Begin typing your search above and press return to search.

నారాయణకు బెయిల్ రద్దు చేయండి: చిత్తూరు కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

By:  Tupaki Desk   |   15 Jun 2022 5:35 AM GMT
నారాయణకు బెయిల్ రద్దు చేయండి: చిత్తూరు కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్
X
పదో తరగతి ప్రశ్నపత్రాల మాల్‌ప్రాక్టీస్ వ్యవహారంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను అసలు రిమాండ్‌ చేయకుండానే బెయిల్‌ ఇవ్వడం ఎలా సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన చిత్తూరు 9వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో వాదించారు. నారాయణకు చిత్తూరు మేజిస్ట్రేట్‌ కోర్టు జారీ చేసిన బెయిల్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. చిత్తూరులో పదో తరగతి తెలుగు కాంపోజిట్‌ ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీస్‌ వ్యవహారంలో నారాయణతో పాటు పోలీసులు మొత్తం 9 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

నారాయణను గత నెలలో అరెస్టు చేయగా అప్పటికప్పుడు బెయిల్‌ ఇస్తూ మేజిస్ట్రేట్‌ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రభుత్వం తరపున జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తాజాగా చిత్తూరులోని 9వ అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయస్థానంలో విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్‌ తరపున ఏఏజీ సుధాకర్‌రెడ్డి, హైకోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దుష్యంత్‌రెడ్డి, చిత్తూరు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లోకనాథరెడ్డి హాజరయ్యారు. చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి కూడా కోర్టుకు హాజరై వాదనలు విన్నారు.

ప్రశ్నపత్రం మాల్‌ ప్రాక్టీస్‌లో నారాయణ విద్యా సంస్థలకు నిందితుడు చైర్మన్‌ కాదని చెప్పడం, 41ఏ నోటీసు ఇవ్వలేదని మేజిస్ట్రేట్‌ బెయిల్‌ ఇవ్వడం న్యాయస్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు ఘటన స్థలంలో లేకపోయినా, అతని సూచనల మేరకు స్మగ్లింగ్‌ చేసినట్లు నిందితులు చెప్పడంతో ప్రధాన నిందితుడిపై కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టలేమని ఇటీవల హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుధాకర్‌రెడ్డి ప్రస్తావించారు.

ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే కేసుల్లోనే నిందితులకు 41ఏ నోటీసులు ఇవ్వాలని, నారాయణ కుట్ర రుజువైతే పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉండటంతో ఆయనకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరంలేదని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు, పలు రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను చదివి వినిపించారు. పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పొరపాట్లు చూపితే రిమాండును తిరస్కరించవచ్చని తెలిపారు. కానీ నారాయణ విషయంలో అసలు రిమాండే చేయకుండా బెయిల్‌ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.

ప్రశ్పత్రం మాల్‌ప్రాక్టీస్‌లో నారాయణ కుట్ర స్పష్టంగా ఉందని, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం సైతం ఉందని ఇదే కేసులో అరెస్టయిన గంగాధరరావు పోలీసుల కస్టడీలో అంగీకరించాడని ఏఏజీ తెలిపారు. నారాయణ తరపున మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ న్యాయస్థానానికి హాజరయ్యారు. తమ వాదనలు వినిపించడానికి గడువు కోరడంతో తదుపరి విచారణను జూన్ 24కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి శ్రీనివాసులు ఆదేశాలు జారీచేశారు.