Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ :టోక్యో ఒలంపిక్స్‌ నుండి తప్పుకున్న కెనడా!

By:  Tupaki Desk   |   23 March 2020 12:07 PM GMT
కరోనా ఎఫెక్ట్ :టోక్యో ఒలంపిక్స్‌ నుండి తప్పుకున్న కెనడా!
X
ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో మృతి చెందారు. కొన్ని దేశాలు ఇప్పటికే షట్‌డౌన్ ప్రకటించాయి. ఇక కరోనావైరస్ ప్రభావం క్రీడారంగంను కూడా కుదిపేసింది. పలు మెగా టోర్నీలు ఇప్పటికే వాయిదా పడగా.. మరికొన్ని మాత్రం ఏకంగా రద్దయ్యాయి. కొందరు స్టార్ ప్లేయర్లు కరోనా భాదితుల లిస్ట్ లో ఉన్నారు. తాజాగా కరోనావైరస్ విజృంభిస్తుండటంతో ఈ సారి టోక్యో ఒలంపిక్స్ జరుగుతాయా లేదా అన్న అనుమానం నెలకొంది.

ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ నుంచి కెనడా తప్పుకుంటున్నట్లు పారాలింపిక్ కమిటీ - కెనడా ఒలింపిక్ కమిటీలు స్పష్టం చేశాయి. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ రెండు కమిటీలు వివరణ ఇచ్చాయి. కెనడా దేశం ప్రతినిధులు తమకి ప్రాణాల కంటే - ఇంకేమి ఎక్కువ కాదు అని - మా దేశం తరపున ఒక్కరు కూడా ఈ టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనరు అంటే స్పష్టం చేసింది. ఇక గడిచిన 48 గంటల్లో ఒలింపిక్స్ వాయిదా వేయాలనే వాదనలు కూడా పెరిగిపోతున్నాయి. కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో వాయిదా వేయడమే మంచిదని పలు దేశాల ఒలింపిక్ సంఘాలు సూచిస్తున్నాయి.

మొన్నటిదాకా షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని మాటిమాటికీ చెప్పిన నిర్వాహకులు... వారం నుంచీ సైలెంట్ అయిపోయారు. వాయిదా వేసి... వచ్చే ఏడాది జరపాలా లేక వేరే దేశంలో జరపాలా అన్న అంశంపై ఆలోచనల్లో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రీడల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జపాన్ ప్రభుత్వం మాత్రం వీటిని షెడ్యూల్ ప్రకారమే జరపాలని డిమాండ్ చేస్తోంది. షెడ్యూల్ ప్రకారమైతే టోక్యో ఒలింపిక్స్‌ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ జపాన్‌ తో పాటూ 192 దేశాల్లో విస్తరించింది. ఎక్కడికక్కడ లాక్ డౌన్లు ఉన్నాయి. విమాన సర్వీసులు సరిగా లేవు. అందుకే ఈ క్రీడలు ప్రస్తుత షెడ్యూల్‌ లో నిర్వహించడం కుదరదని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా క్రీడలు రద్దైనందున ఒలింపిక్స్ కూడా అదే రూట్‌లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికి ఒలంపిక్స్ మాత్రం వాయిదా పడలేదు. మరి తాజా రిక్వెస్ట్‌ లపై అంతర్జాతీయ ఒలంపిక్స్ సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.