Begin typing your search above and press return to search.

మార్పు.. టీడీపీని ముంచిందా?

By:  Tupaki Desk   |   16 May 2019 1:30 AM GMT
మార్పు.. టీడీపీని ముంచిందా?
X
టీడీపీ అంతర్గత కుమ్ములాటలు అక్కడ ఓటమికి దారితీస్తోందన్న చర్చ జోరుగా సాగుతోంది. 2014 ఎన్నికల్లో గంపగుత్తగా జిల్లా మొత్తం టీడీపీకే సపోర్ట్ చేసింది. కానీ 2019 ఎన్నికల వేళ అసమ్మతి, అసంతృప్తి వల్ల టీడీపీ టికెట్లు మార్చి కొత్తనేతలకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు వారి గెలుపు అంతా ఈజీ కాదన్న అంచనాలున్నాయి.. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆ మూడు నియోజకవర్గాల్లో ఇప్పుడు టీడీపీ క్యాడర్ గెలుపుపై సందేహాలు వ్యక్తం చేస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది.

కొవ్వూరు, చింతలపూడి, తాడేపల్లి గూడెం.. పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గాలు. ఈ మూడు నియోజకవర్గాల్లో అసమ్మతితో నేతలను మార్చి కొత్త వారికి చంద్రబాబు టికెట్లు ఇచ్చారు. దీంతో కిందిస్థాయి కేడర్ వారితో కలిసిపోలేదు. అంతర్గతంగా వైసీపీకి మద్దతు పలికారట.. దీంతో ఆ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపుపై ఆందోళనగా ఉందట టీడీపీ అధిష్టానం..

కొవ్వూరు నుంచి మంత్రి జవహర్ 2014 ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించారు. జవహర్ పై తీవ్ర వ్యతిరేత ఈ ఐదేళ్లలో వచ్చింది. ఆయన నాయకులను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. దీంతో కొవ్వూరు టీడీపీ నేతలు స్థానిక నేత అచ్చి బాబు వర్గం జవహర్ కు టికెట్ ఇస్తే ఓడిపోతాడని బాబుకు చెప్పడంతో జవహర్ ను కృష్ణా జిల్లా తిరువూరు మార్చారు. జవహర్ ప్లేసులో వివాదాస్పద నాయకురాలు వంగలపాటి అనితను బరిలో దింపింది. అయితే ఫైర్ బ్రాండ్ అనితకు సపోర్ట్ గా టీడీపీ నేతలు ఆ నియోజకవర్గంలో పనిచేయలేదట.. దీంతో అనిత గెలుపుపై బాబు సమీక్షలోనూ తేడా వచ్చినట్టు సమాచారం.

చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాత. సుజాత వ్యవహారశైలిపై, మార్కెట్ కమిటీ వ్యవహారంలో తనపైనే ఎదురు తిరుగడంతో ఎంపీ మాగంటి గుర్రుగా ఉండి ఆమెకు టికెట్ దక్కకుండా లాబీయింగ్ చేశారన్న ప్రచారం ఉంది. దీంతో సుజాతకు టికెట్ ఇవ్వకుండా టీడీపీ కర్ర రాజారావుకు ఇచ్చింది. దీంతో పీతల వెనుకున్న నేతలంతా వైసీపీలో చేరారు. దీంతో అక్కడ టీడీపీ ఎన్నికలకు ముందే డీలాపడింది. ఇక్కడ పట్టుబట్టి సీటు తెచ్చుకున్నా రాజారావుకు ఫలితం లేదన్న టాక్ వినిపిస్తోంది.

ఇక తాడేపల్లిగూడెంలోనూ కాపు ఓటు బ్యాంకు చూసి టీడీపీ ఈలి నానికి అధిష్టానం టికెట్ ను ఇచ్చింది. అక్కడ టికెట్ ఆశించిన జడ్పీచైర్మన్ ముల్లపూడి బాపిరాజు అలిగారు. చంద్రబాబు సర్ధి చెప్పినా ఆయన వ్యతిరేకంగా పనిచేశాడన్న ప్రచారం ఉంది. దీనికి అలిగిన టీడీపీ మరో నేత బొలిశెట్టి శ్రీనివాస్ జనసేనలోకి వెళ్లి పోటీచేశారు. ఇలా టీడీపీ కీలక నేతల సహాయ నిరాకరణతో ఈలినాని గెలుపుపై అంచనాకు రాలేకపోతుందట టీడీపీ అధిష్టానం.

ఇలా అసమ్మతి, అసంతృప్తి పేరు చెప్పి మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేసిన టీడీపీ ఇప్పుడు అక్కడ గెలుపుపై ఆశలను వదిలేసుకోవడం అధిష్టానాన్ని కలవరపెడుతోంది. రాబోయే మే 23న ఫలితాల్లో ఈ మూడు నియోజకవర్గాల ఫలితంపై జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.