Begin typing your search above and press return to search.

ఏపీ.. కీలక అంశం తేలకుండానే ముగిసిన 2022!

By:  Tupaki Desk   |   1 Jan 2023 7:17 AM GMT
ఏపీ.. కీలక అంశం తేలకుండానే ముగిసిన 2022!
X
2022 ముగిసి 2023 వచ్చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ మాత్రం రాజధాని లేకుండానే 2022ని గడిపేసింది. ఈ కీలక అంశం ఈ ఏడాది తేలనే లేదు. జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెచ్చి.. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించడం, ఏపీ ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానుల చట్టం, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు చట్టం వంటివి చెల్లవని ఏపీ హైకోర్టు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

ముఖ్యంగా ఆరు నెలల్లో అమరావతిలో మౌలిక వసతులు కల్పించాలని.. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని హైకోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చివర వరకు వ్యూహాత్మక మౌనం పాటించిన జగన్‌ ప్రభుత్వం చివరకు సుప్రీంకోర్టులో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేసింది. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

అయితే ఆరు నెలల్లో మౌలిక వసతులు కల్పించాలన్న హైకోర్టు నిర్ణయాన్ని మాత్రమే సుప్రీంకోర్టు నిలిపేసింది. అంతేతప్ప మూడు రాజధానులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు. దీనికి సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉందని పేర్కొంది.

మరోవైపు జగన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో ఏపీ హైకోర్టు ఉన్న ప్రాంతం నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారు. దీనికి మొదట ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయితే రైతులు కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుని విజయవంతంగా పాదయాత్రను పూర్తి చేశారు.

మళ్లీ మలి విడత పాదయాత్రగా అమరావతి నుంచి అరసవల్లి వరకు పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్రను ఉత్తరాంధ్రపై దాడిగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అభివర్ణించారు. ఈ యాత్రను అడ్డుకుంటామని.. అవసరమైతే దాడి కూడా చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ యాత్రకు కూడా యధావిధిగా జగన్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మరోమారు రైతులు హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు.

రైతులు పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించగానే ప్రభుత్వం వారిని రకరకాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజమండ్రి బ్రిడ్జి మరమ్మతుల్లో ఉందని.. అటు వెళ్లడానికి వీల్లేదని అప్పటికప్పుడు అధికారులతో ఆంక్షలు విధింపజేసింది. రాజమండ్రిలో వైసీపీ ఎంపీ భరత్‌ ఆధ్వర్యంలోనే రైతులపై దాడి జరిగిందని ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇక రైతులు కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం చేరుకోగానే పాదయాత్ర చేస్తున్న రైతులకు ఐడీ కార్డులు లేవని పోలీసులు యాత్రను ఆపేశారు. హైకోర్టు 600 మందికి మాత్రమే అనుమతి ఇస్తే.. వేలాది మంది యాత్ర చేస్తున్నారని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ «ఘటనకు కొద్ది రోజుల ముందే విశాఖపట్నంలో మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ గర్జన నిర్వహించింది. ఇలా మూడు రాజధానుల అంశం తేలలేదు.. మరోవైపు ఒక్క రాజధాని కూడా లేకుండానూ పోయింది. స్వయంగా హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్‌.. ఢిల్లీలో చదువుతున్న తన కుమార్తెను ఆమె స్నేహితులు మీ రాజధాని ఏదంటూ ఆటపట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఇలా 2022 రాజధాని అంశం తేల్చకుండానే ముగిసింది. 2023లో అయినా సుప్రీంకోర్టు ఈ దిశగా నిర్దేశం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.