Begin typing your search above and press return to search.

రాజుకుంటున్న క్యాపిటల్ వివాదం

By:  Tupaki Desk   |   19 Dec 2021 4:29 AM GMT
రాజుకుంటున్న క్యాపిటల్ వివాదం
X
ఏ ముహూర్తంలో అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ప్రకటించాలని పాదయాత్ర, బహిరంగ సభ జరిగిందో మూడు రాజధానుల డిమాండ్ తొందరలో మరో పాదయాత్ర, బహిరంగ సభ జరగబోతోంది. జనవరిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి మూడు రాజధానులకు మద్దతుగా భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించబోతున్నట్లు రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ప్రకటించింది. 17వ తేదీన తిరుపతిలో అమరావతికి మద్దతుగా రాజకీయ పార్టీలు, అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగిన విషయం తెలిసిందే.

ఆ మరుసటి రోజు అంటే 18వ తేదీ శనివారం మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో మరో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో మాట్లాడిన వక్తలంతా మూడు రాజధానుల ఏర్పాటు అవసరాన్ని గట్టిగా చెప్పారు. అమరావతి సభకు వచ్చినంత స్వచ్ఛందంగా జనం తరలిరాలేదు. వేరే కారణం చెప్పి జనాన్ని తరలించినట్టు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సభ జరుగుతుండగా జనం బయటకు పోతుంటే గేట్లేసి వారిని ఆపినట్టు కూడా వీడియోలు బయటకు వచ్చాయి. ఈ బహిరంగ సభలో ప్రత్యక్షంగా అధికార వైసీపీ నేతలు కనపడలేదు. వీరి వెనుక వైసీపీ సర్కారు ఉన్న విషయం సాక్ష్యాలతో సహా బయటపడింది. ఇదంతా సాక్ష్యాలతో దొరికితే తమ బహిరంగ సభకు రాజకీయ రంగు అవసరమే లేదని వక్తలు చెప్పటం గమనార్హం.

జనవరిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తామన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు డిమాండ్ తో చేయబోతున్న పాదయాత్రలో అన్ని వర్గాలను కలుపుకుని వెళతామన్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా అమరావతిలోనే భారీ బహిరంగసభ కూడా నిర్వహించబోతున్నట్లు వేదిక నిర్వాహకులు ప్రకటించారు. యాక్షన్ ప్లాన్ విషయమై ఉత్తరాంధ్ర ఐక్యవేదిక నిర్వాహకులు, ఇతర ప్రముఖులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.

13 జిల్లాల రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు రాజధానుల వికేంద్రీకరణ కూడా జరగాల్సిందే అని సభలో వక్తలు డిమాండ్ చేశారు. సరే ఇక్కడ గమనించాల్సిందేమంటే అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్న వారు నిరంతరాయంగా ఉద్యమం చేస్తున్నారు. అలాగే మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పాటు జరగాల్సిందే అని డిమాండ్ చేస్తున్న వారు మాత్రం అపుడపుడు సభలు ర్యాలీలు చేస్తున్నారు. మరి తొందరలో పెట్టబోతున్న మూడు రాజధానుల బిల్లు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయనే విషయం ఎవరికీ తెలీదు.

అమరావతి పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. బహిరంగ సభ కూడా సజావుగా జరిగిపోయింది. మరి జనవరిలో మొదలవ్వనున్న పాదయాత్ర, అమరావతిలో జరగనున్న బహిరంగ సభ ఎలా జరుగుతుందో చూడాల్సిందే. మొత్తానికి పాదయాత్రలు, బహిరంగ సభలతో క్యాపిటల్ వివాదమైతే బాగానే రాజుకుంటోంది. చివరకు ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే.