Begin typing your search above and press return to search.

ఈసీ షాక్ : ఒకే అభ్య‌ర్థికి ఒకే చోట పోటీ

By:  Tupaki Desk   |   5 April 2018 6:23 AM GMT
ఈసీ షాక్ : ఒకే అభ్య‌ర్థికి ఒకే చోట పోటీ
X
రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేయ‌డం... ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేసే నాయ‌కుల‌కు షాక్ కొట్టే వంటి వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేయాలనే ప్రతిపాదనకు తాము మద్దతిస్తామని సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషన్‌(ఈసీ) స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో ఈసీ ఈ మేరకు తన సమాధానాన్ని అఫిడవిట్‌ ద్వారా తెలియజేసింది.

ఒక అభ్యర్థి రెండు చోట్ల పోటీచేసే విధానాన్ని రద్దుచేయాలని కోరుతూ బీజేపీ నేత అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది సీనియర్‌ నేతలు ఈ బహుళ విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఇలా ఉప ఎన్నిక‌ల వల్ల ప్ర‌జాధ‌నం దుర్వినియోగం అవ‌డం, నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి కుంటుప‌డ‌టం స‌హా ఇంకెన్నో స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ అంశంపై స్పందన తెలపాలని కోరుతూ గతేడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టు... కేంద్రప్రభుత్వం - ఈసీకి నోటీసులు జారీచేసింది. అదే సమయంలో ఒకే అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న కారణంగా రెండు స్థానాల్లో గెలిస్తే ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వస్తోందని, ఆ స్థానానికి మళ్లీ ఉప ఎన్నికలు అనివార్యమవుతున్నాయని కోర్టు పేర్కొంది.

దీనికి తాజాగా ఈసీ స్పందిస్తూ ఒక నాయ‌కుడు ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌నే నిబంధ‌న‌కు తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. కాగా, 2014 లోక్‌ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ గుజరాత్‌లోని వడోదర, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. దీంతో వడోదర నియోజకవర్గాన్ని వదులుకున్నారు. మూడు నెలల తర్వాత సెప్టెంబర్‌లో ఆ స్ధానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం గ‌జ్వేల్ అసెంబ్లీ నుంచి, మెద‌క్ పార్ల‌మెంటు నుంచి పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే.