Begin typing your search above and press return to search.

బీజేపీ, కాంగ్రెస్ లకు అభ్యర్థులు కావలెను..

By:  Tupaki Desk   |   13 March 2019 1:30 AM GMT
బీజేపీ, కాంగ్రెస్ లకు అభ్యర్థులు కావలెను..
X
ఏప్రిల్ 11న తొలి విడుతలోనే ఏపీలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు అయిన తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు ఎన్నికల యుద్ధంలోకి దిగడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇప్పటికే దాదాపు 15 రోజులుగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై సమీక్షిస్తున్న పార్టీలు కీలకమైన అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖారారు చేసే ప్రక్రియను పూర్తి చేశాయి. మూడు పార్టీల్లో జనసేనాని పవన్ మాత్రమే ఇప్పటికే అధికారికంగా 32 అసెంబ్లీ సీట్లు, 9 లోక్ సభ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు మొదట ప్రకటించారు. అందులో ఇద్దరి పేర్లు కూడా బయటకు వచ్చాయి.

కానీ దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన జాతీయ పార్టీలు బీజేపీ , కాంగ్రెస్ లు ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీకి అభ్యర్థులను ప్రకటించడానికి ఆపసోపాలు పడుతున్నాయి. ఆ రెండు పార్టీలకు సరైన అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు.. పలుకుబడి, డబ్బు ఉన్న జాతీయ పార్టీల సీనియర్ నేతలు ఇప్పటికే తమ దారి తాము చూసుకొని టీడీపీ, వైసీపీలో చేరిపోయారు.

కానీ ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన దిగ్గజ నేతలు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు, ఎన్ రఘువీరా రెడ్డి , చింతామోహన్ తదితరులు ఇంకా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని కొనసాగుతున్నారు.

ఇక లగడపాటి రాజగోపాల్ లాంటి డబ్బు, పరపతి ఉన్న పాత కాంగ్రెస్ నేతలు ఏపార్టీలోకి వెళ్లకుండా రాజకీయ సన్యాసం తీసుకొని రాజకీయాలకు దూరం జరిగారు. మరోసారి రాజకీయాల్లోకి వచ్చి వారి డబ్బు, సమయం వృథా చేసుకోకూడదనే ఉద్దేశంతో పాత కాంగ్రెస్ దిగ్గజాలంతా లగడపాటి వలే ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు.

అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని నమ్ముకొని కొంతమంది నేతలు ఆ పార్టీ తరుఫున ఏపీలో పోటీచేయడానికి ఉబలాటపడుతున్నారు. కొన్ని సీట్లలో పోటీచేసి ఓడినా రేపుపొద్దున కేంద్రంలో బీజేపీ వస్తే తమకు ఏదో పదవి కానీ, కాంట్రాక్టులు అయినా వస్తాయనే ఆశతో ఈ ధైర్యానికి ఒడిగడుతున్నారు. కానీ అలా బీజేపీ తరుఫున పోటీచేసే వ్యక్తుల జాబితా పెద్దగా లేదు. చాలా మంది ఇప్పటికే టీడీపీ, వైసీపీ వైపు చూస్తున్నారు. అక్కడ దక్కకపోతేనే బీజేపీని ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు.

నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవ్వడానికి కేవలం ఒక వారం మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు తమ పార్టీ తరుఫున పోటీచేయండంటూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే ఆ పనిచేయగా.. బీజేపీ కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమైందట.. జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఏపీలో ఇలా దారుణంగా తయారవ్వడం ఆ పార్టీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.