Begin typing your search above and press return to search.

టీడీపీకి అభ్యర్థుల షాక్

By:  Tupaki Desk   |   11 Nov 2021 4:30 PM GMT
టీడీపీకి అభ్యర్థుల షాక్
X
వార్డు స‌భ్యుడి నుంచి లోక్‌స‌భ స‌భ్యుడి వ‌ర‌కూ ఎన్నిక ఏదైనా ఖ‌ర్చు పెట్టందే విజ‌యం దక్క‌ద‌నేలా నేటి రాజ‌కీయ ప‌రిస్థితులు మారిపోయాయి. ఎన్నిక‌లో పోటీ చేసే అభ్య‌ర్థి ముందుగానే జేబు నిండా డ‌బ్బులు ఉంచుకోవాల్సిన దుస్థితి త‌లెత్తింది. ప్ర‌జ‌ల క‌టాక్షం కోసం న‌గ‌దు కురిపించ‌డం ప్ర‌చారానికి అధికంగా ఖ‌ర్చు చేయ‌డం నాయ‌కుల‌కు అల‌వాటైపోయింది. ఇలా డ‌బ్బులు పెట్టే స్థోమ‌త లేక చాలామంది నాయ‌కులు రాజ‌కీయాల్లో పోటి చేయ‌లేక‌పోతున్నారు. మ‌రోవైపు పార్టీని న‌మ్ముకుని బ‌రిలో నిల‌బ‌డ్డ‌ప్ప‌టికీ పార్టీ నుంచి స‌హ‌కారం లేక వెన‌క‌డుగు వేస్తున్నారు. తాజాగా ఆంధ‌ప్ర‌దేశ్‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థుల ప‌రిస్థితి ఇలాగే ఉంది.

కొన్ని చోట్ల పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్య‌ర్థులే దొర‌క‌పోగా.. మ‌రికొన్ని చోట్ల నామినేష‌న్ వేసిన అభ్య‌ర్థులు ఖ‌ర్చు భారం మోయ‌లేమ‌ని విత్‌డ్రా చేసుకుంటున్నారు. నెల్లూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌కు టీడీపీ ఒకేసారి 54 మంది అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించింది. అక్క‌డి స్థానిక నాయ‌కులే ఈ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశారు. వాళ్ల‌తో సంత‌కాలు పెట్టించి నామినేష‌న్లు వేయించారు. ప్ర‌చార ఖ‌ర్చు మొత్తం పార్టీనే చూసుకుంటుంద‌ని వాళ్ల‌కు చెప్పారు. కానీ తీరా స‌మ‌యం వ‌చ్చేస‌రికి ఆ టీడీపీ ఇంఛార్జులు చేతులెత్తేశార‌ని తెలిసింది. అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించే ముందు ప్ర‌చారానికి పార్టీ నుంచి డ‌బ్బులు ఇస్తామ‌ని చెప్పిన నేతులు ఇప్పుడు మాట మారుస్తున్నార‌ని స‌మాచారం. దీంతో సొంత ఖ‌ర్చుల‌తో తాము ప్ర‌చారం చేయ‌లేమ‌ని టీడీపీ డివిజ‌న్ అభ్య‌ర్థులు నామినేష‌న్లు విత్‌డ్రా చేసుకుంటున్నారు.

ఇప్ప‌టికే 54 మందిలో 11 మంది విత్‌డ్రా చేసుకున్నార‌ని స‌మాచారం. ఇక మ‌రికొంద‌రేమో ఎన్నిక‌ల ప్ర‌చారానికి డ‌బ్బుల ఎలా స‌ర్దుకోవాలో అనే ఆలోచిస్తున్న‌ట్లు తెలిసింది. ఇక కొంద‌రు అభ్య‌ర్థులేమో ప్ర‌చారానికి పార్టీ నుంచి డ‌బ్బులు పెడితేనే తాము పోటీలో ఉన్న‌ట్ల‌ని లేదంటే తాము ఎలాంటి ప్ర‌చారం చేసుకోమ‌ని స్థానిక నాయ‌కుల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేతిలో చావుదెబ్బ తిన్న బాబు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా పుంజుకుని తిరిగి అధికారం ద‌క్కించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు కూడా మొద‌లెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ బ‌లోపేతం కావాలంటే క్షేత్ర స్థాయిలో స‌ర్పంచ్‌లు కౌన్సిల‌ర్లు మేయ‌ర్లు కీల‌కమ‌వుతారు. కానీ వాళ్ల‌ను గెలిపించుకునే బాధ్య‌త‌నే పార్టీ తీసుకోవ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాళ్ల ప్ర‌చారానికి డ‌బ్బులు పెట్ట‌క‌పోతే ప్ర‌జ‌ల్లోకి ఎలా వెళ్తార‌నేది సందేహంగా మారింది.