Begin typing your search above and press return to search.

మునుగోడులో జేపీ నడ్డా మీటింగ్ రద్దు... అంటే బీజేపీ పీచే ముడ్?

By:  Tupaki Desk   |   28 Oct 2022 11:57 AM GMT
మునుగోడులో జేపీ నడ్డా మీటింగ్ రద్దు... అంటే బీజేపీ పీచే ముడ్?
X
మునుగోడు ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రూ.400 కోట్లతో బీజేపీ వల వేసిందనే వార్తలతో మరో మలుపు తిరిగింది. నిన్నటివరకు ప్రచార హోరు.. ప్రలోభాల జోరుతో సాగిన మునుగోడు ఇప్పుడంతా కొనుగోళ్ల తకరారులో మునిగింది. ఈ విషయంలో బీజేపీ ప్రలోభపెట్టిందనే వాదనను టీఆర్ఎస్ బలంగా తెరపైకి తెస్తోంది. దీంతో ఆత్మరక్షణలో పడిన బీజేపీ.. ఏం చేయాలో వ్యూహాలకు పదును పెడుతోంది.

వాస్తవానికి నలుగురు ఎమ్మెల్యేలకు వందల కోట్ల డీల్ నిజమే అయితే.. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి అది మైనస్ అవడం ఖాయం. దీనిని టీఆర్ఎస్ ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నదో.. బీజేపీ అంతే బలంగా తిప్పికొట్టగలగాలి. లేదంటే డ్యామేజీ జరిగిపోద్ది.

అధ్యక్షుడి సభ లేనట్టేనా..?ప్రతిష్ఠాత్మక మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. ప్రచారం పెద్దఎత్తున సాగుతున్న నేపథ్యంలో నడ్డా సభ బీజేపీ అభ్యర్థి గెలుపోటములను నిర్ణయించేది కానుంది. సభ సందర్భంగా నాయకులు చేసే ప్రసంగాలు.. ఇచ్చే హామీలు.. అభ్యర్థికి ప్లస్ ప్లాయింట్లు అవుతాయి. అన్నిటికి మించి సభ నిర్వహణకు జన సమీకరణ ద్వారా విజయావకాశాలకు సంబంధించి ఓ ఫీలర్ ను వదిలే అవకాశం ఉండేది. అయితే, జేపీ నడ్డా సభ రద్దయిందని అంటున్నారు.

పరిణామాలే కారణమా??టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ వందల కోట్ల ఆఫర్ ప్రకంపనలే మునుగోడులో జేపీ నడ్డా సభ రద్దుకు కారణంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పార్టీ దోషమేమీ లేదని తేలితే గానీ.. గట్టిగా వకాల్తా పుచ్చుకోలేని పరిస్థితి. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొని ప్రభుత్వాలను కూల్చిన నేపథ్యం బీజేపీకి ఉంది. దీంతోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో బీజేపీపై అనుమానాలు బలపడుతున్నాయి.

మళ్లీ ఉంటుందా..?సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడి సభ.. అదికూడా మునుగోడులాంటి చోట రద్దు కావడం అంటే అది ఆ పార్టీకి కొంత ఇబ్బందికరమే. హోరాహోరీ పోరు సాగుతున్న చోట బీజేపీ అభ్యర్థి విజయావకాశాలపై ప్రభావం చూపేదే.

అయితే, ప్రచారం నవంబరు 1తో ముగియనున్న నేపథ్యంలో జేపీ నడ్డా సభ మళ్లీ ఉంటుందా? అంటే చెప్పలేం..? నవంబరు 1న ప్రచారం ముగింపు సందర్భంగా సభ ఏర్పాటు చేయొచ్చు. లేదంటే పెద్దఎత్తున ర్యాలీ తీసేందుక అవకాశం కూడా ఉంది. ఇప్పటికైతే జేపీ నడ్డా సభ రద్దు.. మునుగోడులో బీజేపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.