Begin typing your search above and press return to search.

రాజధాని అమరావతి.. అసలు అంశంపై తేల్చని సుప్రీంకోర్టు!

By:  Tupaki Desk   |   29 Nov 2022 5:43 AM GMT
రాజధాని అమరావతి.. అసలు అంశంపై తేల్చని సుప్రీంకోర్టు!
X
ఆరు నెలల్లో అమరావతి రాజధానిని నిర్మించాలని ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో జారీ చేసిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంతోపాటు ఒక రాజధానిని విభజించి మూడు రాజధానులను చేసే అధికారం, ఏపీ రాజధానిని మార్చడానికి, వీటిపైన చట్టం, తీర్మానం చేసే అధికారం ఏపీ అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టులో జగన్‌ ప్రభుత్వం సవాల్‌ చేసింది.

ఈ పిటిషన్లపై గత కొన్ని రోజులుగా విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని మార్చడానికి, రాజధాని నగరాన్ని రెండు, మూడుగా విభజిస్తూ తీర్మానం కానీ, చట్టం కానీ చేసే శాసనాధికారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు లేదని ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పూర్తి స్థాయిలో అన్ని అంశాలపైన వాదనలు విన్నాకే దీనిపై తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు తాజాగా తెలిపింది.

అయితే రాజధాని ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి నిర్దిష్ట గడువు విధిస్తూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసిన ఏడు అంశాల్లో అయిదింటిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వుల ఇచ్చే వరకు ఈ స్టే అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్‌ చివరి వారంలోపు అందరూ అందుకు సమాధానం ఇవ్వాలంటూ విచారణను 2023 జనవరి 31కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, రాజ్యసభ ఎంపీ నిరంజన్‌రెడ్డి, అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం, సీనియర్‌ అడ్వకేట్‌ నఫ్డే వాదనలు వినిపించారు. రైతుల తరఫున సీనియర్‌ అడ్వకేట్లు ఫాలీ ఎస్‌.నారిమన్, శ్యాం దివాన్, ఆదినారాయణరావులు వాదనలు వినిపించారు.

తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ... ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సవాల్‌ చేసిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ చట్టాన్ని ఏపీ ప్రభుత్వమే గతేడాది నవంబరు 15న ఉపసంహరించుకుందన్నారు. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుందని వెల్లడించారు. చేసిన చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ.. మూడు రాజధానుల అంశాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఉత్తర్వులు జారీ చేస్తే కోర్టులు ప్రభుత్వ శాసనాధికారాల్లో జోక్యం చేసుకున్నట్లే అవుతుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఫలానా విధానంలో బిల్లును ఆమోదించాలనే అధికారం, ఫలానా చట్టాన్ని చేయొద్దని చెప్పే అధికారం హైకోర్టుకు లేదన్నారు. రాష్ట్ర రాజధానిపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని.. పార్లమెంటుకు మాత్రమే ఉందని చెప్పడం కూడా తప్పేనని ధర్మాసనానికి వేణుగోపాల్‌ తన వాదన వినిపించారు.

ఒకసారి చట్టాన్ని ఉపసంహరించుకున్నాక దాని స్థానంలో శాసనసభ మరో చట్టం తెచ్చే వరకూ హైకోర్టు వేచిచూడాలని ఏపీ ప్రభుత్వ తరఫున న్యాయవాది వేణుగోపాల్‌ కోరారు. కానీ ఏపీ ప్రభుత్వం తాను చేసిన చట్టాన్ని ఉపసంహరించుకున్నాక కూడా ఒక్కో విషయాన్ని పరిగణనలోకి తీసుకొని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.

కేకే వేణుగోపాల్‌ వాదనలపై న్యాయమూర్తి జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ... రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సమకూరుస్తోందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు దాదాపు రూ.15 వేల కోట్లు అమరావతి కోసం ఖర్చు పెట్టారన్నారు. 29 వేల మంది చిన్న, సన్నకారు రైతులు రాజధాని కోసం భూములిచ్చారని గుర్తు చేశారు. ఇందుకు చట్టబద్ధమైన ఒప్పందం కూడా ఉందన్నారు. ఈ ఒప్పందం మేరకు రైతులకు ఏటా 10% పెంపుదలతో కౌలుతోపాటు అభివృద్ధి చేసిన స్థలాలను ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం భారీగా పెట్టుబడి పెట్టిందన్నారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టానికి లోబడి హైకోర్టు అమరావతి నుంచే పనిచేస్తుందని రాష్ట్రపతి 2018లో నోటిఫికేషన్‌ ఇచ్చారు కదా న్యాయమూర్తి జస్టిస్‌ జోసెఫ్‌ ఏపీ ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్‌ను ప్రశ్నించారు. దాని ప్రకారం హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఎక్కడి నుంచి పనిచేయాలో పార్లమెంటు మాత్రమే నిర్దేశించగలుగుతుందని తెలిపారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా మీరు హైకోర్టు ప్రధాన ధర్మాసనం కర్నూలులో పెడతామని ప్రతిపాదించారు కదా అని ప్రశ్నించారు. దీనికి వేణుగోపాల్‌ స్పందిస్తూ ఆ ప్రతిపాదన ఇప్పుడు లేదని.. మూడు రాజధానుల చట్టంతోనే అది రద్దయిపోయిందన్నారు.

జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ.. ప్రస్తుతం రైతుల ప్రాథమిక హక్కులకు ముప్పు పొంచి ఉందన్న అనుమానం ఉందన్నారు. బహుశా దాని ప్రాతిపదికనే హైకోర్టు కూడా తీర్పు ఇచ్చి ఉండవచ్చన్నారు. అందువల్ల మీరు వాస్తవంగా ఏం చేయాలనుకుంటురో స్పష్టంగా చెప్పండి అని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్‌ను ఆదేశించారు.

ధర్మాసనంలో మరో న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని ఎక్కడికి మార్చాలనుకుంటోందని ప్రశ్నించారు. అది శాసనసభ నిర్ణయిస్తుందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్‌ జవాబిచ్చారు. ఇక్కడ హైకోర్టు.. ‘ఎ’ కేపిటల్‌ కాదు.. ‘ది’ కేపిటల్‌ అని చెప్పింది కదా అని జస్టిస్‌ జోసెఫ్‌ గుర్తుచేశారు. జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారాల విభజన లేదా? హైకోర్టే కార్యనిర్వాహక వ్యవస్థగా వ్యవహరిస్తోందా అని ప్రశ్నించారు. ఈ అంశాలను తాము పూర్తిగా పరిశీలించాల్సి ఉందని.. అందుకే ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం రాజధానిని మార్చితే భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏమిటని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. దీనికి ఏపీ ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్‌ స్పందిస్తూ పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నందున ఇప్పుడు 2014 నాటి చట్టమే అమల్లో ఉంటుందన్నారు.

జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకుంటూ .. ప్రభుత్వం ఎన్ని నగరాలైనా అభివృద్ధి చేసుకోవచ్చు. అన్నింటినీ ఒకే ప్రాంతంలో పెట్టడానికి బదులు ఎక్కువ పట్టణ కేంద్రాలు రావడం మేలన్నారు. వాటిని ఎక్కడ పెట్టాలన్నది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలన్నారు. ఈ విషయంలో హైకోర్టు తన హద్దులను దాటినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతుల హక్కుల సంగతేంటి అని న్యాయమూర్తి జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ అమరావతిని రాజధానిగా తొలగించలేదన్నారు. మూడు పాలనా కేంద్రాల్లో అదీ కూడా ఒకటి అని తెలిపారు. ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అక్కడ లేఅవుట్ల అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు మీరు ఎలా కాపాడతారన్నదే తమకు సమస్యగా కనిపిస్తోందని జస్టిస్‌ జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. ఇప్పటి వరకు అమరావతిలో రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. అందులో రూ.2 వేల కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయిదేళ్లలో వెచ్చించింది కేవలం రూ.3 వేల కోట్లేనన్నారు. ఈ మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి కోసం రూ.1.09 లక్షల కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ మొత్తం రూ.2 లక్షల కోట్ల వరకు పోవచ్చన్నారు. ప్రస్తుత బడ్జెట్‌ కేటాయింపుల ప్రకారం చూస్తే అభివృద్ధి అంతా పూర్తవడానికి 40–50 ఏళ్లు పడుతుందని చెప్పారు.

జస్టిస్‌ జోసెఫ్‌... హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన మార్గదర్శకాలపై ఈ కేసును విచారించడానికి తాము సుముఖంగా ఉన్నామని తెలిపారు. ఆలోపు మీరు మధ్యంతర ఉత్తర్వులుగా ఏం కోరుకుంటున్నారని నిరంజన్‌రెడ్డిని ప్రశ్నించారు. రాజధానిని నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్న హైకోర్టు తీర్పులోని అంశంపై స్టే ఇవ్వాలని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలిపెట్టాలని ఏపీ ప్రభుత్వం తరపున మరో న్యాయవాది వేణుగోపాల్‌ కోరారు. అలా స్టే ఇస్తే మీకు కొత్తగా చట్టం చేయడానికి స్వేచ్ఛనిస్తుంది కదా అని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. అలా చేస్తే ఈ కేసు విచారణే నిరర్థకంగా మారుతుందన్నారు. అది తుది విచారణ సమయంలో పరిశీలించాల్సిన అంశమని వ్యాఖ్యానించి స్టే ఇవ్వడానికి నిరాకరించారు.

రైతుల తరఫున ప్రముఖ న్యాయవాది నారిమన్‌ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రాల సరిహద్దులను మార్చడం, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకే వస్తుందని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టంగా గతంలోనే చెప్పిందని గుర్తు చేశారు. అందువల్ల పార్లమెంటు ఒక కేపిటల్‌ అని చెబితే దాన్నే అనుసరించాలన్నారు. అందువల్ల రాజధానులను ఎంచుకోవడానికి వీల్లేదని తెలిపారు. జస్టిస్‌ జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ.. రాజధాని ఫలానా చోటే ఉండాలని పార్లమెంటు చట్టంలో ఎక్కడా లేదు కదా? అని ప్రశ్నించారు. నారిమన్‌ స్పందిస్తూ.. అది రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోని అంశం కాదన్నారు. ఆర్టికల్‌ 3, 4 ప్రకారం ఒకే రాజధాని ఉండాలని పార్లమెంటు చెప్పిందని, అందువల్ల మూడు రాజధానులు ఉండటానికి వీల్లేదని తెలిపారు.

రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ.. గత రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ప్రాంతంలోకి వెళ్లి రాజధాని నిర్మాణం కోసం మీ భూములు ఇవ్వండి అని రైతులను అడిగిందన్నారు. దానివల్ల మీకు చాలా ప్రయోజనాలు వస్తాయని ప్రభుత్వం చెప్పడంతో ఎన్నో శతాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్న రైతులు 33 వేల ఎకరాలను రాజధాని కోసం ఇచ్చారన్నారు. నిర్దిష్ట వ్యవధిలో రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పడంతో అక్కడ ఏదో ఒక దుకాణం పెట్టుకొని బతకొచ్చు, పిల్లలు బాగుపడతారని రైతులు నమ్మారన్నారు.
అయితే జగన్‌ ప్రభుత్వం హైకోర్టు భవనం శంకుస్థాపన తర్వాత వదిలేసిందన్నారు. వివిధ గృహనిర్మాణాలను పూర్తిగా పక్కనపెట్టేసిందని న్యాయస్థానం దృష్టికి రైతుల తరఫు న్యాయవాది శ్యాందివాన్‌ తెచ్చారు. రోడ్లు కూడా వేయలేదన్నారు. జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ హైకోర్టు నెల రోజుల్లోపు పనులు పూర్తి చేయాలని ఎలా చెబుతుందని ప్రశ్నించారు. శ్యాందివాన్‌ స్పందిస్తూ రైతులకు కేటాయించిన భూముల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదని, అందుకే కోర్టు నిర్దిష్ట గడువు విధించిందన్నారు.

జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకుంటూ ఆ ప్రాంతాన్ని రాజధానిని చేయడం, లేదంటే నగరంగా మార్చడం అన్నది వేరే విషయం.. కానీ ఇలాగే చేయాలని చెప్పడానికి హైకోర్టు ఏమైనా టౌన్‌ప్లానింగ్‌ చీఫ్‌ ఇంజనీరా? ఇవేం ఉత్తర్వులు? అని ప్రశ్నించింది. రెండు నెలల్లో కనీసం డ్రాయింగ్‌లు కూడా తయారుచేయలేరు కదా? అలాంటప్పుడు మొత్తం నగరాన్నే నిర్మించాలని కోర్టు ఎలా చెబుతుంది? అని ప్రశ్నించారు. కార్యనిర్వాహక అధికారాలను హైకోర్టు తన చేతుల్లోకి తీసుకొని ఇలా ఉత్తర్వులు జారీ చేయొచ్చా అని ప్రశ్నించారు. కోర్టులు ప్రభుత్వాలు కాదన్నారు. శ్యాందివాన్‌ బదులిస్తూ రైతులతో కుదుర్చుకున్న చట్టబద్ధమైన ఒప్పందానికి లోబడే కోర్టు ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.


హైకోర్టు ఆదేశాల్లోని 1, 2 అంశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినందున దానిపై స్టే ఇవ్వబోమన్నారు. డిసెంబర్‌ చివరి వారానికల్లా అందరూ అఫిడవిట్లు దాఖలు చేయాలని పేర్కొన్నారు. జనవరి 31న ఈ కేసులను టాప్‌ ఆఫ్‌ ది బోర్డులో ఉంచాలని ఆదేశించారు. అప్పటి వరకు ఈ కేసులో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వుల్లోని 3 నుంచి 7 వరకు ఉన్న అంశాలపై స్టే ఇస్తున్నట్లు చెప్పారు.

సుప్రీంకోర్టు స్టే ఇవ్వని అంశాలు ఇవి..
1. భూసేకరణ నిబంధనలు– 2015లోని షెడ్యూల్‌ 2, 3ల్లో పొందుపరిచిన బాధ్యతలను ఏపీసీఆర్‌డీఏ నిర్వర్తించాలి.
2. రైతుల నుంచి సమీకరించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏపీసీఆర్‌డీఏ కానీ రాజధాని నిర్మాణం, రాజధాని ప్రాంత
అభివృద్ధి కోసం మినహా ఇతరులకు ధారాదత్తం చేయకూడదు. తనఖా పెట్టకూడదు. మూడో పార్టీకి ప్రయోజనాలు కల్పించరాదు.

సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన అంశాలివి..
1. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏలు హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన నెల రోజుల్లో అమరావతి రాజధాని నగరం, ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్తు లాంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి.
2. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏలు టౌన్‌ప్లానింగ్‌ స్కీమ్‌లు పూర్తి చేయాలి.
3. రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లోపు అమరావతి నగరం, రాజధాని ప్రాంతాన్ని నిర్మించి, అభివృద్ధి చేయాలి.
4. అమరావతి రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లలో ప్రతిదానికీ అప్రోచ్‌ రోడ్లు, తాగునీరు, విద్యుత్తు కనెక్షన్, డ్రైనేజీ సౌకర్యాలను కల్పించి అమరావతి రాజధాని నగరంలో నివసించడానికి యోగ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ అభివృద్ధి చేయాలి.
5. రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా అభివృద్ధి చేసిన ప్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏలు మూడు నెలల్లోపు రైతులకు అందించాలి.

సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. కొన్ని అంశాలు అమరావతి రైతులకు.. అమరావతిని రాజధానిగా కోరుకునే వారికి అనుకూలంగా ఉంటే.. మరికొన్ని అంశాలు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో.. ఎవరి వాదన వారు వినిపించటం.. సుప్రీం చెప్పిన అంశాల్ని హైలెట్‌ చేయటం, తమకు అనుకూలంగా ఉన్న అంశాల గురించి ప్రచారం చేసుకోవటంతో సుప్రీంకోర్టు అసలేం చెప్పింది? అసలేం జరుగుతుంది? అన్నది ప్రశ్నగా మారింది. అంతేకాదు.. ఈ కేసులో ప్రతివాదులందరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. డిసెంబరు చివరి వారం లోపు అందరూ తమ నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని పేర్కొంది. తదుపరి విచారణను జనవరి (2023) 31కు వాయిదా వేసింది. దీంతో తర్వాత పరిణామాల కోసం జనవరి 31 కోసం ఎదురు చూడాల్సిందే. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందనేదానిపై ఆసక్తి నెలకొంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.