినతరమైన నిబంధనల మధ్య అమెరికా వెళ్లి ,అక్కడ జాతి వివక్షను ఎదుర్కొనే కంటే ప్రత్యామ్నాయం చూసుకుంటే బెటరని చాలామంది భారతీయులు భావిస్తున్నారు. ఇక అలాంటి భారతీయులకు ప్రత్యామ్నాయంగా, స్వర్గధామంగా కనిపిస్తోంది కెనడా. ఇక అమెరికా వద్దు కెనడా ఈ ముద్దు అని అంటున్నారు ఇండియన్స్. గతంలో విదేశీ చదువులంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అగ్రరాజ్యం అమెరికానే. విదేశీ విద్య కోసం ఇంతకుముందు భారతీయ విద్యార్థులు ఎక్కువగా  అమెరికాకే వెళ్లేది.

కానీ, తాజాగా ఆ పరిస్థితి మారింది. ప్రస్తుతం మన విద్యార్థులు అత్యధికంగా కెనడా వైపు చూస్తున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.  విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ. మురళీధరన్ రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపిన వివరాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 99 దేశాల్లో 11.33 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదవుతుంటే.. వీరిలో అత్యధికంగా 2.15 లక్షల మంది కెనడాలో ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత 2.11 లక్షల మంది యూఎస్‌లో చదువుకుంటున్నారు. అంటే.. అగ్రరాజ్యం స్థానాన్ని కెనడా అక్రమించిదన్నమాట.

అమెరికా తర్వాత ఆస్ట్రేలియా(92,383), బ్రిటన్(55,465), న్యూజిలాండ్(30వేలు), చైనా(23వేలు) ఉన్నాయి. ఇక కెనడాలో భారత విద్యార్థుల సంఖ్య సంవత్సరాల వారిగా చూసుకుంటే క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2017లో 82,990 మంది ఉంటే.. 2018లో 1,07,175, 2019లో 1,39,740, 2021లో 2,15,720. అదే ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థులు గణాంకాలు.. 2017లో 5,53,400, 2018లో 7,52,725, 2021లో 11,33,749గా ఉన్నాయి.

అగ్రరాజ్యాన్ని కాదని భారత విద్యార్థులు కెనడాకు తరలిపోవడానికి ప్రధానం కారణం అమెరికా వీసా విధానాలే. వీసాల జారీని కఠినతరం చేయడం, ఉపాధి ఆధారిత హెచ్-1 బీతో పాటు ఇతర వీసాల్లో మార్పులు చోటు చేసుకోవడం, మన విద్యార్థులపై అక్కడి పోలీసుల నిఘా వంటి కారణాలు భారత విద్యార్థులను అమెరికా వద్దు అనుకునేలా చేశాయి. అదే సమయంలో కెనడా విదేశీ విద్యార్థులను ఆకర్షించే విధంగా స్టూడెంట్ వీసాలను జారీని సులభతరం చేయడంతో పాటు పలు వెసులుబాటులు కల్పించింది. ఒక్క ఏడాది కోర్సుకు రెండేళ్ల వర్క్ పర్మిట్, రెండేళ్ల పీజీ కోర్సుకు మూడేళ్ల పాటు వర్క్ పర్మిట్ ఇవ్వడం చేస్తోంది. అలాగే కెనడాలో పర్మినెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం రెండు నుంచి మూడేళ్లలోనే వచ్చేస్తుంది. ఇలా వీసా విధానంలో పలు కీలక మార్పులు చేయడంతో భారతీయ విద్యార్థులు కెనడాకు క్యూ కడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే అమెరికా తో పోల్చితే కెనడా వెళ్తే ఖర్చు కూడా దాదాపుగా 30 శాతం మేర తక్కువ అవుతుందట.