Begin typing your search above and press return to search.

మోడీకి మంట పుట్టే మాట‌న్న మిత్రుడు

By:  Tupaki Desk   |   14 March 2016 5:13 PM GMT
మోడీకి మంట పుట్టే మాట‌న్న మిత్రుడు
X
బ‌య‌టోళ్లు నాలుగు మాట‌లు అన్నా ఫ‌ర్లేదు. కానీ.. ఇంట్లో వాళ్లు ఒక్క‌మాట అంటే పొడుచుకొస్తుంది. ఇక‌.. న‌లుగురు దుమ్మెత్తి పోసే విష‌యంలో ఇంట్లో వాళ్లు త‌ప్పు ప‌డితే ప‌రిస్థితి ఎలా ఉంటుంది? తాజాగా మోడీ స‌ర్కారు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటోంది. లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా బ్యాంకుల‌కు రూ.9వేల కోట్లు బ‌కాయిలు ప‌డి.. వాటిని చెల్లించ‌కుండా దేశం విడిచి వెళ్లిపోవ‌టం తెలిసిందే.

ఆయ‌న‌పై లుకౌట్ నోటీసులు ఉన్నా.. ఆయ‌న దేశం దాటి వెళ్ల‌టంపై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విప‌క్షాలు.. మోడీ స‌ర్కారు తీరుపై మండిప‌డుతున్న వేళ‌.. ఎన్డీయేలో మిత్ర‌ప‌క్ష‌మైన శివ‌సేన తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అప్పు తీసుకొని మోసం చేసిన కేసులో కింగ్‌ ఫిష‌ర్ విమాన‌యాన సంస్థ మాజీఛైర్మ‌న్ విజ‌య్ మాల్యా ప‌ట్ల కేంద్రం ఉదాసీన‌త వ్య‌క్తం చేస్తుందంటూ శివ‌సేన విరుచుకుప‌డింది.

దేశానికి చెందిన ఒక పారిశ్రామిక‌వేత్త‌నే తిరిగి దేశానికి తిరిగి ర‌ప్పించ‌లేని కేంద్రం.. అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంను దేశానికి ఎలా తీసుకొస్తుంద‌ని ప్ర‌శ్నించింది. విజ‌య్ మాల్యా.. ల‌లిత్ మోడీ లాంటి వారు దేశాన్ని దాటేలా ప‌రిస్థితులు ఉండ‌టంపై శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. మ‌న‌దేశ పౌరుల్నే వెన‌క్కి రప్పించే స్థితిలో లేక‌పోతే.. దావూద్ లాంటి బ‌డా డాన్ ల‌ను దేశానికి రప్పిస్తామంటూ బ‌డాయి మాట‌లు చెప్ప‌టం ఏమిటంటూ మండిప‌డ్డారు. మాల్యా ఇష్యూలో విప‌క్షాలే కాదు.. బీజేపీ మిత్ర‌ప‌క్షం కూడా మండిప‌డ‌టం క‌మ‌ల‌నాథుల‌కు కంగారు పెట్టే అంశంగా చెప్పొచ్చు.