Begin typing your search above and press return to search.

కొత్త పద్దతుల్లో గంజాయి సాగు

By:  Tupaki Desk   |   15 Nov 2021 4:29 AM GMT
కొత్త పద్దతుల్లో గంజాయి సాగు
X
గంజాయి సాగులో ఎప్పటికప్పుడు వ్యాపారస్తులు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. కొన్ని ఏజేన్సీ ఏరియాల్లో లేదా ఆంధ్రా ఒడిస్సా బార్డర్స్ (ఏవోబీ)లోని వేలాది ఎకరాల్లో మాత్రమే గంజాయి పండిస్తున్నారనే ప్రచారం తెలిసిందే. పై ప్రాంతాల్లో గంజాయి పండిస్తున్నారంటే అచ్చంగా వేలాది ఎకరాల్లో గంజాయిని డైరెక్టుగానే సాగుచేస్తున్నారు. అందుకనే ఇదే విషయమై స్పెషల్ డ్రైవ్ చేస్తున్న పోలీసులు చాలా సులభంగా గంజాయి పంటలను ధ్వంసం చేసేస్తున్నారు.

విశాఖ, గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాల్లో గంజాయిని ధ్వంసం చేసేందుకు పోలీసులు పెద్ద యాక్షన్ ప్లానే సిద్ధం చేసుకున్నారు. పైగా ఈ ప్రాంతాల్లో పండేదంతా శీలావతి అనే వైరెటీయేనట. దీనికే అంతర్జాతీయస్ధాయిలో మంచి ధరలున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే విశాఖ-తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు లో ఉన్న సీలేరు ప్రాంతంలో పెద్ద ఎత్తున గంజాయి సాగు జరుగుతోందని పోలీసులకు సమాచారం అందిందట. దీంతో తూర్పు ఎస్పీ రవీంద్రనాద్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ జరిగింది.

ఈ సమయంలో గంజాయి సాగును చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారట. ఎందుకంటే అక్కడ పెద్దఎత్తున మిరపతోటలే కనబడ్డాయట. తామేమన్నా పొరబాటున ఇక్కడికి వచ్చామా అని ముందు అనుకున్నారట. అయితే పొలాల్లోకి దిగిన తర్వాత కానీ అసలు విషయం బయటపడలేదట. ఏమిటంటే మిరపతోటల్లోనే అంతర్ పంటగా కొందరు గంజాయిని సాగు చేస్తున్నారట. ఇతర పంటలతో కలిపి గంజాయిసాగు చేయటాన్ని పోలీసులు ఇక్కడే మొదటిసారి గమనించారట.

మిరప, గంజాయి మొక్కలు దాదాపు ఒకే ఎత్తులో ఉంటాయట. అందుకనే మిరపమొక్కల మధ్య పెరుగుతున్న గంజాయి మొక్కలను గంజాయిని పోలీసులు తొందరగా గుర్తించలేకపోయారట. దాంతో ఇపుడు స్పెషల్ డ్రైవ్ ఎక్కడ చేసినా అన్నీ తోటల్లో కూడా పోలీసులు అదేపనిగా గంజాయి కోసం వెతుకుతున్నారు. ఒక లెక్క ప్రకారం గంజాయి ఎకరా సాగుకు రు. 30 వేలు ఖర్చవుతుంది. పంటను అమ్మితే రు. 6 లక్షలు వస్తాయట. ఇంత తక్కువ పెట్టుబడితో ఇంత పెద్దఎత్తున ఆదాయం ఏ పంటల్లోను రాదు. అందుకనే రైతులు కూడా క్రమంగా గంజాయిసాగుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

విశాఖ మన్యంతో పాటు లంబసింగి, అరకు, సీలేరు ప్రాంతం, ఏవోబీ ఏరియా, రంపచోడవరం, మారేడుమిల్లి, గుత్తేడు ప్రాంతాలతో పాటు తెలంగాణాలోని ఏటూరినాగారం, నర్సంపేట, భూపాలపల్లి, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్లు సమాచారం. ఒకవైపు పోలీసుల ఎంతగా స్పెషల్ డ్రైవులు చేస్తున్నా మరోవైపు అదేస్ధాయిలో సాగు జరుగుతునే ఉండటం విచిత్రంగా ఉంది. ఇంతగా గంజాయిసాగు, రవాణా, వ్యాపారం జరుగుతోందంటే వ్యాపారస్తులకు రాజకీయ, అధికార మద్దతు లేకుండా సాధ్యంకాదని తెలిసిందే. కాబట్టి ముందు పై రెండింటిని కంట్రోల్ చేస్తేకానీ అసలు సమస్య కంట్రోల్ కాదు.